ట్రాన్స్‌జెండర్ల వేషంలో బలవంతపు వసూళ్లు | - | Sakshi
Sakshi News home page

ట్రాన్స్‌జెండర్ల వేషంలో బలవంతపు వసూళ్లు

Aug 20 2023 6:24 AM | Updated on Aug 20 2023 8:10 AM

- - Sakshi

హైదరాబాద్: ట్రాన్స్‌జెండర్లుగా నటిస్తూ.. ప్రజలను వేధిస్తూ.. బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న ముఠాను నార్త్‌జోన్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు నార్త్‌జోన్‌ డీసీపీ చందనా దీప్తి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నార్త్‌జోన్‌ పరిధిలోని గోపాలపురం, మారేడుపల్లి, మహంకాళి, రాంగోపాల్‌పేట పోలీసు స్టేషన్‌ల పరిధిలో ట్రాన్స్‌జెండర్ల పేరిట బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న 19 మందిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. వీరికి వైద్య పరీక్షలు నిర్వహించి రిమాండ్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ట్రాఫిక్‌ జంక్షన్లు, పబ్లిక్‌ ప్లేసెస్‌లో బెగ్గింగ్‌కు పాల్పడుతున్నట్లు తెలిపారు.

వాళ్లు అడిగిన వెంటనే డబ్బులు ఇవ్వకుంటే కార్లపై ఉమ్మివేయడం, దాడి చేయడం, దుర్భాషలాడటం వంటి చర్యలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయన్నారు. రాజేశ్‌ యాదవ్‌, అనిత అనే వ్యక్తులు నాయకులుగా బెగ్గింగ్‌ ముఠాను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అరెస్టు చేసిన మొత్తం 19 మంది మగవారే అయినప్పటికీ ట్రాన్స్‌జెండర్‌లకు వేషం మార్చుకుని మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. వీరిలో ఇద్దరు ఆపరేషన్‌ చేయించుకుని మరీ ట్రాన్స్‌జెండర్‌లుగా మారినట్లు తేలిందన్నారు. ఉదయం పూట బెగ్గింగ్‌తో పాటు సూర్యాస్తమయం తర్వాత అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లుగా గుర్తించామన్నారు.

ఇటీవల ఓ ప్రైవేటు ఫంక్షన్‌కు వెళ్లి నిర్వాహకుల నుంచి రూ.లక్ష డిమాండ్‌ చేశారు. వారు అడిగిన డబ్బు ఇవ్వనందుకు వేధింపులతో పాటు, బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ మేరకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో స్పెషల్‌ డ్రైవ్‌ ద్వారా నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ ముఠాలో మరికొందరు కూడా ఉండే అవకాశమున్నందున, ఈ కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నామన్నారు. త్వరలోనే బెగ్గింగ్‌ ముఠాల గుట్టు రట్టు చేస్తామన్నారు. పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చేంత వరకు దాడులు కొనసాగిస్తామన్నారు. సమావేశంలో ఏసీపీలు సుధీర్‌, రవీందర్‌, వివిధ పోలీసు స్టేషన్ల ఇన్‌స్పెక్టర్‌లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement