ట్విటర్ సీఈవోగా పరాగ్ అగర్వాల్ తొలగింపు దాదాపు ఖాయమైంది!. ట్విటర్ కొత్త బాస్ ఎలన్ మస్క్ ఇందుకు సంబంధించిన స్పష్టమైన సంకేతాలు పంపించారు. ఈ మేరకు యూకేకు చెందిన న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ ఓ కథనం ప్రచురించింది.
దాదాపు 44 బిలియన్ డాలర్లకు ట్విటర్‌ను ఎలన్ మస్క్ చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. అటుపై ఉద్యోగులతో జరిగిన ఇంటెరాక్షన్‌లో ట్విటర్ భవితవ్యంపై ట్విటర్ సీఈవో పరాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటికిప్పుడు ఉద్యోగులకు వచ్చిన ముప్పేమీ లేదన్న పరాగ్.. సోషల్ మీడియా దిగ్గజం మాత్రం అనిశ్చితిలోకి అడుగుపెట్టిందని మాత్రం సంచలన కామెంట్లు చేశాడు. దీంతో పరాగ్ ఉంటాడా? ఉద్వాసనకు గురవుతాడా? అనే దానిపై విపరీతమైన చర్చ జరిగింది. అయితే తన గురించి బెంగ పడొద్దని, కంపెనీ మెరుగ్గా పని చేస్తే చాలంటూ కొందరి ట్వీట్లకు నేరుగా బదులిచ్చాడు పరాగ్. అయితే..
ట్విటర్ మేనేజ్‌మెంట్‌పై తనకు ఎలాంటి విశ్వాసం లేదంటూ ఇంతకు ముందు నేరుగా ట్విటర్ చైర్మన్ బ్రెట్‌టేలర్ వద్దే ఎలన్ మస్క్ ప్రస్తావించాడు. తాజాగా మరో ఇంటర్వ్యూలో మార్పు తప్పదనే సంకేతాలను స్పష్టంగా పంపించాడు. బోర్డు సభ్యులతో పాటు షేర్ హోల్డర్స్‌కు దక్కుతున్న ప్రతిఫలాలపై భారీ కోత విధించేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ ఎలన్ మస్క్ తేల్చేశాడు. ఇక ట్విటర్‌లో కీలక పదవులతో మార్పులుంటాయని చెప్పిన ఆయన.. ఆ మార్పు ఎలా ఉండబోతోంది? అయితే కొత్త సీఈవోగా బాధ్యతలు చేపట్టేది ఎవరు? లాంటి ప్రశ్నలపై మాత్రం ఆయన దాటవేత ధోరణి ప్రదర్శించినట్లు రాయిటర్స్ పేర్కొంది.
ఇదిలా ఉండగా.. కిందటి ఏడాది నవంబర్‌లోనే పరాగ్ అగర్వాల్.. ట్విటర్ సీఈవోగా బాధ్యతలు చేపట్టాడు. పరాగ్ తొలగింపు దాదాపు ఖాయమైన తరుణంలో.. ఆయనకు ఒప్పందం ప్రకారం 42 మిలియన్ డాలర్ల చెల్లించాల్సి వస్తుంది ట్విటర్. ఎలన్ మస్క్ అధికారికంగా ట్విటర్ చేజిక్కించుకున్న ప్రకటన తర్వాత.. ఉద్యోగులతో పరాగ్ అగర్వాల్ అంతర్గత సమావేశం జరపడం పట్ల బోర్డు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఇక పూర్తిస్థాయిలో ట్విటర్ ఎలన్ మస్క్ చేతికి వెళ్లడానికి ఇంకా ఆరునెలల టైం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment