స్మార్ట్‌ పార్కింగ్‌ | - | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌ పార్కింగ్‌

Feb 28 2025 9:00 PM | Updated on Feb 28 2025 9:00 PM

స్మార్ట్‌ పార్కింగ్‌

స్మార్ట్‌ పార్కింగ్‌

సింగపూర్‌ తరహాలో.. నగరంలోని పలు ప్రాంతాల్లో..

సాక్షి, సిటీబ్యూరో:

అన్ని రంగాల్లో ప్రపంచంతోనే పోటీ అంటున్న ప్రభుత్వ ఆలోచనలకనుగుణంగా వాహనాల పార్కింగ్‌ సైతం అత్యాధునిక సాంకేతికతతో.. సింగపూర్‌ తరహాలో ఉండాలని బల్దియా భావిస్తోంది. బిల్డ్‌, ఓన్‌, ఆపరేట్‌, షేర్‌, ట్రాన్స్‌ఫర్‌ (బూస్ట్‌) విధానంలో పీపీపీ పద్ధతిలో ప్రైవేటు ఏజెన్సీల ఆధ్వర్యంలో వాటిని ఏర్పాటు చేసేందుకు జీహెచ్‌ఎంసీ సిద్ధమవుతోంది. సింగపూర్‌లోని స్మార్ట్‌ పార్కింగ్‌ సదుపాయాలతో పాటు ఆటోమేటిక్‌ నంబర్‌ ప్లేట్‌ రికగ్నిషన్‌ (ఏఎన్‌పీఆర్‌) సిస్టమ్‌ తదితరమైనవి వినియోగించుకోవాలనుకుంటోంది. పార్కింగ్‌ ప్రదేశంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా వాహనం లోనికి వెళ్లడం.. బయటకు రావడం, మొబైల్‌ యాప్‌ ద్వారా రియల్‌ టైమ్‌ పరిస్థితుల్ని తెలుసుకోవడం, డిజిటల్‌ చెల్లింపులు తదితర సదుపాయాలు కల్పించనున్నారు. ఇంటెలిజెంట్‌ డేటా అనాలిసిస్‌ వంటి వాటితో పార్కింగ్‌ ప్రదేశాన్ని ఎక్కువ ప్రయోజనకరంగా, సదుపాయవంతంగా వినియోగించుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం నగరంలోని పలు ప్రాంతాల్లో పార్కింగ్‌ సదుపాయాల్లేక అడ్డదిడ్డంగా వాహనాలు నిలపడం, తిరిగి వాటిని బయటకు తీయలేక నానా తిప్పలు పడుతుండటం తెలిసిందే. సింగపూర్‌ స్మార్ట్‌ పార్కింగ్‌ విధానం వల్ల ఈ ఇబ్బందులు తగ్గుతాయని భావిస్తున్నారు.

తొలుత ఖైరతాబాద్‌ జోన్‌లో..

సంపన్న వర్గాల ప్రజలు ఎక్కువగా ప్రయాణించే ఖైరతాబాద్‌ జోన్‌ పరిధిలోని బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, టోలిచౌకి, ఖైరతాబాద్‌, పంజగుట్ట వంటి ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తించనున్నారు. పరిస్థితుల్ని, సదుపాయాలకనుగుణంగా ఇండోర్‌ పార్కింగ్‌తో పాటు ఆన్‌–స్ట్రీట్‌, ఆఫ్‌–స్ట్రీట్‌ పార్కింగ్స్‌ ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం ఆర్‌ఎఫ్‌పీ టెండర్లను ఆహ్వానించారు. ఎంపికయ్యే ఏజెన్సీ జీహెచ్‌ఎంసీతో పాటు ట్రాఫిక్‌ పోలీసుల సహకారంతో తొలుత తగిన స్థలాలను గుర్తించాలి. మొదట మోడల్‌గా ఒక స్మార్ట్‌పార్కింగ్‌ సెంటర్‌ను ఏర్పాటుచేసి.. దాని అనుభవంతో మిగతా ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

బాధ్యత ఏజెన్సీదే..

పార్కింగ్‌ ఏర్పాట్లకు తగిన డిజైన్‌, నిర్మించే బాధ్యత ఏజెన్సీదే. ఐదేళ్లపాటు నిర్వహణ కూడా దానిదే. అనంతరం పనితీరును బట్టి పొడిగిస్తారు. లేదంటే జీహెచ్‌ఎంసీకి తిరిగి అప్పగించాలి. నిర్వహణ కాలంలో నిర్ణీత పార్కింగ్‌ ఫీజులు వసూలు చేసుకోవడంతోపాటు వ్యాపార ప్రకటనలు, తినుబండారాల అమ్మకాలు, ఎలక్ట్రిక్‌ వాహనాలకు చా ర్జింగ్‌ వంటివి ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ పార్కింగ్‌ ప్రదేశాల్లో ప్రభుత్వ, ప్రైవేట్‌ వాహనాలు పా ర్కింగ్‌ చేసుకోవచ్చు. ఆధునిక సాంకేతికతతో పనిచేసే స్మార్ట్‌ పార్కింగ్‌ సెన్సర్లు, కెమెరాలు, వైఫై, ఎల్‌పీ వ్యాన్‌ నెట్‌వర్క్‌ సదుపాయాలుండాలి.

ఎంతకాలం పడుతుందో?

వెబ్‌పోర్టల్‌ లేదా మొబైల్‌ ఫోన్‌నుంచి పార్కింగ్‌ ప్రదేశంలోని ఆక్యుపెన్సీని తెలుసుకొని స్లాట్‌ బుక్‌ చేసుకునే సదుపాయం ఉండాలి. ఏఐతో పని చేసే కెమెరాల ఏర్పాటు ద్వారా నంబర్‌ ప్లేట్లు, వాహనాల రాకపోకలు వంటివి మాత్రమే కాకుండా ఏవైనా ఇబ్బందులు తలెత్తినా వెంటనే తెలుసుకునే వీలుంటుందని అధికారులు చెబుతున్నారు. ఆలోచన బాగున్నప్పటికీ, అమల్లోకి రావడానికి ఎంతకాలం పడుతుందో వేచి చూడాల్సిందే. ప్రస్తుతం కేబీఆర్‌ పార్కు వద్ద ఒక మల్టీలెవెల్‌ పార్కింగ్‌ పనులు ప్రారంభం కాగా, పాతబస్తీలో మల్టీలెవెల్‌ పార్కింగ్‌ ఏళ్ల తరబడి పనులు జరగకపోవడం తెలిసిందే.

తొలుత సంపన్న వర్గాలున్న ఖైరతాబాద్‌ జోన్‌కు ప్రాధాన్యం

‘బూస్ట్‌’ విధానంలో ఏర్పాటుకు సిద్ధమైన జీహెచ్‌ఎంసీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement