Telangana News: అంతా.. మా ఇష్టం..! పథకాల ఎంపిక మొత్తం మేము చెప్పినట్లే..!!
Sakshi News home page

అంతా.. మా ఇష్టం..! పథకాల ఎంపిక మొత్తం మేము చెప్పినట్లే..!!

Aug 14 2023 6:26 AM | Updated on Aug 14 2023 2:02 PM

- - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ పరంగా పేద కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు తీరు అంతా ‘స్థానిక ఎమ్మెల్యే’ చేతిలోకి వెళ్లిపోయింది. అంతా ‘వారి ఇష్టం’ అన్నట్లుగా తయారైంది. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అధికార పక్షం ఎన్నికల తాయిలాలకు సిద్ధమైంది.

పేద ప్రజల మద్దతు లభించే విధంగా ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యేలను పథకాల అమల్లో భాగస్వాముల్ని చేసింది. దీంతో బీసీ, దళిత, మైనారిటీ బంధు, గృహలక్ష్మి, డబుల్‌ బెడ్‌రూమ్‌ తదితర పథకాల లబ్ధిదారుల ఎంపికలో స్థానిక ఎమ్మెల్యేలు కీలకంగా మారారు. ప్రభుత్వ ఆదేశాలతో సంబంధిత అధికారులు కేవలం ఉత్సవ విగ్రహాలుగా మారగా, దరఖాస్తుల తంతు మొక్కుబడిగా మారింది.

ఇప్పటికే ఇలా..
ఇప్పటికే దళితుల ఆర్థిక పరిపుష్టి కోసం అమలు చేస్తున్న దళిత బంధు పథకం కింద లబ్ధిదారుల తుది ఎంపిక స్థానిక ఎమ్మెల్యేల సిఫార్సులతో కొనసాగుతుండగా, బీసీ కుల, చేతివృత్తుల వారికి ఆర్థిక చేయూత కింద తలపెట్టిన రూ.లక్ష సాయం కూడా వారి జాబితా కింద చేరింది.

ఇక మైనారిటీ బంధు కింద వంద శాతం సబ్సిడీతో అందించే రూ.లక్ష ఆర్థిక చేయూత వ్యవహారంలో కూడా స్థానిక ఎమ్మెల్యేలు ప్రధాన పాత్ర పోషించనున్నారు. ఇటీవల సొంత స్థలం కలిగిన నిరపేదలకు గృహలక్ష్మి కింద అందించే రూ.3 లక్షల సాయం పరిస్థితి కూడా అదే విధంగా తయారైనట్లు తెలుస్తోంది. డబుల్‌ బెడ్‌ రూమ్‌ దరఖాస్తులపై విచారణ కొనసాగుతున్నా..ఎమ్మెల్యేల సిఫార్సుల మేరకు లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందనే ప్రచారం సాగుతోంది.

లక్కీ డ్రా ద్వారానే..
పంద్రాగస్టు తర్వాత డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పంపిణీ, మైనారిటీ బంధు కింద రూ.లక్ష చొప్పున పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో అధికారులు కసరత్తు చేస్తున్నారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులపై కనీసం 20 శాతం క్షేత్ర స్థాయి సర్వే కూడా పూర్తి కాలేదు. ఆఫ్‌లైన్‌ దరఖాస్తులు అటకెక్కగా.. కేవలం అన్‌లైన్‌ దరఖాస్తులపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

క్షేత్ర స్థాయి విచారణ కోసం మండలం యూనిట్‌గా జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ సిబ్బంది బృందాలుగా ఏర్పాటు చేసి రంగంలోకి దింపగా.. ఇరు శాఖల సమన్వయం లోపంతో విచారణ తంతు నత్తకు నడక నేర్పిస్తోంది. అయితే దరఖాస్తులు లక్షల్లో ఉండగా, విచారణ మాత్రం వేల సంఖ్యలో కూడా పూర్తి కాలేదు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణం కూడా అదే విధంగా ఉంది.

విచారణ పూర్తయిన దరఖాస్తుల్లో అర్హులు పెద్ద సంఖ్యలో ఉండగా .. లబ్ధిదారుల ఎంపిక ఎలా జరుగుతుందనేది స్పష్టత లేకుండా పోయింది. ఎమ్మెల్యే ఆధ్వర్యంలోనే లక్కీ డ్రా ద్వారానే లబ్ధిదారులు ఎంపిక జరుగుతుందనే ప్రచారం జోరుగా కొనసాగుతోంది. అదేవిధంగా గత ఆర్థిక సంవత్సరం మైనారిటీ వర్గాలు 80 శాతం సబ్సిడీ కింద రూ.లక్ష కోసం పెద్దఎత్తున దరఖాస్తు చేసుకున్నారు.

ఆ దరఖాస్తులను మైనారిటీ బంధు100 శాతం సబ్సిడీగా బదలాయించి కింద రూ.లక్ష అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. అయితే అర్హులైన దరఖాస్తుదారులు వేల సంఖ్యలో ఉండగా, అందులో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఎలా జరుగుతుందని చర్చ సాగుతోంది. అయితే మైనారిటీ బంధు కూడా ఎమ్మెల్యేల సిఫార్సులతోనే పంపిణీ జరుగుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

జాబితాలు సిద్ధం..
ఎమ్మెల్యేల కనుసన్నల్లో రెండో విడత దళిత బంధు, బీసీ బంధు, గృహలక్ష్మి పథకాల లబ్ధిదారుల జాబితా ఇప్పటికే సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. బీసీ బంధు కింద ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించినప్పటికి స్థానిక ఎమ్మెల్యేలు సిఫార్సు చేసే జాబితాలోని పేర్లతో కూడిన ఆఫ్‌లైన్‌ దరఖాస్తులు సైతం పరిగణలోకి తీసుకునే విధంగా మంత్రులు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేసినట్లు సమాచారం. అదేవిధంగా గృహలక్ష్మి కింద అధికారికంగా దరఖాస్తులు స్వీకరించినప్పటికి..ఇప్పటికే లబ్ధిదారుల జాబితా సిద్ధమై ఎమ్మెల్యేల చేతిలో ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement