![After 20 years US reports monkeypox case in Texas resident - Sakshi](/styles/webp/s3/article_images/2021/07/17/monkeypox.jpg.webp?itok=EFe6MxEK)
వాషింగ్టన్: కరోనా మహమ్మారితో ఇప్పటికీ ప్రపంచం అల్లాడుతోంటే అమెరికాలో తాజాగా అరుదైన మంకీ పాక్స్ వైరస్ కేసును గుర్తించారు. దాదాపు రెండు దశాబ్దాల తరువాత తొలిసారి అమెరికాలోని టెక్సాస్‌లో మంకీ పాక్స్ సోకిన వ్యక్తిని గుర్తించినట్టు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) శుక్రవారం తెలిపింది.
అమెరికా నివాసి అయిన బాధితుడు కొన్ని రోజుల క్రితం నైజీరియా వెళ్లి తిరిగి వచ్చినట్టు తెలిపారు. ప్రస్తుతం డల్లాస్‌లో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. దీంతో ఈ రోగితో సంబంధం కలిగి ఉండవచ్చనే అనుమానంతో లాగోస్, నైజీరియా, అట్లాంటా, డల్లాస్ మధ్య రెండు విమానాల ప్రయాణికులను, ఇతరులపై దృష్టిపెట్టింది
మరోవైపు స్మాల్ పాక్స్ వైరస్‌కి చెందినదిగా భావిస్తున్న ఈ మంకీపాక్స్ వల్ల ఆందోళన అవసరం లేదని, సాధారణ ప్రజలకు పెద్దగా ముప్పు ఉండదని ప్రభుత్వ అధికారులు తెలిపారు. తుంపర్ల వల్ల కూడా ఒకరి నుంచి మరొకరికి సోకే ప్రమాదం ఉన్నప్పటికీ కరోనా కారణంగా మాస్కులు ధరిస్తున్న నేపథ్యంలో పెద్దగా వ్యాపించకపోవచ్చని సీడీసీ వెల్లడించింది. అమెరికాలో తొలిసారిగా 2003లో 47 మందికి ఈ వైరస్ సోకింది. మిడ్‌వెస్ట్‌లోని పెంపుడు జంతువుల ప్రేరీ కుక్కలు, దిగుమతి చేసుకున్న ఆఫ్రికన్ ఎలుకల ద్వారా వైరస్ వ్యాప్తి చెందింది. కాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకారం మంకీపాక్స్ వైరస్ మధ్య, పశ్చిమ ఆఫ్రికాలోని మారుమూల ప్రాంతాల్లో ఎక్కువగా వచ్చే అరుదైన వైరల్ వ్యాధి. ఫ్లూతో మొదలై, లింఫ్ నోడ్స్‌లో వాపు, శరీరంపై భారీగా దద్దుర్లు రావడం జరుగుతుంది. రెండు నుండి నాలుగు వారాల వరకు లక్షణాలు ఉంటాయి. ప్రస్తుత గణాంకాల ప్రకారం మంకీపాక్స్ కేవలం ఒకశాతం మందిలో ప్రాణాంతకమని తేలింది.
Comments
Please login to add a commentAdd a comment