తన ముందు తరాలతో విద్యార్థిని శుభకృతి
హైదరాబాద్: ఐదు తరాలు అలరించాయి. ఒకే వేదికపైకి వచ్చి సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి. ఈ ఘనతను ఆదివారం నగరంలోని జూబ్లీహిల్స్ భారతీయ విద్యాభవన్ పబ్లిక్ స్కూల్ విద్యాశ్రమం దక్కించుకుంది. ఇక్కడ చదువుతున్న విద్యార్థుల కుటుంబాలను పరిచయం చేసే క్రమం చేపట్టారు. కన్నులపండువగా జరిగిన ఈ కార్యక్రమంలో ఐదు తరాలకు చెందిన కుటుంబం ఒకటి, నాలుగు తరాలకు చెందిన కుటుంబం ఒకటి, మూడు తరాలకు చెందిన నాలుగు కుటుంబాలు ఆహూతులను అలరించాయి. ఈ పాఠశాలల్లో చదువుతున్న తాళ్లపాక శుభకృతి 5వ తరగతి చదువుతోంది.
తల్లి జ్యోతిష్మతి గైనకాలజిస్ట్. తండ్రి కార్తీక్ భరద్వాజ్ సీసీఎంబీలో సైంటిస్ట్. ఈ చిన్నారి తన తల్లి జ్యోతిష్మతి, నాయనమ్మ నాగమణి, ఆ తర్వాత తరం సావిత్రీదేవి, పార్వతి.. వీరందరినీ ఒకే వేదికపై చూసుకుని మురిసిపోయింది. ఇలా ఆ తరానికి చెందిన వారంతా తమ అనుభవాలను నెమరువేసుకున్నారు. మరికొంత మంది వృద్ధాప్యాన్ని సైతం లెక్కచేయండా తమ ముని మనవలు, ముని మనవరాళ్లతో కలిసి సందడి చేశారు. కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ అరుణశ్రీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment