
బీజింగ్: చైనాలోని బంగారు గనిలో చిక్కుకున్న వర్కర్లను వెలికితీసేందుకు మరో 15 రోజులు పట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే వీరు ఇందులో చిక్కుకుపోయి 11 రోజులవుతోంది. తూర్పు చైనాలోని బంగారు గనిలో జరిగిన పేలుడుతో గని ముఖద్వారంపై వెయ్యి అడుగుల లోతున 70 టన్నుల మన్ను పేరుకుపోయింది. దీంతో ఈ మట్టిని తవ్వుకుంటూ పోతే తప్ప గనిలో వారిని బయటకు తీసే అవకాశం లేదు. ఇప్పటికే పేలుడు సమయంలో గాయాలతో ఒక వర్కర్ మరణించినట్లు మీడియా వర్గాలు తెలిపాయి. గనిలో ఇంకా 21 మంది ఉన్నారు. వీరిలో 11 మందితో సంబంధాలు పునరుద్ధరించి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఇంకో పదిమంది ఆచూకి తెలియరాలేదు. ఆ 11మందికి ఇతర మార్గాల ద్వారా ఆహారం, మెడిసిన్స్ అందిస్తున్నామని, మరోవైపు తవ్వకం చురుగ్గా సాగుతోందని ప్రభుత్వం తెలిపింది. గనిలో పేలుడుకు కారణాలు బహిర్గతం కాలేదు. చైనాలో మైనింగ్ పరిశ్రమలో ఏటా దాదాపు 5వేల మంది మరణిస్తుంటారు.
Comments
Please login to add a commentAdd a comment