హైదరాబాద్: కొద్ది రోజులుగా రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. నిత్యం ఎక్కడో ఒకచోట రహదారులు రక్తమోడుతున్నాయి. నగర శివారు ప్రాంతాల్లో, ప్రత్యేకంగా హైవేలపైన ఇటీవల జరిగిన ప్రమాదాల్లో పలువురు వాహనదారులు మృత్యువాత పడ్డారు. మరికొందరు గాయపడ్డారు. ఉదయం పూట మంచుకురిసే వేళలోసరైన జాగ్రత్తలు పాటించకుండా వాహనాలు నడపడం వల్లనే తెల్లవారు జామున ఎక్కువ ప్రమామాదాలు జరుగుతున్నట్లు రహదారి భద్రతా నిపుణులు చెబుతున్నారు.
కొద్దిరోజుల నగర శివారు ప్రాంతాల్లో ఓ కారు ఆగి ఉన్న లారీని ఢీకొడంతో కార్లో ప్రయాణం చేస్తున్న వాళ్లు కొందరు చనిపోయారు. పొగమంచు దట్టంగా అలుముకొని ఉండడంతో డ్రైవర్ ఆగి ఉన్న లారీని గుర్తించలేకపోయినట్లు రవాణాశాఖ అధికారులు తెలిపారు. కొద్ది రోజులుగా ఉదయం వేళల్లోనే చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. చలితో పాటు మంచు కూడా కురుస్తూండడంతో వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడుతుంది. ఈ క్రమంలో హైవేలపైన వాహనాలను నడిపేటప్పుడు రోడ్డు భద్రతా నిబంధనలను కచ్చితంగా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
‘లైట్’ వెలగాల్సిందే...
► దట్టమైన పొగమంచు కమ్ముకొని ఉన్న సమయంలో వాహనాలను నడిపేటప్పుడు కచ్చితంగా ఫాగ్‌లైట్లు వెలుగుతూనే ఉండాలి. ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా ఎదురుగా వచ్చే వాహనాలను ఢీకొనే ప్రమాదం ఉంది.
► రాత్రి వేళల్లో హైబీమ్ లైట్లకు బదులు లోబీమ్ లైట్లను వినియోగించాలి.
► ప్రధాన రహదారుల మధ్యలో ఉండే డివైడర్లను గమనించకుండా వాహనాలు నడిపితే ప్రమాదాలు పొంచి ఉన్నట్లే. ఇలాంటి రహదారులపైన ఎదురెదురుగా వచ్చే వాహనాలు ఢీ కొనే అవకాశం తక్కువగానే ఉండొచ్చు. కానీ సరైన వెలుతురు లేకపోవడం వల్ల డివైడర్లే మృత్యుఘంటికలు మోగించే ప్రమాదం ఉంది. పొగమంచు కమ్ముకొని ఉన్నప్పుడు లైట్లు ఆర్పినా, కాంతి తక్కువగా ఉన్నా డివైడర్లను గుర్తించడం కష్టం.
► సాధారణంగా హైవేలపైన కార్లు, ఇతర అన్ని రకాల వాహనాలు గంటకు 80 కిలోమీటర్ల వేగంతో వెళ్లేందుకు అనుమతి ఉంటుంది. కానీ తెల్లవారు జామున 4 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల కంటే వేగం దాటకుండా వాహనాలను నడపాలని ఆర్టీఏ అధికారులు సూచిస్తున్నారు.
వెనుక లైట్లు వెలగాలి...
► రోడ్డు పక్కన బండి నిలిపి ఉంచినప్పుడు హెడ్‌లైట్‌లతో పాటు, వెనుక లైట్లు కూడా వెలుగుతూ ఉండాలి. దీనివల్ల ఇతర వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. నిలిపి ఉంచిన వాహనం ఉనికిని ఈజీగా గుర్తించేందుకు అవకాశం లభిస్తుంది.
► అలాగే వాహనం చుట్టూ రేడియం టేప్ తప్పనిసరి. దీనివల్ల మంచు కురిసే సమయంలోనూ వాహనం ఉనికి తెలుస్తుంది. చాలా వరకు వాహనదారులు ఈ చిన్న నిబంధనను పాటించకపోవడం వల్ల కూడా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని రవాణా శాఖ డిఫ్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ డాక్టర్ పుప్పాల శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. తెల్లవారు జామున జరిగే ప్రమాదాల్లో డ్రైవర్లు నిద్రమత్తులో ఉండడం కూడా మరో కారణం. సాధ్యమైంత వరకు ఉదయం 4 గంటల నుంచి 6 గంటల వరకు వాహనాలను నడపకపోవడమే మంచిది.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి...
పొగమంచు ఎక్కువగా ఉన్నప్పుడు ఎంతో అప్రమత్తంగా ఉండాలి. ఆసమయంలో రోడ్డు మధ్యలో వాహనం నడపడం కంటే ఎడమవైపు నెమ్మదిగా వెళ్లడం మంచిది. వేగాన్ని కూడా 50 కిలోమీటర్ల నుంచి ఇంకా తగ్గించి నడపాలి.
సాధారణంగా ఉదయంపూట ప్రయాణం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. ఆ సమయంలో ఏదో ఒక సంగీతం వింటూ బండి నడుపుతారు. ఈ ధోరణి ప్రమాదకరమని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment