హైదరాబాద్: కారు ఢీ కొని రోడ్డు దాటుతున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృతి చెందిన సంఘటన బేగంపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. వాహనం ధాటికి సదరు మహిళ ఎగిరి దూరంగా పడడంతో తల పగిలి అక్కడికక్కడే మృతి చెందింది. బేగంపేట ఎస్‌ఐ గంగాధర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చంచుపల్లి గ్రామానికి చెందిన చందా నాగ ప్రియాంక (31) నిజాంపేటలో ఉంటూ బేగంపేటలోని రిలయన్స్ ట్రెండ్స్ భవనంలోని ఓ కార్యాలయంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తోంది.
సోమవారం షాపర్ స్టాప్ వద్ద బస్సు దిగి రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన మహేంద్ర మొరాజో వాహనం ఆమెను ఢీకొట్టింది. దీంతో ఆమె ఎగిరి పడడంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment