నగర రహదారులు ఆదివారం రక్తసిక్తంగా మారాయి. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. బొల్లారం పరిధిలో ఇద్దరు మహిళలు మార్నింగ్ వాక్ పూర్తి చేసుకుని రోడ్డు దాటుతుండగా స్పోర్ట్స్ బైక్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈసీఐఎల్ చౌరస్తాలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి ఇద్దరు యువకులు, మేడ్చల్ జిల్లా శామీర్‌పేట్ పరిధిలో విద్యుత్ స్తంభాన్ని బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు అన్నదమ్ములు, రాజేంద్రనగర్‌లో బైక్‌ను కారు ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
బైక్ అదుపు తప్పి.. హైలాండ్‌ను ఢీకొట్టి..
కాప్రా: మౌలాలీ నుంచి కుషాయిగూడ వైపు బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు ఆదివారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈసీఐఎల్ చౌరస్తా వద్దకు రాగానే బైక్ అదుపు తప్పి అంబేడ్కర్ స్టాచ్యూ హైలాండ్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృతి చెందారు. కుషాయిగూడ పోలీసు స్టేషన్‌కు సమీపంలోనే ప్రమాదం చోటుచేసుకోవడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మృతులు మౌలాలీకి చెందిన క్రాంతి, జనగామకు చెందిన నరేష్‌గా గుర్తించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
మార్నింగ్ వాక్ ముగించుకుని.. రోడ్డు దాటుతుండగా..
రసూల్‌పురా: బొల్లారం రిసాలబజార్‌కు చెందిన రాధిక (48), కళాసిగూడ సాయి కాలనీకి చెందిన పొలం బాలమణి (60) స్నేహితులు. వీరు కొన్నేళ్లుగా ప్రతిరోజు బొల్లారంలోని కంటోన్మెంట్ పార్క్‌కు మార్నింగ్ వాకింగ్‌కు వెళ్తున్నారు. ఆదివారం ఉదయం వాకింగ్ ముగించుకుని రోడ్డు దాటుతున్న సమయంలో ఉప్పల్‌కు చెందిన ఆదిత్య అనే యువకుడు స్పోర్ట్స్ బైక్‌పై అతివేగంగా శామీర్‌పేట్ వైపు వెళ్తూ రాధిక, బాలమణిలను ఢీకొట్టాడు. ఈ ఘటనలో వీరిరువురూ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో యువకుడు ఆదిత్య చేయి విరిగింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ లక్ష్మీ మాధవి పేర్కొన్నారు.
అన్నదమ్ములిద్దరూ అనంత లోకాలకు..
శామీర్‌పేట్: తమ్ముడిని హాస్టల్‌లో చేర్చేందుకు బైక్‌పై వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములిద్దరూ మృతి చెందారు. వనపర్తి జిల్లా కొత్తకోటకు చెందిన మహేశ్ (20), తమ్ముడు కృష్ణ (10)తో పాటు మరో వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. ఈ క్రమంలో శామీర్‌పేట్– బాబాగూడ వద్ద ప్రమాదవశాత్తు రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో అన్న మహేశ్‌తో పాటు కృష్ణ అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. శామీర్‌పేట్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కారు రూపంలో దూసుకొచ్చిన మృత్యువు..
రాజేంద్రనగర్: వేగంగా దూసుకువచ్చిన కారు ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఓ యువకుడు మృతి చెందిన ఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. బుద్వేల్ రైల్వే స్టేషన్‌కు చెందిన రవికాంత్ (35) ఉస్మానియా ఆస్పత్రిలో ఎలక్ట్రీషన్‌గా పని చేస్తున్నాడు. ఆదివారం ఉదయం ద్విచక్ర వాహనంపై ఇంటి నుంచి ఆరాంఘర్ సర్వీస్ రోడ్డుపై వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన కారు వేగంగా ఢీకొట్టడంతో అతడు దాదాపు 20 మీటర్ల దూరం ఎగిరిపడి మెట్రో క్లాసిక్ గార్డెన్ వద్ద పడి మృతి చెందాడు. అక్కడినుంచి కారు డ్రైవర్ పరారయ్యాడు. కారులో ఉన్న రెండు మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment