గ్రీన్ కార్డు కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న భారతీయుల నిరీక్షణకు తెరపడేదెన్నడు? కంట్రీ కోటా పరిమితి 7 శాతాన్ని ఎత్తేస్తే భారతీయులకి ఏ మేరకు ప్రయోజనం కలుగుతుంది? కరోనా మహమ్మారి నేపథ్యంలో గత ఏడాదిగా అమెరికా రాకపోకలపై ఆంక్షలతో గ్రీన్ కార్డులు మంజూరు కాకపోవడం మన దేశానికి కలిసి వస్తుందా? ఇప్పుడు సర్వత్రా ఇదే చర్చ జరుగుతోంది.
అమెరికాలో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవడం కోసం ఉద్దేశించిన గ్రీన్‌కార్డు మంజూరులో పెద్ద దేశం, చిన్నదేశం అన్న తేడా లేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో 20వ శతాబ్దం మధ్యలో దేశాలకు పరిమితి విధించారు. ప్రతీ ఏడాది జారీ చేసే గ్రీన్‌కార్డుల్లో ఏ ఒక్క దేశానికీ ఏడు శాతానికి మించి జారీచేయకూడదని పరిమితి విధించారు. ఇప్పుడవే భారతీయ టెక్కీలకు శాపంగా మారాయి. అగ్రరాజ్యంలో పర్మనెంట్ రెసిడెంట్ హోదా పొందాలంటే జీవిత కాలం వేచి చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధికారంలోకి వచ్చాక దేశాల పరిమితిని ఎత్తేయడం కోసం రెండు బిల్లుల్ని ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టడంతో భారతీయుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఆ రెండు బిల్లుల్లో ఏది ఆమోదం పొందినా భారతీయ టెక్కీలకు భారీ ఊరట లభిస్తుంది. భారత్ నుంచి అత్యంత నైపుణ్యం కలిగిన టెక్కీలు పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నా... గ్రీన్ కార్డు కోసం ఏళ్ల తరబడి వేచి చూడాల్సి వస్తోంది.
చిన్న దేశాల నుంచి తక్కువ సంఖ్యలో వెళ్లేవారికి వెనువెంటనే గ్రీన్ కార్డు రావడం అమెరికా ఆర్థిక వ్యవస్థకే నష్టం వాటిల్లుతుందన్న అభిప్రాయాలు నెలకొన్నాయి. ఏ దేశం నుంచి వచ్చారు అన్నది కాకుండా అమెరికాకు ఎంతవరకు వారి సేవలు ఉపయోగపడతాయి అన్నదే ఆధారంగా గ్రీన్ కార్డులు మంజూరు చేయాలని డెమొక్రాటిక్ ప్రజాప్రతినిధి లోప్‌గ్రెన్ అభిప్రాయపడ్డారు. నైపుణ్యం కలిగిన వారే దేశంలో స్థిరపడితే అమెరికా ఆర్థిక వ్యవస్థకు అండదండగా ఉంటారని, అందుకే కాలం చెల్లిన కంట్రీ క్యాప్‌ను తొలగించాలన్న డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. అదే జరిగితే భారత్, చైనా దేశాలకే అత్యధికంగా గ్రీన్ కార్డులు మంజూరు అవుతాయి.
ప్రతినిధుల సభలో బిల్లులు
► ఈక్వల్ యాక్సెస్ టు గ్రీన్‌కార్డ్స్ ఫర్ లీగల్ ఎంప్లాయిమెంట్ (ఈగల్) చట్టం–2021ని ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డుల మంజూరులో 7 శాతంగా ఉన్న కంట్రీ క్యాప్‌ను ఎత్తేయడం, కుటుంబ వీసాల పరిమితిని ఏడు నుంచి 15 శాతానికి పెంచడం ఉన్నాయి. దీని ప్రకారం ఉద్యోగంలో అత్యంత ప్రతిభను చూపిస్తూ, అధిక జీతం తీసుకుంటున్న వారికి తొలుత గ్రీన్ కార్డులు మంజూరు చేస్తారు. ఇది ప్రతినిధుల సభ ఆమోదం పొంది, సెనేట్‌లో పాసైతే... బైడెన్ సంతకంతో చట్టం అవుతుంది.
► అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎన్నికల సమయంలో అక్రమ వలసదారులకు పౌరసత్వం కల్పిస్తానన్న హామీని నెరవేర్చుకోవడానికి అమెరికా పౌరసత్వ చట్టం 2021ను ఇప్పటికే ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. ఇందు లో కూడా గ్రీన్‌కార్డులకు సంబంధించి కంట్రీ కోటాను ఎత్తేయాలని ఉంది. ఈ బిల్లు ప్రకారం ఎవరు ముందు దరఖాస్తు చేసుకుంటే వారికే ముందు గ్రీన్ కార్డు మంజూరు చేయాలి. గ్రీన్‌కార్డు మంజూరైన తర్వాత అయిదేళ్లకి అమెరికా పౌరసత్వానికి దరఖాస్తు చేసుకోవచ్చునన్న ప్రస్తుత నిబంధనల్ని మూడేళ్లకి తగ్గించారు.
అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్), 2020 గణాంకాల ప్రకారం
పెండింగ్‌లో ఉన్న గ్రీన్ కార్డు దరఖాస్తులు – 12 లక్షలు పైగా
పెండింగ్‌లో ఉన్న భారతీయుల దరఖాస్తులు – 8 లక్షలు (66%)
ప్రతీ ఏడాది జారీ చేసే గ్రీన్ కార్డులు – 3,66,000
(ఇందులో రెండు కేటగిరీలు ఉంటాయి)
కుటుంబాలకు ఇచ్చే గ్రీన్ కార్డులు – 2,26,000
ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డులు – 1,40,000
ఈ గ్రీన్‌కార్డుల్లో భారతీయులు ఎక్కువగా దరఖాస్తు చేసుకునే ఈబీ–2, ఈబీ–3 కేటగిరీ కింద ఏడాదికి 40,040 గ్రీన్ కార్డుల జారీ కంట్రీ కోటా కారణంగా నష్టపోతున్న దేశాలు: భారత్, చైనా, మెక్సికో, ఫిలిప్పీన్స్
– నేషనల్ డెస్క్, సాక్షి
Comments
Please login to add a commentAdd a comment