ఢాకా: పొరుగు దేశం బంగ్లాదేశ్ నేడు జరిగే సాధారణ ఎన్నికలకు సిద్ధమైంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఎన్‌పీ ఎన్నికలను బహిష్కరించాలంటూ 48 గంటల దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతా ఏర్పాట్లను ముమ్మరం చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న 300 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిపేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. 436 మంది స్వతంత్రులు సహా 27 రాజకీయ పార్టీలకు చెందిన 1,500 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
సుమారు 11.96 కోట్ల మంది ఓటర్లు 42 వేల పోలింగ్ స్టేషన్లలో ఓటు వేయనున్నారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ సాగుతుంది. భారత్‌కు చెందిన ముగ్గురు సహా వంద మందికి పైగా విదేశీ పరిశీలకులు పోలింగ్ నిర్వహణ తీరును పరిశీలిస్తారు. ఈ నెల 8వ తేదీన ఫలితాలు వెల్లడవుతాయని భావిస్తున్నారు. అవామీ లీగ్ చీఫ్ అయిన ప్రధాన మంత్రి షేక్ హసీనా వరుసగా నాలుగోసారి అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు.
మాజీ ప్రధాని, ప్రధాన ప్రతిపక్ష నేత ఖలీదా జియా అవినీతి ఆరోపణలపై జైలులో ఉన్నారు. ఆ పార్టీ ఈ ఆదివారం జరిగే ఎన్నికలను బహిష్కరించాలంటూ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో శనివారం దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. బీఎన్‌పీ కార్యకర్తలు నాలుగు పోలింగ్ బూత్‌లపై బాంబు దాడులకు పాల్పడ్డారు. శుక్రవారం రాత్రి ఢాకాలో రైలుకు దుండగులు నిప్పుపెట్టడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
Comments
Please login to add a commentAdd a comment