హైదరాబాద్: ఉప్పల్ చౌరస్తాలో నిర్మించిన స్కైవాక్ అందుబాటులోకి వచ్చింది. రక్షణ శాఖ స్థలాన్ని కేటాయిస్తే మెహిదీపట్నం వద్ద మరొకటి నిర్మిస్తామని హెచ్‌ఎండీఏ ప్రకటించింది. ఇంత వరకు బాగానే ఉన్నా.. 2011లో సర్వే చేసిన సికింద్రాబాద్ స్కైవాక్ ఊసే లేకుండాపోయింది. నగరంలోనే తొలి స్కైవాక్‌గా దీన్ని నిర్మించాలని అప్పట్లో భావించిన అధికారులు ఫీల్డ్ సర్వే కూడా చేశారు. ఇది జరిగి పుష్కర కాలమైనా ఒక్క అడుగూ ముందుకు పడలేదు.
పద్మవ్యూహాన్ని తలపించే ట్రాఫిక్
► ఉమ్మడి రాష్ట్రంలో ఎన్.కిరణ్‌కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా హయాంలో హైదరాబాద్ రూపురేఖల్ని మార్చేస్తానంటూ ‘ప్రాజెక్ట్ 100 రోజుల్లో’ కార్యక్రమాన్ని చేపట్టారు. నగరంలో మౌలిక సదుపాయాల కల్పన, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి విభాగాల వారీగా ప్రతిపాదనలు కూడా కోరారు. వీటిలో భాగంగా ట్రాఫిక్ విభాగం అధికారులు పంపిన ప్రపోజల్స్‌లో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో, బేగంపేట ప్రాంతంలో ప్రయాణికులకు ఉన్న ఇక్కట్లు తొలగించడానికి పెద్దపీట వేశారు. వివిధ రకాలైన అంశాలతో పాటు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద స్కైవాక్ నిర్మించాలని ప్రతిపాదించారు.
► వీటిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఫీల్డ్ విజిట్‌ను ఆదేశించింది. అత్యంత కీలకమైన జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్, హెచ్‌ఎండీఏ, వాటర్ వర్క్‌లతో సహా వివిధ శాఖలతో కలిపి ఏర్పాటు చేసి కో–ఆర్డినేషన్ కమిటీకి ఈ బాధ్యతల్ని అప్పగించింది. 2011 ఫిబ్రవరి 10న ఫీల్డ్ సర్వే చేసిన ఈ కమిటీ స్కైవాక్‌తో పాటు బేగంపేట రహదారిలో ఉన్న ట్రాఫిక్ అడ్డంకులను తొలగింపు పైనా దృష్టి పెట్టి నివేదిక రూపొందించింది.
► నిత్యం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ప్రాంతంలో పాదచారుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. దీనికి తోడు స్టేషన్ నుంచి ఇటు రేతిఫైల్, అటు 31 బస్టాప్‌ల మధ్య చిరు వ్యాపారుల కారణంగా మరిన్ని ఇబ్బందులు ఉంటున్నాయి. వీటికి తోడు వాహనాల రద్దీ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉంటుంది. వెరసీ.. ఈ ప్రాంతం నిత్యం ట్రాఫిక్ నరకాన్ని తలపిస్తూ ఉంటుంది. వీటిని పరిష్కరించేందుకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కేంద్రంగా రెండు వైపులకు స్కైవాక్ నిర్మించాలని కో–ఆర్డినేషన్ కమిటీ సూచించింది.
కాగితాలకే పరిమితం..
► పాదచారులు నడవటానికి ఉపకరించే ఈ స్కైవాక్‌లు అప్పటికి బయటి రాష్ట్రాల్లోనే వినియోగంలో ఉన్నాయి. ఫుట్‌ఓవర్ బ్రిడ్జి మాదిరి ఉండే ఈ వంతెనల్ని అంత ఎత్తులో కాకుండా నిర్మించాలని ప్రతిపాదించారు. రోడ్డు పక్కగా 5 నుంచి 6 అడుగుల ఎత్తులో ఉండాలని, పాదచారులు వీటిపై నడిచి నిర్దేశించిన ప్రాంతాలకు చేరుకునేలా డిజైన్ చేయాలని భావించారు. వీటి నిర్మాణం వల్ల రోడ్డుకు అడ్డంగా పాదచారులు నడవటం, ఎక్కడపడితే అక్కడ రోడ్డు దాటడం, చిరు వ్యాపారుల ఆక్రమణలు తదితర సమస్యలు శాశ్వతంగా తొలగుతాయని ప్రతిపాదించారు.
► ప్రయాణాల నేపథ్యంలో రేతిఫైల్ బస్టాప్ నుంచి రైల్వేస్టేషన్ వరకు, అక్కడ నుంచి ‘31 బస్టాప్’ వరకు ఉన్న ప్రాంతంలో పాదచారుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. దీన్ని పరిగణలోకి తీసుకున్న అధికారులు తొలివిడతగా ఈ మూడు ప్రాంతాల మధ్య స్కైవాక్‌లు ఏర్పాటు చేయాలని తీర్మానించారు. ఇప్పటికీ ఈ ప్రతిపాదనలు ఫైళ్లల్లోనే ఉండిపోయాయి. వివిధ ప్రాంతాల్లో స్కైవాక్‌లపై చర్చ జరుగుతున్నా అటు జీహెచ్‌ఎంసీ, ఇటు హెచ్‌ఎండీఏ ఎవరూ లష్కర్ స్కైవాక్ విషయం పట్టించుకోవట్లేదు.
Comments
Please login to add a commentAdd a comment