హైదరాబాద్: సినీ నిర్మాత, ఎన్నారై అంజిరెడ్డి హత్య కేసులో ఆరుగురు నిందితులను గోపాలపురం పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పద్మారావునగర్‌కు చెందిన ఎన్‌ఆర్‌ఐ, సినీ నిర్మాత అంజిరెడ్డి విదేశాల్లో స్థిరపడేందుకు గాను పద్మారావునగర్‌లోని తన ఇంటిని విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. వాట్సాప్ గ్రూపులో వచ్చిన సమాచారంతో ఈ విషయం తెలుసుకున్న ఎస్డీ రోడ్డులోని జీఆర్ కన్వెన్షన్ యజమాని రాజేష్ ఆ ఇంటిని కొట్టేయాలని పథకం పన్నాడు.
ఇళ్లు కొనుగోలు చేస్తానని అంజిరెడ్డికి దగ్గరై అతడిని నమ్మించాడు. ఇందులో భాగంగా రూ.3.90 కోట్లకు బేరం కుదుర్చుకున్న అతను రూ.5లక్షలు అడ్వాన్స్‌గా ఇచ్చాడు. త్వరలో మిగతా మొత్తాన్ని ఇస్తానని చెబుతూ కాలం వెల్లబుచ్చాడు. అంతేగాక అంజిరెడ్డికి అంబర్‌పేట్‌లో ఉన్న మరో స్థిరాస్తిని కూడా కొనుగోలు చేస్తానని నమ్మించాడు. సెప్టెంబర్ 22న అంజిరెడ్డి దంపతులు ఆస్ట్రేలియా వెళ్లాల్సి ఉంది. అయితే 29న రెండు ఆస్తుల లావాదేవీలు పూర్తి చేసికుందామని రాజేష్ చెప్పడంతో అంజిరెడ్డికి భార్య అమెరికా వెళ్లిపోగా ఆయన ఇక్కడే ఉండిపోయాడు.
పథకం ప్రకారమే...
ఇంటిని సొంతం చేసేందుకు అంజిరెడ్డిని హత్య చేయాలని నిర్ణయించుకున్న రాజేష్ అందులో భాగంగా తన వద్ద డ్రైవర్‌గా చేసే ప్రభు కుమార్, హౌస్ కీపింగ్ పనిచేసే సచ్చేంద్ర పాశ్వాన్, జయ మంగళ్ కుమార్, వివేక్‌కుమార్, రాజేష్ కుమార్‌లతో రూ.4లక్షలు ఇచ్చేలా ఒప్పందం కుదర్చుకున్నాడు. గత నెల 29న సాయంత్రం అంజిరెడ్డికి ఫోన్ చేసి డబ్బు ఇస్తానని నమ్మించి ఎస్డీరోడ్డులోని డీమార్ట్ బిల్డింగ్ బేస్‌మెంట్–3కి రప్పించారు. అప్పటికే రూ.2 కోట్లు చెల్లించినట్లు డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంచుకున్న రాజేష్ ఆయనను సంతకం చేయాలని బెదిరించాడు.
అందుకు అంజిరెడ్డి ఒప్పుకోకపోవడంతో లిప్టులోకి తీసుకెళ్లి దాడి చేయడమేగాక ముక్కు నోరు మూసి ఊపిరి ఆడకుండా చేయడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం నిందితులు మృతదేహాన్ని బేస్‌మెంట్‌లోనే పడేసి కారు ప్రమాదం జరిగిందని నమ్మించేందుకు కారును ఫిల్లర్లకు గుద్ది సీన్ క్రియేట్ చేశారు. అనంతరం మిగతా నిందితులందరూ అక్కడి నుంచి పారిపోగా రాజేష్ అంజిరెడ్డి కారు ప్రమాదంలో మృతి చెందాడని కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు.
సీసీ కెమెరాలు..డీబీఆర్‌ల తొలగింపు
హత్యకు ముందుకు పథకం ప్రకారం డీ మార్ట్ బిల్డింగ్ బేస్‌మెంట్‌లో ఉన్న సీసీ కెమెరాలు, డీబీఆర్‌లను తొలగించారు. వేలి ముద్రలు పడకుండా చేతులకు గ్లౌజులు వేసుకుని హత్య చేశారు. రాజేష్‌పై తుకారంగేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీషీట్ ఉండగా ఇప్పుడు చిలకలగూడకు మార్చారు. మేడిపల్లి తదితర పోలీస్ స్టేషన్ల పరిధిలోనూ అతడిపై కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment