వెరైటీ థెరపీలు... విలువైన ప్రయోజనాలు! | Different Therapy techniques | Sakshi
Sakshi News home page

Types Of Play Therapy: వెరైటీ థెరపీలు... విలువైన ప్రయోజనాలు!

Published Fri, Sep 24 2021 11:30 AM | Last Updated on Fri, Sep 24 2021 12:17 PM

Different Therapy techniques - Sakshi

రాతి పనిముట్ల వాడకం మొదలెట్టడంతో మానవ పరిణామ క్రమంలో నూతనాధ్యాయం ఆరంభమైంది. క్రమంగా చక్రం, నిప్పు కనుగొనడం ఈ పరిణామ క్రమాన్ని మరింత వేగవంతం చేసింది. జంతు లక్షణాల నుంచి బయటపడ్డ మనిషి ఇతర జంతువుల్లాగా కాకుండా తమలో తాము సంభాషించుకోవడానికి భాషను సృష్టించాడు, అలాగే తాను చూసిన వాటిని పాతరాతియుగం నాటి మానవుడు కొండగుహల్లో చిత్రీకరించడం ఆరంభించాడు. క్రమంగా సంచార జీవనం వదిలి స్థిరజీవనం దిశగా ఆదిమ సమాజాలు పయనించడంతో మనిషిలో మరిన్ని కళలు బయటపడ్డాయి. భాష నుంచి సంగీతం, దానికనుగుణంగా నాట్యం వంటి అనేక కళలు మానవ జీవితంలోకి ప్రవేశించాయి.

తర్వాత కాలంలో కళారూపాలు శాఖోపశాఖలుగా విస్తరించాయి. ఇలాంటి కళా రూపాలు కేవలం మానసికోల్లాసానికే కాదని, వీటిని సరిగా ఆచరిస్తే ఆరోగ్యం కూడా మెరుగవుతుందని మనిషి కనుగొన్నాడు. ఆధునిక యుగంలో కూడా ఈ కళా రూపాలను ఉపయోగించి పలు దీర్ఘకాల వ్యాధులను, చికిత్స దొరకని రోగాలను ఉపశమింపచేసే థెరపీలు అనేకం ఉన్నాయి. కళలే కదా అని కొట్టి పారేయకుండా ఈ థెరపీలతో పలు ప్రయోజనాలు కూడా ఉన్నాయన్నది నిపుణుల అభిప్రాయం. ఆధునిక వైద్యం ఈ థెరపీలను సమర్థించదు కానీ వీటి వాడకాన్ని వద్దనలేదు. సైడ్‌ ఎఫెక్టులు ఉండని కొన్నిరకాల ప్రత్యామ్నాయ థెరపీల గురించిన వివరాలు...
 

పెట్‌ థెరపీ
మనిషి జీవితంలో జంతువులను మచ్చిక చేసుకోవడం ఎంతో కలిసివచ్చింది. దీనివల్ల నాగరికతలు దూసుకుపోయాయి. మనిషి మనసును అర్ధం చేసుకొనే పెంపుడు జంతువులకు, వాటి యజమానులకు మధ్య ఒక మానసిక బంధం ఏర్పడుతుంది. దీని ఆధారంగా యానిమల్‌ అసిస్టెడ్‌ లేదా పెట్‌ థెరపీ పుట్టుకొచ్చింది. సాధారణంగా మనిషి పెంచుకునే కుక్క, పిల్లి, గుర్రం, పంది, పక్షులతో ఈ థెరపీ ప్లాన్‌ను రూపొందిస్తారు. ఆటిజం, బిహేవియరల్‌ సమస్యలు, మెంటల్‌ కండీషన్స్, స్క్రీజోఫ్రీనియా ఉన్నవారికి ఇది ఉపయోగపడుతుంది. అయితే పెట్‌ అలెర్జీ ఉన్నవారు, జంతువులంటే అసహ్యం ఉన్నవారు ఈ థెరపీకి దూరంగా ఉండడం మంచిది. ఈ విధానంలో మన పెంపుడు జంతువుతో మనకు ఎమోషనల్‌ బంధం బలపడేలా థెరపిస్టు చేస్తాడు. దీనివల్ల మనిషి మనసులో సున్నితత్వం మెరుగుపడుతుంది. ఇతర జీవులపై ప్రేమ పెరుగుతుంది. దీనివల్ల మెదడులో కరుణ, జాలి భావాలకు ప్రాధాన్యం పెరిగి మానసికంగా బలోపేతం అవుతాడు. ఈ థెరపీలో కేవలం వైయుక్తిక విధానమే ఉంటుంది. గ్రూప్‌ థెరపీ ఉండదు. 

మ్యూజిక్‌ థెరపీ
శిశుర్వేత్తి పశుర్వేత్తి.. వేత్తి గానరసం ఫణిః అన్నాడు ప్రవచనకారుడు. సంగీతానికి పరవశించని జీవం ఉండదన్నది అందరికీ తెలిసిన సంగతే! అలాంటి సంగీతాన్నే ఆధారంగా చేసుకొని స్వాంతన చేకూర్చేది మ్యూజిక్‌ థెరపీ. పిల్లలో, పెద్దల్లో ఎదురయ్యే యాంగై్జటీ, డిప్రెషన్, నొప్పులు, ఆటిజం, ఆల్జీమర్స్, డిమెన్షియా, మెదడుకు దెబ్బతగలడం తదితర అనేక రకాల ఇక్కట్లకు ఈ థెరపీ బాగా పనిచేస్తుందని నిపుణులు చెబుతారు. ఇందులో రెండు రకాలున్నాయి. వినడం(రెసెప్టివ్‌ విధానం), పాడడం(యాక్టివ్‌ విధానం)లో మనకు నచ్చినదాన్ని ఎంచుకోవచ్చు. భారతీయ సంస్కృతిలో సంగీతానికి ప్రాధాన్యత మెండు. వివిధ రకాల మానసిక స్థితులకు తగినట్లు సంగీతంలో వివిధ రాగాలను సృష్టించారు. ఉదాహరణకు కరుణ రసాన్ని గాంధారం ప్లస్‌ నిషాధం అలాగే గాంధారం ప్లస్‌ షడ్జమం శౌర్య రసాన్ని ప్రేరేపిస్తాయి. రస, రాగ సమ్మిళితంతో మానసికోల్లాసమేకాకుండా, ఆరోగ్యం కూడా లభిస్తుందని భారతీయులు గుర్తించారు. పాశ్చాత్య సంగీతంలో కూడా ఆయా స్థితులకు తగ్గట్లు నోట్స్‌ను సృష్టించారు. 

ఇలా పనిచేస్తుంది... మనిషి పుట్టినప్పటి నుంచి చివరివరకు శబ్దమయ జీవితం గడుపుతాడు. శబ్దాలను క్రమపద్ధతిలో పేరిస్తే సంగీతమవుతుంది. సంగీతం వినడం ఒకలాగా, సొంతంగా పాడడం ఒకలాగా ప్రభావాన్ని చూపుతాయి. ఉదాహరణకు మతిమరుపు, అల్జీమర్స్‌ లాంటి వ్యాధులతో బాధపడేవాళ్లకు గతంలో విన్న సంగీతం కారణంగా మెదడులో గత న్యూరాన్లకు ప్రేరణ కలుగుతుంది. అలాగే సొంతంగా హమ్మింగ్‌ లేదా పాడుతూ పనిచేయడం శ్రమ తెలియనివ్వదు. మ్యూజిక్‌ థెరపీ చేసేవాళ్లు ముందుగా క్లయింట్‌ కండీషన్‌ బట్టి ఎలాంటి విధానం అవలంబించాలో నిర్ణయించుకుంటారు. అలాగే క్లయింట్‌కు మ్యూజిక్‌లో, సంగీత వాయిద్యాల్లో ప్రవేశం ఉన్నట్లయితే అందుకు తగిన విధానాన్ని సూచిస్తారు. అలాగే క్లయింట్‌ అవసరాన్ని బట్టి గ్రూప్‌ థెరపీని లేదా వైయుక్తిక సిట్టింగ్‌ను సూచిస్తారు. శ్రావ్య సంగీతం వినేప్పుడు శరీరంలోని రక్తపోటు, హదయ స్పందన రేటు నెమ్మదిస్తాయి. ఆక్సిజన్‌ సాచురేషన్‌ తగ్గుతుంది. ఉద్రేకపూరిత సంగీతం వింటే ఈ మార్పులు రివర్సులో జరుగుతాయి. పేషెంటు కండీషన్‌ను బట్టి థెరపిస్టు సంగీతాన్ని ఎంచుకుంటాడు. ఒక పాటను విన్నప్పుడు, పాడినప్పుడు మనసులో కలిగే స్పందనలను గుర్తించేలా థెరపిస్టులు ప్రేరేపిస్తారు. తద్వారా ఆరోగ్యం మెరుగుపడేందుకు అవసరమైన టెక్నిక్స్‌ను వాడతారు. 

ఆర్ట్‌ థెరపీ
ఆదిమమానవ కాలం నుంచి మనిషిలో ఉండే క్రియేటివిటీ చిత్రాల రూపంలో బయటపడుతోంది. మనలోని సైకలాజికల్, ఎమోషనల్‌ ఆలోచనలకు ఒక రూపాన్నివ్వడంలో చిత్రలేఖనం ఉపయోగపడుతుంది. దీన్ని ఆధారంగా తీసుకొని ఆర్ట్‌ థెరపీ అభివృద్ధి చేశారు. ఇందులో చిత్రలేఖనం(పెయింటింగ్‌), రేఖాలేఖనం(డ్రాయింగ్‌), రంగులద్దడం(కలరింగ్‌), శిల్పాలు చెక్కడం(స్కల్‌ప్టింగ్‌)వంటివి మనిషిలో గూడుకట్టుకున్న భావాలను డీకోడ్‌ చేసేందుకు ఉపయోగపడతాయి. ఏ వయసు వారిలోనైనా ఆత్మస్థైర్యం పెంచడానికి, వ్యసనాలను దూరం చేయడానికి, ఒత్తిడి నివారణకు, యాంక్జైటీ, డిప్రెషన్‌ తగ్గించడానికి ఆర్ట్‌ థెరపీని వాడతారు. పైనవాటిలోలాగానే ఇందులో కూడా గ్రూప్‌ థెరపీ, వైయుక్తిక థెరపీ ఉంటాయి. మన అవసరాన్ని బట్టి థెరపిస్టు సరైన విధానం సూచిస్తాడు. ఆర్ట్‌ థెరపీ అంటే మనలో ఆర్టిస్టిక్‌ ట్యాలెంట్‌ ఉండాల్సిన పనిలేదు. ఇది మన అంతఃచేతనలోని ఆలోచనలను బయటపెట్టడానికి చేసే ప్రయత్నమని గుర్తించాలి. థెరపీలో క్లయింట్‌ ఫీలింగ్స్‌ను థెరపిస్టు గమనించి తగిన టెక్నిక్స్‌ నేర్పుతాడు. వివిధ రంగుల సమ్మిళితాలను చిత్రీకరించడం, చూడడం వంటివి మనిషి మనసును తేటపరుస్తుందని అమెరికన్‌ ఆర్ట్‌ థెరపీ అసోసియేషన్‌ పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. 

మానవతాత్మక థెరపీ
ప్రపంచంలో జరిగే సంక్షోభ కారణాలను గుర్తించి నివారించడానికి యత్నించడమే మానవత్వం. సాటివారి బాధను అర్థం చేసుకున్నవాడే అసలైన మానవుడు అన్న సూక్తి ఆధారంగా హ్యూమనిస్టిక్‌ థెరపీ ఆరంభమైంది. మనం చూసే, వినే, అనుభవించే వాటిని మరింతగా అర్థం చేసుకోవడంలో ఈ థెరపీ ఎంతో పయ్రోజనకారి. ఆత్మనూన్యత సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధలు పడుతుండడం, ఇతరులతో సరైన సంబంధాలు లేకపోవడం, సున్నిత భావనలకు స్పందించకపోవడం వంటి పరిస్థితుల్లో ఈ థెరపీ ఉపయోగపడుతుంది. జీవితానికి అర్థం చెప్పడం ద్వారా మానవ జీవిత విలువను క్లయింట్‌కు థెరపిస్టు తెలియజేస్తాడు. జీవన విలువ తెలిసిన తర్వాత ఇతరులకు కీడు చేయాలనే ఆలోచన మనసుకు రాదు. అదేవిధంగా సర్వమానవ సౌభ్రాతృత్వ దృష్టి అలవడుతుంది. నెగిటివ్‌ జడ్జిమెంట్‌ చేసే గుణం తొలగిపోతుంది. ఇది ఎక్కువగా థెరపిస్టుకు, క్లయింట్‌కు మధ్య సంభాషణల ద్వారా జరుగుతుంది. క్లయింట్‌ ఆలోచనా విధానంలో లోపాలను సున్నితంగా ఎత్తి చూపడం, వాటిని సరైన దారికి మళ్లించడం, ఎదుటివారిని నొప్పించకుండా సంభాషించడాన్ని అలవాటు చేయడం ద్వారా క్లయింట్‌ను థెరపిస్టు సరైన మార్గంలోకి తీసుకుపోతాడు. దీనివల్ల క్లయింట్‌ క్రమంగా తనతో, ఇతరులతో సత్సంబంధాలు పెంచుకుంటాడు.


