16 గంటల్లో పట్టేశారు.. | - | Sakshi
Sakshi News home page

కిస్‌వా జ్యువెలర్స్‌ దోపిడీ కేసు కొలిక్కి

Published Mon, Feb 19 2024 6:42 AM | Last Updated on Mon, Feb 19 2024 7:43 PM

- - Sakshi

సాక్షి, హైదరాబాద్: అక్బర్‌బాగ్‌ చౌరస్తాలోని కిస్‌వా జ్యువెలర్స్‌లో చోటు చేసుకున్న దోపిడీ కేసును పోలీసులు చేధించారు. ఈ నేరానికి ఒడిగట్టిన ముగ్గురు నిందితులను సౌత్‌ఈస్ట్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌, చాదర్‌ఘాట్‌ పోలీసులు 16 గంటల్లోనే గుర్తించి పట్టుకున్నట్లు డీసీపీ జానకి ధరావత్‌ పేర్కొన్నారు. ఈ ముగ్గురూ బైక్‌ టాక్సీలు నడుపుతుంటారని ఆమె వివరించారు. అదనపు డీసీపీ అందె శ్రీనివాసరావు, ఏసీపీ జి.శ్యామ్‌సుందర్‌తో కలిసి శుక్రవారం తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు.

విదేశాలకు వెళ్లివచ్చి మరో దేశం వెళ్లాలని...
ముంబైకి చెందిన నజీమ్‌ ఎజాజ్‌ కొటాడియా అక్కడే గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశాడు. కొన్నేళ్లుగా అతడి తల్లిదండ్రులతో పాటు సోదరి సైతం అమెరికాలో ఉంటోంది. నజీమ్‌ చిన్న వయస్సులోనే విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి ఎక్కువగా డబ్బు ఖర్చు చేసేవాడు. దీంతో అతడి తండ్రి హసన్‌ తన సంపాదన, ఆస్తి కుమారుడి చేతికి అందకుండా కట్టడి చేశాడు. తాను డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో కొన్నేళ్లుగా ఆఫ్రికా, చైనా, అమెరికాలో పలు ఉద్యోగాలు చేశాడు. 2022లో తిరిగి వచ్చిన ఇతగాడు ముంబైకి చెందిన యువతిని వివాహం చేసుకుని పాపకు తండ్రి అయ్యాడు. ఇతడి వ్యవహారశైలి నచ్చని భార్య కూడా తన కుమార్తెను తీసుకుని వేరుగా ఉంటోంది. నజీమ్‌ ప్రస్తుతం లండన్‌ వెళ్లి స్థిరపడాలనే ప్రయత్నాల్లో ఉన్నాడు.

డ్రైవర్‌ నుంచి మూడు బైక్స్‌కు ఓనర్‌గా...
ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నజీమ్‌ బతుకుదెరువు కోసం గతేడాది నగరానికి వలసవచ్చి కొంపల్లిలో నివసిస్తున్నాడు. తొలుత ఓ బైక్‌ ట్యాక్సీ కంపెనీలో డ్రైవర్‌గా చేరిన ఇతడు ఆపై సొంతంగా మూడు ద్విచక్ర వాహనాలు ఖరీదు చేశాడు. వీటిలో ఒకటి అతడే నడుపుతూ... మిగిలిన రెండింటినీ నడిపేందుకు ఉత్తరప్రదేశ్‌ నుంచి వచ్చి జీడిమెట్ల సుభాష్‌నగర్‌లో ఉంటున్న షౌకర్‌ రైనీ, వారిస్‌లను నియమించుకున్నాడు. నజీమ్‌ కొన్నాళ్ల క్రితం ఓ కస్టమర్‌ను తన బైక్‌పై తీసుకుని కిస్‌వా జ్యువెలర్స్‌కు వెళ్లాడు. అక్కడే దాదాపు 15 నిమిషాలు గడిపిన అతడికి ఆ దుకాణం ఉన్న ప్రాంతం, అందులోని పరిస్థితులు, లోపాలతో పాటు అక్కడ పని చేయడానికి వర్కర్స్‌ ఎవరూ లేకుండా యజమాని ఒక్కడే ఉంటాడనే విషయాన్ని గుర్తించాడు.

