హైదరాబాద్: మహిళా ప్రయాణికులకు టీ–24 టికెట్లపైన ఆర్టీసీ రాయితీ కల్పించింది. రూ.80 లకే ఈ టికెట్లు లభించనున్నాయి. మంగళవారం నుంచి ఈ రాయితీ సదుపాయాన్ని నగరంలోని సిటీ బస్సుల్లో అందుబాటులోకి తేనున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. వేసవి నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రయాణించే మహిళల కోసం ఈ సదుపాయాన్ని ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు.
సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో 24 గంటల పాటు ప్రయాణించేందుకు ఆర్టీసీ టి–24 టికెట్లను అందజేస్తున్న సంగతి తెలిసిందే. సాధారణ ప్రయాణికులకు రూ.90లకు విక్రయిస్తుండగా, సీనియర్ సిటిజన్‌లకు రూ.10 తగ్గింపుతో రూ.80 కే అందజేస్తోంది. తాజాగా మహిళా ప్రయాణికులకు సైతం ఈ రాయితీ సదుపాయాన్ని అందజేశారు. సిటీ పరిధిలో తిరిగే ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోని కండక్టర్ల వద్ద ఈ టికెట్లు అందుబాటులో ఉంటాయి.
రోజుకు 40 వేల టిక్కెట్లు...
గ్రేటర్‌లో ప్రయాణికులకు ఎంతో సదుపాయంగా ఉన్న టి–24 టిక్కెట్‌ల అమ్మకాలు గణనీయంగా పెరిగినట్లు అధికారులు తెలిపారు. గతంలో రోజుకు 25 వేల టికెట్లు అమ్ముడు కాగా, ఇప్పుడు వాటి సంఖ్య రెట్టింపైనట్లు పేర్కొన్నారు. గతంలో ఈ టిక్కెట్ల ధర రూ.100 ఉండగా రూ.90 తగ్గించారు. ఆ తరువాత సీనియర్ సిటిజన్లకు, ప్రస్తుతం మహిళలకు మరింత రాయితీనిచ్చి రూ.80కే విక్రయిస్తున్నారు.
ధర తగ్గింపు తర్వాత ప్రతి రోజు సగటున 40 వేలకు పైగా టికెట్లు అమ్ముడవుతున్నాయి. గతంలో రోజుకు 25 వేలు మాత్రమే విక్రయించేవారు. మరోవైపు మహిళలు, సీనియర్ సిటిజన్ల కోసం టి–6 టికెట్ పేరుతో రూ.50 టికెట్లను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 వరకు ఈ టికెట్లపైన ప్రయాణం చేయవచ్చు. అలాగే వీకెండ్స్, సెలవు రోజుల్లో నలుగురు కలిసి ప్రయాణం చేసేందుకు ఎఫ్–24 టికెట్లను రూ.300కు అందజేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment