
నారాయణగూడ పోలీసులతో చిన్నారి దివ్యాన్ష్
హైదరాబాద్: ‘‘హాయ్ పోలీసు అంకుల్స్. మీరు సమయానికి స్పందించి నన్ను హాస్పిటల్‌కు తీసికెళ్లకపోతే నేను చచ్చిపోయేవాడినని మా మమ్మీ, డాడీ చెప్పారు. నన్ను కాపాడినందుకు అందరికీ థ్యాంక్యూ’’ అంటూ ఓ ఐదేళ్ల చిన్నారి ముద్దొచ్చే మాటలతో నారాయణగూడ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపాడు. ఈనెల 13న దత్తానగర్‌కు చెందిన బాలుడు దివ్యాన్ష్ ఇంట్లో ఉన్న పెయింట్ టిన్నర్ తాగడంతో అపస్మారకస్థితికి చేరుకున్నాడు.
ఆ సమయంలో తల్లిదండ్రులు ఇంట్లో లేకపోవడంతో అతడి పిన్ని ఏం చేయాలో తోచక డయల్–100కు కాల్ చేసి బోరున విలపించింది. తక్షణమే స్పందించిన పెట్రోకార్ కానిస్టేబుల్ రాజు, ప్రమోద్, హోంగార్డు బాసిత్ క్షణాల్లో అక్కడికి చేరుకున్నారు. బాలుడిని పెట్రోకార్‌లో ఎక్కించుకుని ఐదు నిమిషాల్లో కింగ్‌కోఠి జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిశీలించిన వైద్యులు అతడి పరిస్థితి విషమంగా ఉందని, మెరుగైన వైద్యం కోసం నీలోఫర్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు.
ఈ విషయాన్ని ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన స్పందిస్తూ బాలుడిని అదే వాహనంలో నిలోఫర్‌కు తరలించారు. దాదాపు పదిరోజులకు పైగా ఆస్పత్రిలో చికిత్స పొందిన దివ్యాన్ష్ పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యాడు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి పీఎస్‌కు వచ్చిన అతను ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, అడ్మిన్ ఎస్‌ఐ నరేష్, ఆరోజు ప్రాణాలు కాపాడిన సిబ్బంది రాజు, ప్రమోద్, హొంగార్డు బాసిత్, తదితర సిబ్బందిని కలిసి కృతజ్ఞతలు తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment