హైదరాబాద్: ఎయిర్‌పోర్టు ప్రయాణికుల కోసం ఆర్టీసీ మరో బంపర్ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. కనీసం ముగ్గురు ప్రయాణికులు కలిసి ప్రయాణం చేస్తే టికెట్ చార్జీల్లో రాయితీ లభిస్తుంది. ముగ్గురు నుంచి ఎంతమంది ప్రయాణికులైనా సరే కలిసి ప్రయాణం చేసినప్పుడు మొత్తం చార్జీల్లో 10 శాతం వరకు తగ్గింపు ఇవ్వనున్నట్లు ఆర్టీసీ సికింద్రాబాద్ రీజినల్ మేనేజర్ వెంకన్న తెలిపారు. క్యాబ్‌లు, ఇతర ప్రైవేట్ వాహనాల పోటీని ఎదుర్కొనేందుకు ఆర్టీసీ ఈ రాయితీ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు, కుటుంబాలతో కలిసి వెళ్లే ప్రయాణికులను సైతం ఆకట్టుకొనేందుకు ఈ సదుపాయాన్ని ప్రవేశపెట్టినట్లు వెంకన్న చెప్పారు.
ప్రస్తుతం నగరంలోని వివిధ మార్గాల్లో ప్రతి రోజు వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ప్రయాణికుల ఆదరణ చూరగొనేందుకు ఆర్టీసీ ఇప్పటికే బస్సుల్లో వైఫై తదితర సదుపాయాలను ప్రవేశపెట్టింది. వివిధ మార్గాల్లో ఎయిర్‌పోర్టు వరకు కనిష్టంగా రూ.50 నుంచి గరిష్టంగా రూ.300 వరకు టికెట్ చార్జీలు ఉన్నాయి.
కుటుంబ సభ్యులు కలిసి వెళ్లినప్పుడు ప్రయాణించే దూరం, ప్రయాణికుల సంఖ్యను బట్టి రాయితీ పెద్ద మొత్తంలోనే ఉంటుందని అధికారులు చెప్పారు. ప్రయాణికుల ఆదరణ పెరుగుతున్న దృష్ట్యా వివిధ రూట్‌లలో మరిన్ని బస్సులను ప్రవేశపెట్టేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. త్వరలో నగరానికి రానున్న కొత్త ఎలక్ట్రికల్ ఏసీ బస్సుల్లో 20 బస్సులను ఎయిర్‌పోర్టుకు నడపనున్నట్లు ఆర్‌ఎం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment