
హైదరాబాద్: పది రోజుల క్రితం వ్యక్తిని దారుణంగా హతమార్చి డ్రమ్ములో కుక్కి చెరువులో పడేసిన ఘటనకు వివాహేతర సంబంధమే కారణమని పహాడీషరీఫ్ పోలీసులు నిర్ధారించారు. రెండో ప్రియుడి మోజులో పడిన మహిళ అతనితో కలిసి మొదటి ప్రియుడిని హత్య చేసింది. పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహేశ్వరం ఏసీపీ సి.అంజయ్య, ఇన్‌స్పెక్టర్ ఎం.కాశీ విశ్వనాథ్‌తో కలిసి వివరాలు వెల్లడించారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన పూరన్‌సింగ్ అలియాస్ దీపక్(30)కి వివాహానికి ముందే బంధువైన జయాదేవితో ప్రేమాయణం కొనసాగింది.
అనివార్య కారణాలతో ఇద్దరూ వేర్వేరు సంబంధాలు చేసుకోవాల్సి వచ్చింది. వివాహానంతరం భార్య మమతతో కలిసి పూరన్‌సింగ్ చాంద్రాయణగుట్ట బండ్లగూడకు వలస వచ్చాడు. లాక్‌డౌన్ సమయంలో జయాదేవి తన భర్త, పిల్లలను వదిలేసి కాటేదాన్‌కు వచ్చింది. పూరన్‌సింగ్‌తో వివాహేతర సంబంధం కొనసాగించింది. ఈ క్రమంలోనే ఇంటి సమీపంలోనే ఉంటున్న హర్యానాకు చెందిన నజీం(31)తో కూడా వివాహేతర సంబంధాన్ని నెరపసాగింది. తుక్కుగూడలో వేరుగా గది తీసుకుని అతడితో సహజీవనం సాగించింది. పూరన్‌కు అనుమానం వచ్చిందని గ్రహించిన వారు ఎలాగైనా అత డిని మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నారు.
పథకంలో భాగంగా..
ముందస్తు పథకంలో భాగంగా జయాదేవి, నజీం కామన్ ఫ్రెండ్‌గా ఉన్న రాజేంద్రనగర్‌లో నివసించే తమిళనాడుకు చెందిన సుగుణా రాము(42)తో ఈ నెల 22న రాత్రి పూరన్‌సింగ్‌కు ఫోన్ చేయించి బాకీగా ఉన్న రూ.10 వేలు ఇస్తానంటూ తుక్కుగూడకు పిలిపించారు. నమ్మి వెళ్లిన పూరన్‌సింగ్‌ను నజీం, అతని స్నేహితుడు మబీన్, జయాదేవి, అసద్‌తో కలి సి దారుణంగా కత్తితో దాడి చేసి హత్య చేశారు. మృతదేహాన్ని డ్రమ్ములో కుక్కి జేసీబీ ముందుండే పారలో వేసుకొని సమీపంలోని సూరం చెరువులో పడేసి పరారయ్యారు. పోలీసులు నజీం, సుగుణా రామును అరెస్ట్ చేయగా..మిగిలిన ముగ్గురు పరారీలో ఉన్నారు.