సాక్షి, సిటీబ్యూరో: అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్లు మరింత సులభతరం కానున్నాయి. ఆన్‌లైన్‌లోనే పునరుద్ధరించుకునే సదుపాయం అందుబాటులోకి రానుంది. రవాణా శాఖ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘సారథి’సాంకేతిక పరిజ్ఞానంసహాయంతో వాహన వినియోగదారులు ఎక్కడి నుంచైనా ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ల(ఐడీపీ)ను రెన్యువల్ చేసుకొనే సదుపాయం ఉంటుంది. అమెరికా, దుబాయ్, యూరోప్ తదితర దేశాల్లోని నిబంధనల మేరకు రవాణా శాఖ అందజేసే డ్రైవింగ్ లైసెన్సులు, పర్మిట్ల ఆధారంగా ఏడాదిపాటు చెల్లుబాటు అయ్యేవిధంగా తాత్కాలికంగా లైసెన్సులను అందజేస్తారు. మరో ఏడాదిపాటు తీసుకోవాలంటే హైదరాబాద్ నుంచి మరోసారి ఐడీపీ పొందాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రత్యక్షంగా ఆర్టీఏ అధికారులను సంప్రదించాలి. కానీ, ‘సారథి’సేవలు వినియోగంలోకి వచ్చిన తరువాత ఆ ఇబ్బంది తొలగిపోనుందని ఆర్టీఏ అధికారి ఒకరు తెలిపారు. ఆర్టీఏ అందజేసే శాశ్వత డ్రైవింగ్ లైసెన్సులు, విదేశాల్లో ఉండేందుకు అనుమతించిన వీసాల ఆధారంగా ఆన్‌లైన్‌లోనే ఐడీపీలను పొందే అవకాశం లభిస్తుంది. సాధారణ లైసెన్సుల పునరుద్ధరణ, చిరునామా మార్పు, డూప్లికేట్ లైసెన్సులు వంటి ఆన్‌లైన్ సేవల్లో భాగంగా ఐడీపీ సదుపాయం ఉంటుంది. విదేశాల్లో ఉంటున్న వాళ్లకు దీనివల్ల భారీ ఊరట లభించనుంది.
అనూహ్యమైన స్పందన...
ఆర్టీఏ అందజేసే ఐడీపీలకు అనూహ్యమైన స్పందన లభిస్తోంది. విదేశాల్లో చదువుకొనేందుకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు, బంధువుల ఇళ్లకు వెళ్లేవాళ్లు, తాత్కాలిక వీసాలపై వెళ్లే పర్యాటకులు ఐడీపీల కోసం ఆర్టీఏ కార్యాయాల వద్ద క్యూ కడుతున్నారు. ఒక్క ఖైరతాబాద్ కేంద్ర కార్యాలయం నుంచి ప్రతిరోజు సగటున 25 నుంచి 30 ఐడీపీలను అందజేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లోని వివిధ ఆర్టీఏ కార్యాలయాల పరిధిలో సగటున 50 వరకు ఉండవచ్చని అంచనా. లైట్ మోటార్ వెహికల్(ఎల్‌ఎంవీ) డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉండి వీసా ఉన్న నగరవాసులు ఈ అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్లను తీసుకోవచ్చు. ఇందుకోసం ప్రస్తుతం ఆన్‌లైన్‌లో స్లాట్ నమోదు చేసుకొని సుమారు రూ.1,500 ఫీజు చెల్లించి నిర్ణీత తేదీ, సమయం ప్రకారం సంబంధిత ఆర్టీఏ అధికారులను సంప్రదించాలి. డాక్యుమెంట్‌ల పరిశీలన అనంతరం అదేరోజు ఐడీపీని అందజేస్తారు. ఈ ఐడీపీని ఆమోదించిన దేశాల్లో వాహనాలు నడిపేందుకు అర్హత లభిస్తుంది. కానీ, ఉద్యోగులు వీటి పునరుద్ధరణలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. సారథి పూర్తిస్థాయిలో వినియోగంలోకి వస్తే ఆ ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఉంది. మరోవైపు విదేశాల్లో వాహనాలు నడిపేందుకు పర్మిట్‌లు కోరుతున్న వాళ్లలో ఉద్యోగులతోపాటు మహిళలు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. విదేశాల్లోనే స్థిరపడ్డవాళ్లు మాత్రం కొంతకాలం తాత్కాలికంగా ఐడీపీ ఆధారంగా వాహనాలు నడిపేందుకు అనుమతి పొందినా శాశ్వతంగా మాత్రం అక్కడి రవాణా శాఖ నుంచి డ్రైవింగ్ లైసెన్సులను పొందవలసి ఉంటుంది.
తుదిదశలో ‘సారథి’పరిశీలన
దేశ వ్యాప్తంగా వాహనాల నమోదు, డ్రైవింగ్ లైసెన్సుల సేవలను ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం వాహన్ సారథిని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ‘వాహన్’సేవలు అందుబాటులోకి వచ్చాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన వాహనాల గణాంకాలు, చిరునామాలు వంటి వివరాలన్నింటినీ ‘వాహన్’లో నిక్షిప్తం చేశారు. దీనివల్ల వాహనదారులు ఒక రాష్ట్రంనుంచి మరో రాష్ట్రానికి, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వాహనాలను బదిలీ చేసుకొన్నప్పుడు ప్రత్యేకంగా నిరభ్యంతర పత్రం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవిధంగా వాహనాన్ని ఏ రాష్ట్రంలో కొనుగోలు చేసినా వాహన వినియోగానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఒకే విధమైన సేవలను పొందవచ్చు. వాహన్ ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. డ్రైవింగ్ లైసెన్సుల సేవలను సైతం ఏకీకృతం చేసేవిధంగా ‘సారథి’ని హైదరాబాద్ కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నారు. సికింద్రాబాద్ ప్రాంతీయ రవాణా కార్యాలయాన్ని ప్రయోగాత్మకంగా ఎంపిక చేశారు. సారథి సాంకేతిక వ్యవస్థ తుదిదశ పరిశీలనలో ఉంది. డ్రైవింగ్ లైసెన్సుల గణాంకాలను, వివరాలను సారథిలో నమోదు చేయడం వల్ల వాహనదారులు వాటి బదిలీలు, పునరుద్ధరణలో సారథి సేవలను వినియోగించుకోవచ్చు. అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్లకు కూడా ఈ సదుపాయం లభించనుంది.
‘సారథి’సాంకేతిక దన్నుతో ఆన్‌లైన్‌లో పునరుద్ధరణ
ఎక్కడి నుంచైనా సేవలను వినియోగించుకొనే అవకాశం
తుదిదశలో
సాంకేతిక అంశాల పరిశీలన...
Comments
Please login to add a commentAdd a comment