డ్యాన్స్‌ థెరపీ
పదంతో కలిసి కదం తొక్కినప్పుడు శరీరానికి నూతనోల్లాసం కలుగుతుంది. దీని ఆధారంగా డ్యాన్స్‌ థెరపీ ఆరంభమైంది. అందుకే ఆధునిక కాలంతో దీన్ని అనేక మొండి వ్యాధులకు స్వాంతనకోసం వాడుతున్నారు. నొప్పులు, ఒత్తిళ్లు, మానసిక చింత, కుంగుబాటు, కండరాల్లో బాధ, స్ట్రెస్, ఊబకాయం తదితర పలు ఇబ్బందులకు ఈ థెరపీ ఉపయోగపడుతుంది. కరోనా కాలంలో పిల్లల్లో పెరిగిన ఒత్తిడి తగ్గించడంలో దీని పాత్ర అమోఘమని అమెరికాకు చెందిన స్టెస్ర్‌ల్యాబ్‌ పేర్కొంది. సాంకేతికత పెరిగి శారీరక శ్రమ తగ్గుతూ వస్తున్న ఈ రోజుల్లో నృత్య సాధనతో శరీరానికి తగినంత వ్యాయామం కూడా లభిస్తుంది.

డ్యాన్స్‌ థెరపీతో అటు మానసిక, ఇటు శారీరక ప్రయోజనాలు కలుగుతాయన్నది నిపుణుల మాట. నృత్యాల్లో అభినయించే ముద్రలు, స్టెప్పులు మూవ్‌మెంట్‌ థెరపీలో కీలక పాత్ర పోషిస్తాయి. దీన్ని క్రమపద్ధతిలో పాటించడం వల్ల శరీరంలో ఒక రిథమ్‌ పెరగడంతోపాటు ఆత్మవిశ్వాసం మెరుగుపడడం గమనించవచ్చు. చిన్నపిల్లలకు అలవాటు చేయడం వల్ల వారి మానసిక, శారీరకోన్నతికి తోడ్పాటు లభిస్తుంది. ఇందులో కూడా గ్రూప్, వైయుక్తక థెరపీలుంటాయి. మన అవసరాన్ని బట్టి కావాల్సిన విధానాన్ని థెరపిస్టు సూచిస్తాడు. యోగాలో జరిగినట్లే డ్యాన్స్‌ థెరపీలో శ్వాసపై ధ్యాస పెరుగుతుంది. దీర్ఘ శ్వాసలు తీసుకోవడం వల్ల వంట్లో ఉండే వేగస్‌ నరం చురుగ్గా పనిచేస్తుంది. ఇది శరీరంలోని అతిపెద్ద నరం. దీని ప్రభావం పలు జీవ క్రియలపై ఉంటుంది. దీన్ని చురుగ్గా ఉంచడమంటే ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడమే! 

(చదవండి: అదిరిపోయే బ్రైడల్‌ కలెక్షన్‌.. చూపు తిప్పుకోలేరు!)


వినూత్న థెరపీలను ఎంచుకోవడమే కాదు, వాటిని ఆచరించే చిత్తశుద్ధి కూడా అవసరం. లేకుంటే ఎన్ని థెరపీలు చేపట్టినా ఏ ప్రయోజనం ఉండదు. అలాగే నకిలీలను ఎంచుకోకుండా సర్టిఫైడ్‌ థెరపిస్టుల వద్దకు వెళ్లడం మరువకూడదు. ఇప్పుడు ఇండియాలో పలు యూనివర్సిటీలు, కాలేజీలు ఇలాంటి థెరపీల్లో డిగ్రీలను ఆఫర్‌ చేస్తున్నాయి. అందువల్ల ఇలాంటి థెరపిస్టుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అవగాహన, అనుభవం ఉన్న థెరపిస్టు వద్ద తీసుకునే థెరపీ ఎప్పటికీ ప్రయోజనమే!
– శాయి ప్రమోద్‌

(చదవండి: ఈ కాఫీ తాగితే బరువు తగ్గొచ్చు.. ఇంకా)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement