
సియోల్: అంతర్జాతీయంగా వస్తున్న వ్యతిరేకతల్ని బేఖాతర్ చేస్తూ ఉత్తర కొరియా మరోసారి బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు నిర్వహించింది. తూర్పు సముద్రంలో సోమవారం ఈ పరీక్షలు నిర్వహించినట్టుగా దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ జనరల్ వన్ ఇన్ చౌల్ వెల్లడించారు. ఆ క్షిపణి 700 కి.మీ. దూరంలో లక్ష్యాలను ఛేదించగలదని చెప్పారు. ప్రస్తుతం అమెరికా, ఉత్తర కొరియా మధ్య అణుచర్చలపై సంక్షోభం కొనసాగుతున్నప్పటికీ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ అణ్వాయుధ కార్యక్రమాన్ని విస్తరిస్తామని ఇప్పటికే తెగేసి చెప్పారు. వారం వ్యవధిలోనే రెండోసారి క్షిపణి పరీక్షలు నిర్వహించి దక్షిణ కొరియాకు సవాల్ విసిరారు. తూర్పు సముద్రంలో ఈ పరీక్షలు నిర్వహించడంతో జపాన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. తమ దేశ నౌకలు, విమానాలు ఏమైనా ధ్వంసమయ్యాయా అన్న దిశగా విచారణ జరుపుతోంది.