ఫొటో కర్టెసీ: టోలో న్యూస్
కాబూల్: అఫ్గనిస్తాన్‌ను హస్తగతం చేసుకున్న తర్వాత తొలిసారిగా తాలిబన్ ప్రతినిధిని ఇంటర్వ్యూ చేసిన మహిళా జర్నలిస్టు బెహెస్తా అర్ఘాండ్ దేశం విడిచి పారిపోయారు. జర్నలిస్టులు, సాధారణ పౌరుల పట్ల తాలిబన్ల అరాచకాలకు భయపడి అఫ్గన్‌ను వీడారు. తాను కొన్నాళ్ల పాటు విదేశాల్లో ఉంటానని, దేశంలో పరిస్థితులు చక్కబడిన తర్వాత తిరిగి వస్తానని పేర్కొన్నారు. కాగా స్థానిక వార్తా చానెల్ టోలో న్యూస్ తరఫున తాలిబన్ ప్రతినిధి అబ్దుల్ హక్ హమ్మద్‌ను ఇంటర్వ్యూ చేయడం ద్వారా బెహెస్తా వార్తల్లో నిలిచారు. మహిళల పట్ల వివక్ష చూపమంటూ తాలిబన్లు ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఈ మేరకు వీడియోలు ప్రసారమయ్యాయి.
కాగా స్త్రీల హక్కులను కాలరాసే విధంగా.. మహిళా గవర్నర్ బంధించడం, కో- ఎడ్యుకేషన్ రద్దు చేస్తూ ఫత్వా జారీ చేయడం, టీవీ, రేడియోల్లో మహిళా గళాలపై కాందహార్‌లో నిషేధం విధిస్తూ కఠినమైన ఆంక్షలు జారీ చేయడం వంటి చర్యలతో ఇప్పటికే తాలిబన్లు తమ వైఖరిని స్పష్టం చేశారు. అంతేకాక తమకు వ్యతిరేకంగా పనిచేసిన జర్నలిస్టుల పట్ల కూడా ఉక్కుపాదం మోపుతున్నారనే వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో బెహెస్తా అఫ్గనిస్తాన్‌ను వీడటం గమనార్హం.
నాకూ భయాలు ఉన్నాయి..
ఈ విషయం గురించి ఆమె సీఎన్‌ఎన్‌తో మాట్లాడుతూ...‘‘తాలిబన్ల పాలన గురించి లక్షలాది మంది ప్రజలు భయపడుతున్నట్లుగానే నాక్కూడా భయాలు ఉన్నాయి. అందుకే దేశం వీడాను. ఇప్పుడు నేను సురక్షితంగా ఉన్నాను. ఒకవేళ తాలిబన్లు తాము ప్రకటించిన విధంగా మహిళ పట్ల వివక్ష చూపకుండా ఉంటే, అక్కడి పరిస్థితులు మెరుగపడితే కచ్చితంగా అఫ్గనిస్తాన్‌కు తిరిగి వెళ్తాను. నా దేశానికి, నా ప్రజలకు సేవ చేస్తాను’’ అని ఉద్వేగానికి లోనయ్యారు.
ఇక తాలిబన్ ప్రతినిధిని ఇంటర్వ్యూ చేయడం గురించి చెబుతూ.. ‘‘ఆరోజు చాలా కఠినమైనది. అఫ్గన్ మహిళల కోసమే నేను ఆ సాహసం చేశాను’’ అని తన అనుభవాన్ని పంచుకున్నారు. ‘‘ ఒకవేళ ఏ పని చేయకుండా ఇంట్లో ఉంటే.. మహిళలకు ఏమీ చేతకాదని అంటారు. కాబట్టి... మేం ఆఫీసులకు వెళ్తాం. పని చేస్తాం. అది మా హక్కు. సమాజ నిర్మాణంలో మాకూ భాగం కావాలి’’ అని 24 ఏళ్ల ఈ యువ జర్నలిస్టు పేర్కొన్నారు.
అఫ్గన్ పరిస్థితులకు అద్దం పడుతోంది
బెహెస్తా పనిచేసిన టోలో న్యూస్ యజమాని సాద్ మొహెసెనీ స్పందిస్తూ.. ‘‘ప్రముఖ రిపోర్టర్లు, జర్నలిస్టులంతా ఇప్పటికే దేశం విడిచి వెళ్లిపోయారు. వాళ్ల స్థానాన్ని భర్తీ చేయడం కష్టం. అందరూ భయపడిపోతున్నారు. చానల్ నడపటం ఒక సవాల్‌గా మారింది’’ అని చెప్పుకొచ్చారు. బెహెస్తా దేశం వీడటం తాలిబన్ పాలనకు అద్దం పడుతోందని పేర్కొన్నారు.
చదవండి: Afghanistan Crisis: మహిళలపై తాలిబన్ల అరాచకం.. మరో హుకుం జారీ
‘కాదంటే కాల్చి చంపి, శవాలతో శృంగారం చేస్తారు’
Comments
Please login to add a commentAdd a comment