
బీరూట్: లెబనాన్ రాజధాని బీరూట్‌లో సంభవించిన భారీ పేలుళ్లతో దేశంలో భయానక వాతావరణం నెలకొంది. నగరంలో ఎక్కడ చూసినా హృదయ విదారక దృశ్యాలే దర్శనమిస్తున్నాయి. ఈ పేలుళ్లలో సుమారు 100 మంది మరణించగా వేలాది మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంలో వీధులకు వీధులే నేలమట్టం అయ్యాయి. మరికొన్ని ఇళ్లలో బాల్కనీలు, కిటికీలు దారుణంగా దెబ్బతిన్నాయి. నగరంలో ఎక్కడ చూసినా శ్మశాన నిశబ్దమే రాజ్యమేలుతోంది. విధ్వంసానికి సంబంధించి పొగ ఇంకా వెలువడుతూనే ఉంది. పోర్ట్ ఏరియా పూర్తిగా ధ్వంసమయ్యింది. ఎక్కడిక్కడ భారీ నిర్మణాలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. రోడ్లన్ని గాజు పెంకులు, ఇనుప చువ్వలతో నిండి పోయాయి. అపార్ట్‌మెంట్లలోని ప్లాట్స్ పూర్తిగా దెబ్బతిన్నాయి. నరమానవుడనే వాడు ప్రస్తుతం ఈ ప్లాట్స్‌లో కనిపించడం లేదు. విధ్వంసానికి సంబంధించిన ఏరియల్ ఫూటేజ్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. (బీరూట్ విధ్వంసానికి అసలు కారణం ఇదేనా?)
బీరుట్లో జరిగిన భారీ పేలుళ్లలో 2,750 టన్నుల అమ్మోనియం నైట్రేట్ పేలిందని.. కనీసం 100 మంది మృతి చెందారని, 4,000 మందికి పైగా గాయపడ్డారని లెబనాన్ అధ్యక్షుడు తెలిపారు. పేలుడు తర్వాత గాల్లోకి ప్రమాదకర పదార్థాలు విడుదలయ్యాయన్నారు. ఇవి దీర్ఘకాలిక ప్రాణాంతక ప్రభావాలను కలిగిస్తాయని లెబనాన్ ఆరోగ్య మంత్రి చెప్పారు. అంతేకాక ప్రమాదకరమైన రసాయనాలను ఎలాంటి భద్రతా చర్యలు లేకుండా ఆరేళ్లపాటు గిడ్డంగిలో నిల్వ చేసినట్లు అధికారులు తెలిపారు. బాధ్యులు తగిన మూల్యం చెలల్లిస్తారని ప్రధాని హసన్ డియాబ్ హెచ్చరించారు. పేలుడు కేంద్రంగా ఉన్న గిడ్డంగిని ప్రమాదకరమైనదిగా ఆయన పేర్కన్నారు. ఈ విపత్తుకు కారణమయిన బాధ్యులకు సంబంధించి పూర్తి వివరాలను త్వరలోనే ప్రజలకు వెల్లడిస్తామని హసన్ తెలిపారు.