అక్బర్‌బాగ్‌–బోయిన్‌పల్లి మధ్య ‘దర్యాప్తు’...
ఆపై బైక్‌పై నజీమ్‌, షౌకత్‌ దుకాణంలోకి ప్రవేశించి కేవలం 2.13 నిమిషాల్లో దోపిడీ పూర్తి చేశారు. అక్కడ నుంచి వీరిద్దరూ బైక్‌పై మలక్‌పేటకు వచ్చి మెట్రో స్టేషన్‌ వద్ద దాన్ని పార్క్‌ చేసి వేర్వేరు ఆటోల్లో కొంపల్లి వెళ్లారు. వారిస్‌ మరో ఆటోలో అక్కడకు చేరుకున్నా క నజీమ్‌ ఇంట్లో కలుసుకుని సొత్తు అక్కడే ఉంచారు. ఆపై క్యాబ్‌ బుక్‌ చేసుకుని అబిడ్స్‌, మలక్‌పేటల్లో ఉన్న బైక్స్‌ తీసుకుని నజీమ్‌ ఇంటికి చేరుకున్నారు. ఈ కేసు దర్యాప్తు కోసం సౌత్‌ఈస్ట్‌ జోన్‌, చాదర్‌ఘాట్‌ ఇన్‌స్పెక్టర్లు ఎస్‌.సైదాబాద్‌, వై.ప్రకాష్‌రెడ్డి నేతృత్వంలోని బృందాలు రంగంలోకి దిగాయి. అక్బర్‌బాగ్‌–బోయిన్‌పల్లి మధ్య ఉన్న మార్గాల్లోని 300 కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌ పరిశీలించి నిందితులను గుర్తించారు. సాంకేతిక ఆధారాలను బట్టి ముగ్గురూ కొంపల్లిలోని నజీమ్‌ ఇంట్లో ఉన్నట్లు గుర్తించి పట్టుకున్నారు. వీరి నుంచి రూ.24 లక్షల విలువైన వెండి, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.

మిగిలిన ఇద్దరితో కలిసి దోపిడీ స్కెచ్‌..
లండన్‌ వెళ్లే ప్రయత్నాల్లో ఉన్న ఇతగాడు ఈ దుకా ణంలో దోపిడీ చేసి సొమ్ము చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయం తన వద్ద బైక్‌ డ్రైవర్లుగా పని చేసే షౌకత్‌, వారిస్‌లకు చెప్పి వారిని ఒప్పించాడు. దీంతో ముగ్గురూ కొన్ని రోజుల క్రితం ఆ దుకాణం వద్దకు వెళ్లి రెక్కీ చేసి వచ్చారు. వాస్తవానికి ఈ త్రయం మంగళవారమే దోపిడీ కోసం రంగంలోకి దిగింది. జ్యువెలరీ దుకాణం వద్ద అర్ధగంట ఎదురు చూసినా పరిస్థితులు అనుకూలించకపోవడంతో వెనక్కు తగ్గారు. మరుసటి రోజు (బుధవారం) ముగ్గురూ కొంపల్లిలోని నజీమ్‌ ఇంటి నుంచి మూడు బైక్‌లపై బయలుదేరారు. అబిడ్స్‌లోని తాజ్‌మహల్‌ హోటల్‌ వద్ద రెండు పార్క్‌ చేశారు. అక్కడి నుంచి నజీమ్‌, షౌకత్‌ ఓ బైక్‌ పైన, వారిస్‌ ఆటోలో బయలుదేరి కిస్‌వా జ్యువెలర్స్‌ వద్దకు వచ్చారు. తొలుత వారిస్‌ వినియోగదారుడిగా దుకాణంలోకి వచ్చాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement