అగ్రరాజ్యం అమెరికా ఎన్నికల పోలింగ్‌కు సమయం ఆసన్నమైంది. నవంబర్ 5 (మంగళవారం)పోలింగ్ జరగనుంది. బరిలో ఇతర అభ్యర్థులు కూడా ఉన్నా ప్రధాన పోరు మాత్రం రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ మధ్యే జరగనుంది. పోలింగ్‌కు మరికొద్ది గంటలే ఉండడంతో ట్రంప్,హారిస్‌లు తమ ప్రచారాన్ని ఇప్పటికే ముగించారు. అమెరికాలో మొత్తం 27 కోట్ల మంది ఓటర్లుండగా ఎర్లీ ఓటింగ్‌లో భాగంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇప్పటికే 6.8 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ నేపథ్యంలో పోలింగ్, ఫలితాలు, ఎలక్టోరల్ కాలేజీ తతంగం, కొత్త అధ్యక్షుడి ప్రమాణస్వీకారం తదితర విషయాలను ఒకసారి చూద్దాం.
పోలింగ్ నవంబర్‌లోనే ఎందుకు..?
ప్రతిసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ నవంబర్ నెలలోని తొలి మంగళవారమే నిర్వహిస్తారు. ఈ మేరకు 1845లో చట్టం చేశారు. ఈసారి నవంబర్ తొలి మంగళవారం అయిదో తేదీ వచ్చినందున అధ్యక్ష ఎన్నికలు 5వ తేదీన జరుగుతున్నాయి. అప్పట్లో వ్యవసాయం ప్రధానంగా ఉన్న అమెరికాలో పంటల కోత పూర్తవడంతో పాటు ప్రయాణాలకు అనుకూల వాతావరణం ఉండడంతో నవంబర్‌ను ఎన్నికల కోసం ఎంచుకున్నారు. కాగా,1845కు ముందు అధ్యక్ష ఎన్నికలు అమెరికాలోని ఒక్కో రాష్ట్రంలో ఒక్కో సారి జరిగేవి.
పోలింగ్ సమయాలు..
అమెరికాలోని ఒక్కో రాష్ట్రంలో అక్కడి కాలమానం ప్రకారం మంగళవారం(నవంబర్ 5)వ తేదీ ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి వరకు జరుగుతుంది. ఇదే ఇండియా టైమింగ్స్ ప్రకారం చూస్తే మనకు మంగళవారం సాయంత్రం 4.30 నుంచి రాత్రి 9.30 గంటల మధ్య అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రారంభమవుతుంది.
ఫలితాలు ఎప్పుడు..?
అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే ప్రాథమిక ఫలితాలు వెలువడతాయి. ట్రంప్,హారిస్ మధ్య పోరు హోరాహోరీగా ఉంటే మాత్రం తుది ఫలితాలు వెలువడేసరికి ఒకటి రెండు రోజులు పడుతుంది. ఇక ఎలక్టోరల్ కాలేజీ ఎన్నిక తతంగం పూర్తై అధ్యక్షుడి ప్రమాణస్వీకారం జరగాలంటే 2025 జనవరి 20 దాకా ఆగాల్సిందే. ఒకవేళ జనవరి 20 ఆదివారం అయితే జనవరి 21న ప్రమాణస్వీకారం ఉంటుంది. ఇప్పటివరకు ఉన్న ఒపీనియన్ పోల్స్ అంచనాల ప్రకారమైతే ట్రంప్ కంటే కమలా హారిస్ కొద్దిగా ముందంజలో ఉన్నారు.
ప్రజల ఓటు నేరుగా అధ్యక్షుడికి వెళుతుందా..?
అమెరికా ప్రెసిడెంట్‌గా ఎన్నిక కావాలంటే ముందుగా 50 రాష్ట్రాల్లో పాపులర్ ఎన్నికలు జరగాలి. ఈ ఎన్నికల్లో ప్రజలు ఓట్లేస్తారు. ఇవి కాకుండా ప్రతీ రాష్ట్రంలో జనాభా ఆధారంగా ఎలక్టోరల్ ఓట్లు ఉంటాయి దీనినే ఎలక్టోరల్ కాలేజీ అంటారు. మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లుంటాయి. అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న పార్టీలు ఆయా రాష్ట్రాల్లో తమ ఎలక్టర్లను ముందే నిర్ణయిస్తాయి. అయితే ఓటింగ్ సమయంలో మాత్రం ప్రజలు బ్యాలెట్ పేపర్‌పై అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకున్నట్లుగానే ఓటు వేస్తారు. ఈ ఓట్లన్నీ ఎలక్టర్లకు వెళతాయి. ఎన్నికల్లో పాపులర్ ఓట్లు ఎక్కువగా వస్తే విజయం సాధించలేరు. ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లు వస్తేనే అధ్యక్ష ఎన్నికల్లో గెలుస్తారు. మొత్తం 538 ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లలో 270 వచ్చిన వారు విజయం సాధించినట్లు. కాలిఫోర్నియాలో అత్యధికంగా 54,టెక్సాస్‌లో 40 ఎలక్టోరల్ ఓట్లుండగా తక్కువ జనాభాగల వ్యోమింగ్‌కు మూడు ఎలక్టోరల్ ఓట్లున్నాయి. మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లకుగాను 270 ఓట్లు లభించినవారు అధ్యక్షులవుతారు.
స్వింగ్ రాష్ట్రాలు ఏంటి.. ఎందుకు కీలకం..?
అమెరికా ఎన్నికల్లో చాలా రాష్ట్రాలు ఏదో ఒక పార్టీ వైపు మొగ్గు చూపుతాయి. అయితే కొన్ని రాష్ట్రాలు మాత్రం తటస్థంగా ఉంటాయి. వీటిని స్వింగ్ స్టేట్స్ అని అంటారు. వీటికి అధ్యక్ష ఎన్నిక ఫలితాన్ని తారుమారు చేసే సత్తా ఉంటుంది. పార్టీలు ఈ స్వింగ్ రాష్ట్రాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టి ప్రచారం ఎక్కువగా నిర్వహిస్తాయి. 2024 ఎన్నికల్లో స్వింగ్ రాష్ట్రాలుగా భావిస్తున్న పెన్సిల్వేనియా, ఆరిజోనా, జార్జియా, మిషిగన్, నెవడా, నార్త్ కరోలినా, విస్కాన్సిన్- రాష్ట్రాల్లో కలిపి 93 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లున్నాయి. ఇవే అధ్యక్ష పీఠాన్ని మలుపుతిప్పుతాయన్నది సుస్పష్టం. అందుకే వీటిపై పట్టుకోసం హారిస్, ట్రంప్ హోరాహోరీగా ప్రయత్నించారు. ఎలక్టోరల్ కాలేజీకి ఎంపికైన ప్రతినిధులు (ఎలక్టర్లు ) డిసెంబరు 17న సమావేశమై అధ్యక్షుడిని ఎన్నుకుంటారు.
ఎలక్టోరల్ కాలేజీ రిజల్ట్ టై అయితే అధ్యక్ష ఎన్నిక ఎలా..
ఎలక్టోరల్ కాలేజీ ఓట్లలో ఏ అధ్యక్ష అభ్యర్థికి 270 రాకుండా ఇద్దరూ 269 ఓట్ల దగ్గరే ఆగిపోతే ఫలితం టై అవుతుంది. ఈ పరిస్థితుల్లో కంటింజెంట్ ఎన్నిక నిర్వహిస్తారు. ఇలాంటి సందర్భంలో హౌజ్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్ ప్రతినిధులు తమ ఓటు హక్కు ద్వారా ఇద్దరిలో ఒకరిని అధ్యక్షుడిగా ఎన్నుకుంటారు. ఇదే వైస్ ప్రెసిడెంట్ విషయంలో అయితే సెనేట్ సభ్యులకు ఓటు హక్కు కల్పించి ఉపాధ్యక్షుడిని నిర్ణయిస్తారు.ఇందుకోసం 1800 అధ్యక్ష ఎన్నిక తర్వాత రాజ్యాంగానికి 12వ సవరణ తీసుకువచ్చారు.
ఇండియన్ అమెరికన్ ఓటర్ల ప్రభావం ఎంత..?
అమెరికా ఎన్నికల్లో భారతీయ అమెరికన్ల ఓటర్ల ప్రభావం చాలా వరకు ఉంటుందని ఇండియన్ అమెరికన్ కాంగ్రెస్‌మెన్ రాజాకృష్ణమూర్తి చెప్పారు. స్వింగ్ స్టేట్స్‌తో పాటు దేశవ్యాప్తంగా భారతీయ అమెరికన్ల ఓట్లు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. తమ సమస్యలను పరిష్కరించే అధ్యక్షుడి కోసం భారతీయ అమెరికన్లు చూస్తున్నారని చెప్పారు.
-- సాక్షి వెబ్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment