బీజింగ్: ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన చైనాలో జనాభా పెరుగుదల అతితక్కువ స్థాయిలో నమోదైంది. తాజా గణాంకాల ప్రకారం చైనా జనాభా 141.17 కోట్లకు చేరుకుంది. వచ్చే ఏడాది నుంచి తగ్గుదల నమోదయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం తెలిపింది. పర్యవసానంగా సిబ్బంది కొరత, వినియోగ స్థాయిలు తగ్గడం వంటివి వాటిని ఆర్థిక వ్యవస్థ ఎదుర్కోవాల్సి ఉంటుందని చైనా ఆందోళన చెందుతోంది. చైనా ప్రభుత్వం మంగళవారం ఏడో జాతీయ జనగణన వివరాలను వెల్లడించింది. మకావో, హాంకాంగ్ మినహా దేశంలోని 31 ప్రావిన్సులు, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ప్రాంతాలు, మున్సిపాలిటీల్లో కలిపి 5.38% శాతం పెరుగుదల రేటుతో 7.206 కోట్ల మేర పెరిగి మొత్తం జనాభా 141.17 కోట్లకు చేరుకుంది. చైనా జనాభా గత దశాబ్ద కాలంగా తక్కువ పెరుగుదల నమోదు చేసుకుంటోందని నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్(ఎన్‌బీఎస్) చీఫ్ నింగ్ జిఝే అన్నారు. అదేవిధంగా, దేశ జనాభాలో 60 ఏళ్లు పైబడిన వారు గత ఏడాదితో పోలిస్తే 18.7% పెరిగి 26.4 కోట్లకు చేరుకున్నట్లు తెలిపారు.
జనాభాలో పనిచేయగలిగే సామర్థ్యమున్న 16–59 ఏళ్ల మధ్య వారు 88 కోట్ల మంది కాగా జనాభా సగటు వయస్సు 38.8 ఏళ్లు. ఏడాదికి సరాసరిన 0.53% చొప్పున జనాభా పెరుగుదల నమోదవుతోందని చెప్పారు. సమతుల జనాభా అభివృద్ధిని సాధించడానికి దీర్ఘకాలంలో తాము ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుందని తాజా వివరాల ద్వారా వెల్లడవుతోందని ఆయన విశ్లేషించారు. చైనాలో 1982లో అత్యధిక జనాభా పెరుగుదల రేటు 2.1% నమోదు కాగా, అప్పటి నుంచి తగ్గుతూ వస్తోంది. జనాభా పెరుగుదలను నియంత్రించేందుకు కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం దీర్ఘకాలం పాటు ఒకే సంతానం విధానాన్ని అమలు చేసింది. ఫలితంగా జనాభా పెరుగుదల రేటు క్రమేపీ తగ్గుతూ వస్తోంది. 2016లో ఒకే సంతానం విధానానికి కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం స్వస్తి చెప్పింది. భారత్‌లో 2019లో 136 కోట్లున్న జనాభా 2027 నాటికి చైనాను దాటే అవకాశం ఉందని ఐరాస విడుదల చేసిన అంచనాల్లో పేర్కొంది. చదవండి: ('సెకండ్ వేవ్ ప్రభావం అప్పటి వరకు కొనసాగుతుంది')
Comments
Please login to add a commentAdd a comment