వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పీఠం కైవసం చేసుకునే దిశగా డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ దూసుకుపోతున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంతగానో ఆశలు పెట్టుకున్న జార్జియా, నెవెడాలోనూ ఆధిపత్యం కొనసాగిస్తున్నారు. దీంతో మరోసారి అమెరికా పగ్గాలు చేపట్టాలనుకున్న ట్రంప్ ఆశలకు గండిపడినట్లే కనిపిస్తోంది. ఇక ఇప్పటికే ఓటమి భయంతో అనాలోచిత వ్యాఖ్యలు చేస్తున్న ఆయన, కౌంటింగ్‌లో అక్రమాలు జరిగాయంటూ డెమొక్రాట్లపై ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గడువు ముగిసిన తర్వాత వచ్చిన మెయిల్ ఇన్ ఓట్లను లెక్కించవద్దని, ట్రంప్ అనుకూల వర్గం కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, అక్కడ కూడా చేదు ఫలితమే ఎదురైంది. ఈ నేపథ్యంలో రిపబ్లికన్ పార్టీ అభిమానులు, ట్రంప్ మద్దతుదారులు తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయారు. ట్రంప్ ఒంటరిగా పోరాడుతున్నారని, మిగిలిన రిపబ్లికన్లు ఎందుకు మాట్లాడటం లేదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
ట్వీట్ల మోత
ఈ క్రమంలో ట్రంప్ తనయుడు ట్రంప్ జూనియర్ ట్విటర్ వేదికగా స్పందిస్తూ. ‘‘ప్రతి ఒక్కరు గమనించాల్సిన అంశం ఇది! ఎవరు గట్టిగా పోరాడుతున్నారు.. ఎవరు పక్కన కూర్చుని చోద్యం చూస్తున్నారు? దశాబ్దాల కాలంగా రిపబ్లికన్లు వీక్‌గానే ఉన్నారు. వామపక్షం ఇలాంటి పనులు చేసేందుకు వారు అనుమతినిచ్చారు. ఇప్పటికైనా ఆ ట్రెండ్‌కు స్వస్తి పలకండి’’అంటూ విరుచుకుపడ్డారు. ఇందుకు స్పందనగా.. ‘‘గొప్పలు చెప్పుకొనే సోకాల్డ్ కురువృద్ధ పార్టీ(జీఓపీ- రిపబ్లికన్ పార్టీ) భవిత్యం ఏమిటి? నిక్కీ హేలీ ఏం చేస్తున్నారు’’అంటూ ఓ నెటిజన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇందుకు బదులుగా.. ‘‘2024 జీఓపీ ఆశావహుల వైఫల్యం స్పష్టంగా కనబడుతోంది. పోరాటం చేయడానికి, తామేంటో నిరూపించుకోవడానికి వారికి సరైన వేదిక ఉంది. కానీ వాళ్లు మీడియా మూకదాడికి భయపడుతూ వెనక్కి తగ్గుతున్నారు. అయినా మరేం పర్లేదు... డొనాల్డ్ ఒంటరిగానే పోరాడతారు, ఎప్పటిలాగానే వాళ్లు ఊరికే చూస్తూ కూర్చుంటారు’’అంటూ ట్రంప్ జూనియర్, తన తండ్రి ట్రంప్ ఎన్నికల ప్రచారంలో స్టార్ క్యాంపెయినర్‌గా పనిచేసిన నిక్కీ హేలిని ఉద్దేశించి నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. (చదవండి: పాపం ట్రంప్.. కోర్టులో కూడా ఓటమే)
కాగా ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారిగా పనిచేసిన భారత సంతతి మహిళ నిక్కీ హేలీ, 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిత్వ బరిలో నిలవనున్నారనే ఊహాగానాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. ట్రంప్ పాలనా యంత్రాంగంలో కేబినెట్ ర్యాంక్ దక్కించుకున్న తొలి ఇండో- అమెరికన్‌గా గుర్తింపు దక్కించుకున్న ఆమె, ట్రంప్ తరఫున సుడిగాలి ప్రచారం నిర్వహించారు. ఇక కౌంటింగ్‌లో అక్రమాలపై ట్రంప్ ఆరోపణల నేపథ్యంలో.. ‘‘ కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా సాగాలి. ఇందుకు ప్రెసిడెంట్ ట్రంప్, అమెరికా ప్రజలు అన్ని విధాల అర్హులు. చట్టాన్ని గౌరవించాలి. అంతిమంగా న్యాయమే గెలుస్తుందని మాకు పూర్తి విశ్వాసం ఉంది’’అంటూ ఆమె ట్వీట్ చేశారు.
The total lack of action from virtually all of the “2024 GOP hopefuls” is pretty amazing.
— Donald Trump Jr. (@DonaldJTrumpJr) November 5, 2020
They have a perfect platform to show that they’re willing & able to fight but they will cower to the media mob instead.
Don’t worry @realDonaldTrump will fight & they can watch as usual!
Comments
Please login to add a commentAdd a comment