
హైదరాబాద్: శంషాబాద్ నుంచి జేబీఎస్‌కు ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సకాలంలో గుర్తించిన బస్సు డ్రైవర్ వెంటనే ప్రయాణికులను అప్రమత్తం చేసి కిందికి దించేయడంతో ప్రాణనష్టం తప్పింది. బస్సులోని బ్యాటరీ కూల్ సర్క్యూట్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా దట్టమైన పొగలతో మంటలు వ్యాపించాయి. బేగంపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని బేగంపేట విమానాశ్రయం వద్ద జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం ఉదయం 8 గంటల సమయంలో ప్రయాణికులతో ఆర్టీసీ బస్సు శంషాబాద్ విమానాశ్రయం నుంచి గ్రీన్‌ల్యాండ్స్ మీదుగా జేబీఎస్‌కు వెళ్తుంది.
బస్సు బేగంపేట విమానాశ్రయం ముందుకు రాగానే పైభాగం నుంచి పొగలు రావడాన్ని డ్రైవర్ వెంకట్‌రెడ్డి గమనించారు. వెంటనే బస్సును పక్కనే ఉన్న మనోహర్ హోటల్ వద్ద నిలిపివేసి ప్రయాణికులను అప్రమత్తం చేశాడు. ఆ సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న ఎనిమిది మందిని కిందికి దించేశారు. వెంటనే ఆర్టీసీ కంటోన్మెంట్ డిపోకు, అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో సికింద్రాబాద్ అగ్నిమాపక కేంద్రం నుంచి వచ్చిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటనతో కొద్దిసేపు బేగంపేట మార్గంలో ట్రాఫిక్‌జాం ఏర్పడింది.
Comments
Please login to add a commentAdd a comment