గాజా సిటీ: పాలస్తీనా హమాస్ తీవ్రవాద సంస్థపై ఇజ్రాయెల్ ఆగ్రహావేశాలు చల్లారడం లేదు. హమాస్ కేంద్ర స్థావరమైన గాజా సిటీపై వరుసగా వైమానిక దాడులు సాగిస్తోంది. శనివారం శరణార్థుల క్యాంపుపై బాంబుల వర్షం కురిపించింది. ఈ ఘటనలో మరో 10 మంది పాలస్తీనియన్లు మృతిచెందారు. వీరిలో చాలామంది చిన్నారులే కావడం గమనార్హం. హమాస్ గ్రూపు అగ్రనేతల్లో ఒకరైన ఖలీల్ అల్–హయె నివాసంపై బాంబుదాడి చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్–హమాస్ మధ్య నెలకొన్న ఘర్షణలపై చర్చించేందుకు ఐక్యరాజ్యసమితి ఆదివారం సమావేశమయ్యే అవకాశం ఉంది.
ఏడాది పాటు సంధి చేసుకోవాలని, ఘర్షణ ఆపాలని ఈజిప్టు సూచించగా, హమాస్ అంగీకరించింది. ఇజ్రాయెల్ నో చెప్పింది. గాజాలో తాజా పరిస్థితిపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు ఫోన్ చేసింది మాట్లాడారు. స్వీయరక్షణకు ఇజ్రాయెల్ చేపడుతున్న చర్యలను నెతన్యాహు వివరించారు. గాజా సిటీపై ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటిదాకా 126 మంది పాలస్తీనావాసులు మరణించారు. ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడుల్లో శనివారం గాజా సిటీలోని బహుళ అంతస్తుల భవనం ధ్వంసమయ్యింది. 12 అంతస్తులున్న ఈ భవనంలోనే అసోసియేటెడ్ ప్రెస్(ఏపీ), అల్–జజీరా ఛానల్‌తోపాటు ఇతర మీడియా సంస్థల ఆఫీస్‌లున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment