హైదరాబాద్: ఓటరు ఫొటో గుర్తింపు కార్డు (ఎపిక్) ఉందనుకొని ఇప్పుడు ఓటరు జాబితాలో పేరుందో లేదో చూసుకోకపోతే.. తీరా పోలింగ్‌నాడు వెళ్లినా మీకు ఓటు లేదని నిరాకరించవచ్చు. ఇప్పటికే ఎపిక్ కార్డులున్నప్పటికీ చాలామంది పేర్లు ఓటర్ల జాబితాల్లో ఉండటం లేవు. వాస్తవానికి ఒక ఓటును తొలగించాలంటే నిబంధనల మేరకు ఎన్నో పాటించాల్సి ఉంది.
ఓటరు కచ్చితంగా లేడని నిర్ధారించుకున్నాకే తొలగించాల్సి ఉన్నప్పటికీ ఇవేవీ లేకుండానే ఇష్టానుసారం ఓట్లను తొలగించారు. దీంతో మీకు ఎపిక్ ఉన్నప్పటికీ జాబితాలో మీ పేరు లేకపోవచ్చు. తప్పు ఎవరిదైనా మీకు ఓటు వేసే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో ఓటరు జాబితాలో మీ పేరుందో, లేదో చూసుకొని లేకుంటే దరఖాస్తు చేసుకొమ్మని కోరుతున్నారు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్‌రాస్. తాజాగా వెలువరించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో మీ పేరుందో లేదో చూసుకోవాలని సూచించారు.
ఏ అవసరానికి ఏ ఫారం వినియోగించాలంటే..
► 18 సంవత్సరాల వయసు దాటినప్పటికీ, ఇప్పటికీ ఓటరు జాబితాలో పేరు లేని వారు నమోదు చేసుకునేందుకు, ఎపిక్ ఉన్నప్పటికీ ఓటరు జాబితాలో పేరు లేని వారు నమోదు చేసుకునేందుకు, రాబోయే అక్టోబర్ 1వ తేదీ నాటికి 18 సంవత్సరాల వయసు నిండే వారు ఇప్పుడే నమోదు చేసుకునేందుకు ఫారం 6.
► ఆధార్‌తో అనుసంధానానికి ఫారం 6బి.
► జాబితాలోంచి అనర్హుల పేర్లు తొలగించేందుకు, కొత్త ఓటరు చేర్పుపై అభ్యంతరాలు తెలియజేసేందుకు ఫారం 7
► పేరు, వివరాల్లో దోషాలు సరిచేసుకునేందుకు, నియోజకవర్గం పేరు పొరపాటుగా ఉన్నప్పుడు,కుటుంబ సభ్యులందరి పేర్లు ఒకే పోలింగ్ కేంద్రంలో కాకుండా వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో ఉన్నప్పుడు, ఫొటో సవ్యంగా లేనప్పుడు, జాబితాలో మొబైల్ నంబర్ అప్‌డేషన్‌కు ఫారం 8.
► ముసాయిదా ఓటరు జాబితాలో పేరుందో లేదో చూసుకునేందుకు www.ceotelangana.nic.in
► జాబితాలో పేరుండి పొరపాట్ల సవరణ, మార్పుచేర్పుల కోసం www.voters.eci,gov.in లేదా voterhelpline app ద్వారా
► ఇతర వివరాలకు ఓటర్ హెల్ప్‌లైన్ నెంబర్ 1950 సంప్రదించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment