రష్యాపై అమెరికా ఆంక్షల కొరడా! | Biden Sanctions Russia for Beginning Invasion in Ukraine | Sakshi
Sakshi News home page

రష్యాపై అమెరికా ఆంక్షల కొరడా!

Published Thu, Feb 24 2022 5:22 AM | Last Updated on Thu, Feb 24 2022 10:38 AM

Biden Sanctions Russia for Beginning Invasion in Ukraine - Sakshi

పోలండ్‌కు చేరుకున్న అమెరికా బలగాలు

వాషింగ్టన్‌/ఐరాస:  ఉక్రెయిన్‌పై రష్యా దూకుడును అడ్డుకునేందుకు ఆ దేశంపై కఠిన ఆంక్షలకు అమెరికా తెర తీసింది. పాశ్చాత్య దేశాలతో రష్యా ప్రభుత్వ అభివృద్ధి సంస్థ (వీఈబీ), సైనిక బ్యాంకు లావాదేవీలపై పూర్తి నిషేధం విధించింది. రష్యా సావరిన్‌ రుణాలకు కూడా తమ ఆంక్షలు వర్తిస్తాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించారు. అమెరికా, పాశ్చాత్య దేశాలతో రష్యా ఇకపై ఎలాంటి వర్తక, వాణిజ్యాలూ జరపలేదన్నారు. తమ మార్కెట్లకు రష్యా ఇక పూర్తిగా దూరమైనట్టేనన్నారు.

తమ పాశ్చాత్య మిత్రులతో సన్నిహితంగా చర్చించిన మీదటే ఈ మేరకు సంయుక్త నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. అతి త్వరలో మరిన్ని వరుస ఆంక్షలుంటాయని హెచ్చరించారు. అవి రష్యా సంపన్నులు, వారి కుటుంబీకులను లక్ష్యం చేసుకుని ఉంటాయని వెల్లడించారు. రష్యా అవినీతిమయ విధానాలతో భారీగా లాభపడే ఈ కుబేరులు ఇప్పుడు నొప్పిని కూడా భరించాల్సి ఉంటుందన్నారు. అలాగే జర్మనీతో కలిసి రష్యా తలపెట్టిన నార్డ్‌ స్ట్రీమ్‌ 2 పైప్‌లైన్‌ ముందుకు సాగే ప్రసక్తే ఉండబోదని స్పష్టం చేశారు. రష్యా చర్యలన్నింటికీ అంతకు మించిన ప్రతి చర్యలతో తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తూర్పు ఉక్రెయిన్‌లోని వేర్పాటువాద ప్రాంతాలకు స్వతంత్ర హోదా ఇచ్చే అధికారం రష్యాకు ఎవరిచ్చారంటూ బైడెన్‌ దుయ్యబట్టారు.

‘‘ఉక్రెయిన్‌లోని ఒక పెద్ద భూభూగానికి రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తనంత తానుగా స్వతంత్రం ప్రకటించారు! తద్వారా అంతర్జాతీయ చట్టాలను, న్యాయాలను తుంగలో తొక్కారు. అక్కడితో ఆగకుండా మరింత ముందుకు వెళ్తామని తన ప్రసంగంలో చెప్పకనే చెప్పారు. ఇది కచ్చితంగా ఉక్రెయిన్‌పై పూర్తిస్థాయి దాడికి ఆరంభమే’’ అంటూ బైడెన్‌ మండిపడ్డారు. ఇందుకు ప్రతి చర్యగా ఎస్టోనియా, లాత్వియా, లిథువేనియాలతో కూడిన బాల్టిక్‌ ప్రాంతానికి మరిన్ని అమెరికా దళాలను, ఆయుధాలను పంపుతున్నట్టు కూడా బైడెన్‌ ప్రకటించారు. అయితే రష్యాతో యుద్ధానికి దిగే ఉద్దేశమేదీ అమెరికాకు లేదని స్పష్టం చేశారు. కాకపోతే నాటో సభ్య దేశాలకు చెందిన ప్రతి అంగుళాన్నీ కాపాడి తీరతామని రష్యాకు గట్టి సందేశమివ్వడమే తమ ఉద్దేశమన్నారు.

రష్యా దూకుడు మానకుంటే మరిన్ని ఆంక్షలు తప్పవని ఇంగ్లండ్‌ కూడా మరోసారి హెచ్చరించింది. సంక్షోభం నుంచి బయట పడేందుకు ఉక్రెయిన్‌కు 50 కోట్ల డాలర్ల దాకా రుణ సాయం చేస్తామని పునరుద్ఘాటించింది. ఆస్ట్రేలియా, జపాన్‌ తదితర దేశాలు కూడా బుధవారం రష్యాపై పలు ఆంక్షలు విధించాయి. రష్యాపై ఆంక్షలను చైనా తీవ్రంగా తప్పుబట్టింది. ఉక్రెయిన్‌కు భారీగా ఆయుధాలిస్తూ సమస్యను అమెరికాయే ఎగదోస్తోందని ఆరోపించింది. సంక్షోభానికి శాంతియుత పరిష్కారం కోసం ప్రయత్నించడం తక్షణావసరమని సూచించింది. మరోవైపు ఉక్రెయిన్‌ ఉద్రిక్తతలపై గురువారం జరగాల్సిన అమెరికా, రష్యా విదేశాంగ మంత్రుల భేటీ రద్దయింది. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ ఈ మేరకు ప్రకటించారు. కాకపోతే సంక్షోభ నివారణకు చర్చలకు తామిప్పటికే సిద్ధమేనని బైడెన్‌ స్పష్టం చేశారు. రష్యా, ఉక్రెయిన్‌ ఉద్రిక్తతలు ప్రపంచ శాంతికి విఘాతమంటూ పోప్‌ ఫ్రాన్సిస్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

