వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే ఐదేళ్లకు పైగా బ్రిటీష్ హై-సెక్యూరిటీ జైలులో, ఏడేళ్లపాటు లండన్‌లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందిన తర్వాత బుధవారం ఆస్ట్రేలియాలో అడుగుపెట్టారు. 2010లో వేలాది రహస్య పత్రాలను వికీలీక్స్‌లో విడుదల చేయడంతో చిక్కుల్లో పడి న్యాయపోరాటం సాగించారు. ప్రపంచాన్ని కదిలించిన 10 వికీలీక్స్ ఇవే..
1. ఇరాక్ యుద్ధం
2010లో వికీలీక్స్ ఇరాక్ యుద్ధంలో పౌరుల ప్రాణనష్టం, వివాదాస్పద వ్యూహాలను బహిర్గతం చేసే రహస్య యూఎస్‌ఏ సైనిక పత్రాలను విడుదల చేసింది. దీంతో సైనిక కార్యకలాపాలలో పారదర్శకత ఆవశ్యకతపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగింది. అమెరికా సంకీర్ణ దళాల చర్యల కారణంగా చోటు చేసుకున్న పౌర మరణాలు వికీలీక్స్ కారణంగా వెల్లడయ్యాయి.
2. గ్వాంటనామో ఫైల్స్
వికీలీక్స్ గ్వాంటనామో బేలో జరుగుతున్న కార్యకలాపాలను వివరించే పత్రాలను ప్రచురించింది. ఖైదీలు ఎదుర్కొంటున్న చట్టపరమైన ఇబ్బందులను దీనిలో బహిర్గతం చేసింది. ఇది అంతర్జాతీయ నిరసనలకు ఆజ్యం పోసింది. ఖైదీలను హింసించడం, వారి హక్కులను కాలరాడయం లాంటి వివరాలు దీనిలో వెల్లడయ్యాయి.
3. ఆఫ్ఘన్ వార్ డైరీ
ఆఫ్ఘన్ వార్ డైరీ పత్రాలను వికీలీక్స్ విడుదల చేసింది, పౌర మరణాలు, రహస్య కార్యకలాపాలు, తాలిబాన్ వ్యూహాలను దానిలో బహిర్గతం చేసింది. యూఎస్‌ఏ కాంట్రాక్టర్లు ఆఫ్ఘనిస్తాన్‌లో కుర్రాళ్లను అసాంఘిక కార్యకలాపాలకు వినియోగించుకుంటున్న తీరు దీనిలో వెల్లడయ్యింది. ఆఫ్ఘన్‌లో తాలిబాన్ బలోపేతమవుతున్నదని వికీలీక్స్ వెల్లడించింది.
4. కొల్లేటరల్ మర్డర్ వీడియో
బాగ్దాద్‌లో యూఎస్ అపాచీ హెలికాప్టర్ దాడికి సంబంధించిన ఒక రహస్య వీడియోను వికీలీల్స్ విడుదల చేసింది. హెలికాప్టర్ సిబ్బంది పౌరులను సాయుధ తిరుగుబాటుదారులుగా పొరపాటుగా గుర్తించి, వారితోపాటు రాయిటర్స్ ఫోటోగ్రాఫర్, అతని డ్రైవర్‌పై కాల్పులు జరుపుతున్నట్లు ఉన్న వీడియోను బయటపెట్టింది. నాడు ఇది ప్రపంచవ్యాప్తంగా సంచలంగా మారింది.
5. ప్రపంచ నేతలపై ఎన్‌ఎస్‌ఏ టార్గెట్
అమెరికా జాతీయ భద్రతా సంస్థ (ఎన్‌ఎస్‌ఏ) ప్రపంచ నేతలను టార్గెట్ చేసిందని వికీలీక్స్ వెల్లడించింది. బెర్లిన్‌లో అప్పటి యూఎన్ సెక్రటరీ జనరల్ బాన్-కీ-మూన్, జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ మధ్య జరిగిన ప్రైవేట్ సమావేశాన్ని ఎన్‌ఎస్‌ఏ బగ్ చేసిందని వికీలీక్స్ పత్రాలు వెల్లడించాయి.
6. డీఎన్‌సీ ఈ మెయిల్ వివాదం
2016లో వికీలీక్స్.. డెమొక్రాటిక్ నేషనల్ కమిటీ(డీఎన్‌సీ)కి చెందిన ఈ మెయిల్స్‌ను విడుదల చేయడం ద్వారా పార్టీ అంతర్గత విభేదాలు ప్రపంచం ముందు వెల్లడయ్యాయి. లీకైన ఈ మెయిల్స్‌లో డీఎన్‌సీ అధికారులు బెర్నీ సాండర్స్ కన్నా హిల్లరీ క్లింటన్‌కు ప్రాధాన్యతనిచ్చారని వెల్లడయ్యింది. ఈ వివాదం సాండర్స్ మద్దతుదారులలో అపనమ్మకాన్ని పెంచింది. ఇది అమెరికన్ రాజకీయ వ్యవస్థలో పారదర్శకతపై చర్చకు దారితీసింది.
7. సౌదీ కేబుల్స్
సౌదీ దౌత్య వ్యవహరాలకు సంబంధించిన కీలక విషయాలను వికీలీక్స్ బయటపెట్టింది. లీకైన పత్రాలలో సౌదీ వ్యూహాత్మక పొత్తులు, రహస్య కార్యకలాపాలు, దౌత్య వివరాలున్నాయి. ఈ లీక్‌లు సౌదీ అరేబియా విదేశీ విధానాలను, ప్రాంతీయ సంఘర్షణలను బహిర్గతం చేసింది.
8. స్నోడెన్ ఎన్‌ఎస్‌ఏ పత్రాలు
ఎడ్వర్డ్ స్నోడెన్‌తో కలిసి, వికీలీక్స్ గ్లోబల్ నిఘా కార్యక్రమాలను బహిర్గతం చేసే క్లాసిఫైడ్ ఎన్‌ఎస్‌ఏ పత్రాలను ప్రచురించింది. ఇది గోప్యతా హక్కులు, ప్రభుత్వ పర్యవేక్షణ, విజిల్‌బ్లోయర్‌ల పాత్రపై చర్చలకు దారితీసింది. ఈ వెల్లడి జాతీయ భద్రత, పౌర స్వేచ్ఛల మధ్య సమతుల్యతపై పలు సందేహాలకు పురిగొల్పింది.
9. హిల్లరీ క్లింటన్ ఈ మెయిల్స్
2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో వికీలీక్స్ హిల్లరీ క్లింటన్ ప్రచారం, డెమోక్రటిక్ నేషనల్ కమిటీకి చెందిన ఈ మెయిల్స్‌ను ప్రచురించింది. ఇది సైబర్ భద్రత, రాజకీయ పారదర్శకత, విదేశీ జోక్యంపై ఆందోళనలకు దారితీసింది.
10. వాల్ట్ 7
2017లో వాల్ట్ 7 సిరీస్‌ను వికీలీక్స్ విడుదల చేసింది. దీనిలో సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(సీఐఏ) హ్యాకింగ్ సాధనాలు, నిఘా పద్ధతులను బహిర్గతం చేసింది. ఇది ప్రభుత్వ నిఘా సామర్థ్యాలు, డిజిటల్ గోప్యతపై ఆందోళను లేవనెత్తింది.
Comments
Please login to add a commentAdd a comment