సుప్రీంకోర్టు సంచలన తీర్పు
56 శాతం ఉన్న రిజర్వేషన్లు 7 శాతానికి తగ్గింపు
స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలకు 5 శాతమే
0 శాతం నుంచి భారీగా కుదింపు
వెనుకబడిన జిల్లాల ప్రజలు, మహిళలకు రిజర్వేషన్లు రద్దు
న్యాయస్థానం స్పషీ్టకరణ.. విద్యార్థులకు పాక్షిక విజయం
ఢాకా: బంగ్లాదేశ్‌ను అగ్నిగుండంగా మార్చిన రిజర్వేషన్ల వివాదానికి ముగింపు పలికే దిశగా సుప్రీంకోర్టు ఆదివారం సంచలనాత్మక తీర్పు వెలువరించింది. 1971లో బంగ్లా విముక్తి ఉద్యమంలో పాల్గొన్నవారి వారసులకు, కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇప్పటిదాకా కలి్పస్తున్న 30 శాతం కోటాలో భారీగా కోత విధించింది.
కేవలం 5 శాతానికి పరిమితం చేసింది. వెనుకబడిన జిల్లాల ప్రజలకు, మహిళలకు 10 శాతం చొప్పున రిజర్వేషన్లు అమల్లో ఉండగా, న్యాయస్థానం వాటిని రద్దు చేసింది. గిరిజనులు/మైనార్టీలకు కల్పిస్తున్న 5 శాతం రిజర్వేషన్లను ఒక శాతానికి తగ్గించింది. దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లకు అమల్లో ఉన్న ఒక శాతం రిజర్వేషన్లలో ఎలాంటి మార్పు చేయలేదు.
మొత్తంగా 56 శాతం ఉన్న కోటాను ఏకంగా 7 శాతానికి కుదించడం గమనార్హం. 93 శాతం ప్రభుత్వ ఉద్యోగాలను కేవలం ప్రతిభ ఆధారంగానే భర్తీ చేయాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో రిజర్వేషన్లు పూర్తిగా రద్దు చేసి, ప్రతిభావంతులకే ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గత వారం రోజులుగా తీవ్రంగా పోరాడుతున్న విద్యార్థులకు పాక్షిక విజయమే దక్కినట్లయ్యింది.
రిజర్వేషన్లకు షేక్ హసీనా అనుకూలం
ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో అధికారంలో ఉన్న అవామీ లీగ్ పార్టీ బంగ్లా విముక్తి ఉద్యమానికి సారథ్యం వహించింది. సహజంగానే ఆ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటా విధానంతో లబ్ధి చేకూరుతోంది. ఈ రిజర్వేషన్లను ప్రధానమంత్రి షేక్ హసీనా పరోక్షంగా సమరి్థస్తున్నారు. సొంతదేశం కోసం పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో త్యాగాలు చేసిన సమరయోధుల కుటుంబాలకు సమున్నత గౌరవం ఇవ్వాలని ఆమె వాదిస్తున్నారు. అయితే, ఇది పూర్తిగా వివక్షతో కూడిన విధానమని విద్యార్థులు మండిపడుతున్నారు.
రిజర్వేషన్లు పూర్తిగా పక్కనపెట్టి, కేవలం ప్రతిభ ఆధారంగా నియామకాలు చేపట్టాలని పట్టుబడుతున్నారు. బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాలు క్రమంగా తగ్గిపోతుండడం, అందుబాటులో ఉన్న కొద్దిపాటి ఉద్యోగాలు రిజర్వేషన్ల పేరిట కొన్ని కుటుంబాలకే దక్కుతుండడం, తమకు అన్యాయం జరుగుతుండడంతో విద్యార్థుల్లో అసహనం మొదలైంది. అదే చివరకు రిజర్వేషన్ల వ్యతిరేక పోరాటంగా మారింది. ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్టు పారీ్ట(బీఎన్‌పీ) సైతం విద్యార్థులకు అండగా నిలిచింది.
ఎందుకీ ఆందోళనలు?
1971లో జరిగిన బంగ్లాదేశ్ విముక్తి ఉద్యమంలో వేలాది మంది పాల్గొన్నారు. ఆస్తులు పోగొట్టుకున్నారు. ప్రాణత్యాగాలు సైతం చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచి్చన తర్వాత వారి కుటుంబాలకు న్యాయం చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం రిజర్వేషన్ల విధానం తీసుకొచి్చంది. విముక్తి ఉద్యమంలో భాగస్వాములైన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్లు కలి్పంచింది.
2018లో ఈ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. దేశవ్యాప్తంగా అలజడి సృష్టించారు. దాంతో అప్పటి ప్రభుత్వం దిగివచి్చంది. రిజర్వేషన్లను నిలిపివేసింది. స్వాతంత్య్ర సమరయోధుల బంధువుల విజ్ఞప్తి మేరకు రిజర్వేషన్లను పునరుద్ధరిస్తూ ఈ ఏడాది జూన్‌లో బంగా>్లదేశ్ హైకోర్టు తీర్పు ప్రకటించడంతో విద్యార్థులు మళ్లీ భగ్గుమన్నారు.
రిజర్వేషన్లు వెంటనే రద్దు చేయాలంటూ పోరుబాట పట్టారు. వీధుల్లోకి వచ్చి పోలీసులతో ఘర్షణకు దిగారు. ఈ నేపథ్యంలో షేక్ హసీనా ప్రభుత్వంలో కలవరం మొదలైంది. ఘర్షణల్లో విద్యార్థులు మరణిస్తుండడం, శాంతి భద్రతలు అదుపు తప్పుతుండడంతో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
రిజర్వేషన్లపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు రిజర్వేషన్లు పూర్తిగా రద్దు చేయకుండా, అన్ని రకాల రిజర్వేషన్లను 7 శాతానికి పరిమితం చేస్తూ తీర్పు వెల్లడించింది. ఇందులో 5 శాతం బంగ్లా స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలకు, 2 శాతం ఇతరులకు కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఆందోళనలు ఆపేదిలేదన్న విద్యార్థులు
తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చేవరకూ ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థి సంఘాల నేతలు తేలి్చచెప్పారు. అరెస్టు చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని, హింసకు కారణమైన అధికారులను సస్పెండ్ చేయా లని వారు డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత బంగ్లాదేశ్‌లో పరిస్థితి కొంత అదుపులోకి వచి్చంది. కర్ఫ్యూ నిబంధనలను ఇంకా సడలించలేదు. కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులను ప్రభుత్వం ఉపసంహరించలేదు. ఈ ఘటనలో మృతిచెందినవారు 150కి చేరినట్లు సమాచారం. ప్రభుత్వం సోమవారం సెలవు ప్రకటించింది. ప్రజలు బయటకు రావొద్దని సూచించింది.
బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లు (శాతాల్లో)
గతంలో ఇప్పుడు
సమరయోధుల కుటుంబాలకు 30 5
వెనుకబడిన జిల్లాల ప్రజలకు 10 –
మహిళలకు 10 –
గిరిజనులు/మైనారీ్టలకు 5 1
దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లకు 1 1
Comments
Please login to add a commentAdd a comment