అతి పెద్ద సంక్షోభమిది: గుటెరెస్‌
రష్యా దూకుడుతో ప్రపంచ శాంతి, భద్రత పెను సంక్షోభంలో పడ్డాయని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. తూర్పు ఉక్రెయిన్‌లోకి సైన్యాన్ని పంపుతూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తీసుకున్న నిర్ణయాన్ని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్‌ దుయ్యబట్టారు. ఇది అంతర్జాతీయ నిబంధనలకు, ఐరాస నియమావళికి గొడ్డలి పెట్టేనన్నారు. పొరుగు దేశంలోకి జరిపిన సైనిక చొరబాటుకు శాంతి పరిరక్షణ అని పేరు పెట్టడం దారుణమన్నారు. తన దూకుడు చర్యల నుంచి తక్షణం వెనక్కు తగ్గాలని రష్యాను హెచ్చరించారు. లేదంటే ఇరు దేశాలూ అంతమంగా తీవ్రంగా నష్టపోతాయని అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్‌కు ఐరాస పూర్తి మద్దతుంటుందని చెప్పారు.

తిరిగొస్తున్న మన విద్యార్థులు
న్యూఢిల్లీ: ఉద్రిక్తతల నేపథ్యంలో ఉక్రెయిన్‌లో వైద్య విద్య చదువుతున్న భారత విద్యార్థులు స్వదేశానికి తిరిగొస్తున్నారు. ఢిల్లీ, గుజరాత్‌లకు చెందిన విద్యార్థులు మంగళవారం రాత్రి ఢిల్లీ విమానాశ్రయంలో దిగారు. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ నుంచి టర్కీకి, అక్కడి నుంచి కతార్‌ మీదుగా ఢిల్లీకి వచ్చారు. తామున్న చోట్ల ఉద్రిక్త పరిస్థితులేమీ లేకున్నా భారత ఎంబసీ సూచన మేరకు తిరిగొచ్చినట్టు చెప్పారు.

అదే ఉద్రిక్తత
కీవ్‌: రష్యా దూకుడు నేపథ్యంలో ఉక్రెయిన్‌లో ఉద్రిక్తత రాజ్యమేలుతోంది. వేర్పాటువాద ప్రాంతాల వద్ద సైన్యానికి, రెబెల్స్‌కు మధ్య కాల్పులు పెరుగుతున్నాయి. దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సైన్యాన్ని అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆదేశించారు. రష్యాతో సహా పలు దేశాలు ఒక్కొక్కటిగా ఉక్రెయిన్‌లోని తమ దౌత్య కార్యాలయాలను మూసేస్తున్నాయి. యుద్ధ భయాల దెబ్బకు పరిశ్రమలతో పాటు వర్తక వాణిజ్యాలు పడకేశాయి. దాంతో కొద్ది వారాల వ్యవధిలో వందల కోట్ల డాలర్లకు పైగా పెట్టుబడులు హరించుకుపోయి ఆర్థికంగా దేశం అల్లాడుతోంది. రష్యా పథకం ప్రకారం ఉక్రెయిన్‌ను ఆర్థికంగా కోలుకోలేనంతగా దెబ్బ తీస్తోందని విశ్లేషకులంటున్నారు. ప్రపంచ గోధుమ సరఫరాల్లో 12 శాతం, మొక్కజొన్నలో 16 శాతం వాటా ఉక్రెయిన్‌దే. వాటి ఎగుమతులపై దెబ్బ పడేలా కన్పిస్తోంది. పారిశ్రామికవేత్తలు, సంపన్నులు  దేశం వీడుతున్నారు. జనం తమ బ్యాంకు ఖాతాలన్నింటినీ ఉన్నపళంగా ఖాళీ చేసుకుంటున్నారు. జనవరిలో 1,250 కోట్ల డాలర్లు విత్‌డ్రా అయ్యాయని అధ్యక్షుడు జెలెన్‌స్కీ వాపోయారు.

రష్యాపై దేశాల ఆంక్షలు
► అమెరికా
వీఈబీ, సైనిక బ్యాంకు, వాటి 42 సబ్సిడరీలపై నిషేధం. ఐదుగురు రష్యా కుబేరుల ఖాతాల స్తంభన. డోన్బాస్‌ రీజియన్‌తో అమెరికావాసులెవరూ వర్తక లావాదేవీలు చేయొద్దని ఆదేశాలు.
► జర్మనీ
రష్యా నుంచి నార్డ్‌ స్ట్రీమ్‌ 2 పైప్‌లైన్‌కు అనుమతుల నిలిపివేత
► ఇంగ్లండ్‌
ఐదు రష్యా బ్యాంకులపై నిషేధం. ముగ్గురు ఆ దేశ సంపన్నుల ఖాతాల స్తంభన.
► యూరోపియన్‌ యూనియన్‌
రష్యా పార్లమెంటు దిగువ సభ డ్యూమాలోని 351 మంది సభ్యుల ఆస్తుల స్తంభన, వీసాలపై నిషేధం.
► ఆస్ట్రేలియా
రష్యా సెక్యూరిటీ కౌన్సిల్లోని 8 మందిపై, సైనిక సంబంధాలున్న రష్యా బ్యాంకులపై నిషేధం
► జపాన్‌
రష్యా ప్రభుత్వ బాండ్ల జారీ, వర్తకంపై నిషేధం
► కెనడా
రష్యా బ్యాంకులపై, సావరిన్‌ రుణ లావాదేవీల్లో కెనడావాసులు పాల్గొనడంపై నిషేధం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement