ఇజ్రాయెల్, పాలస్తీనా వివాదం ఇప్పటిది కాదు. దీనికి వందేళ్ల చరిత్ర ఉంది. మొదటి ప్రపంచ యుద్ధం సమయం నుంచి ఇదొక రావణకాష్టంలా రగులుతూనే ఉంది. మొదటి ప్రపంచ యుద్ధంలో పాలస్తీనా ప్రాంతాన్ని పరిపాలిస్తున్న ఒట్టోవా సామ్రాజ్యం ఓటమి పాలైంది. బ్రిటన్ ఆ ప్రాంతాన్ని తన నియంత్రణలోకి తెచ్చుకుంది. ఆ ప్రాంతంలో యూదులు తక్కువ సంఖ్యలోనూ, అరబ్బులు ఎక్కువ సంఖ్యలో ఉండేవారు. పాలస్తీనా ప్రాంతంలో యూదుల రాజ్యాన్ని ఏర్పాటు చేసే బాధ్యత ప్రపంచ దేశాలు బ్రిటన్‌కు అప్పగించడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు మొదలయ్యాయి.
పాలస్తీనా తమ పూరీ్వకులకు చెందిన ప్రాంతమని తమకే హక్కు ఉందని యూదులు వాదిస్తే, అరబ్బులు అదే తమ మాతృభూమి అని దానిని వదల్లేమని కరాఖండీగా చెబుతూ వచ్చారు. 1920–40 సంవత్సరాల మధ్య పాలస్తీనాలో యూదుల శరణార్థుల సంఖ్య భారీగా పెరిగింది. ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధం కాలంలో యూరప్‌లో యూదులపై ఊచకోతతో ఎందరో పాలస్తీనాకు పారిపోయి వచ్చి తలదాచుకున్నారు. పాలస్తీనా ప్రాంతంలో యూదులు సంఖ్య పెరిగిన కొద్దీ ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరగడం ఆరంభమైంది. అదే సమయంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం ఎక్కువైంది.
ఐక్యరాజ్యసమితి ప్రతిపాదనలు
యూదులు, అరబ్బుల మధ్య సమస్య పరిష్కారానికి ఐక్యరాజ్య సమితి ఒక ప్రతిపాదన చేసింది. పాలస్తీనాను రెండుగా విభజించి యూదులకు, అరబ్బులకు పంచి ఇచ్చి జెరూసలేంను అంతర్జాతీయ నగరంగా ప్రకటించాలని ప్రతిపాదించింది. దీనికి యూదులు అంగీకరించినప్పటికీ, అరబ్బులు వ్యతిరేకించారు. దీంతో ఆనాటి ఐక్యరాజ్యసమితి ప్రతిపాదనలు అమల్లోకి రాలేదు.
ఇజ్రాయెల్ ఆవిర్భావంతో యుద్ధవాతావరణం
ఇరువర్గాల మధ్య రాజీ కుదర్చలేని తెల్లదొరలు 1948లో ఆ ప్రాంతాన్ని వీడి వెళ్లిపోయారు. దీంతో యూదులు ఇజ్రాయెల్ ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటించారు. దీనిని పాలస్తీనియన్లు తీవ్రంగా వ్యతిరేకంచడంతో యుద్ధం వచ్చింది. చుట్టుపక్కల ఉన్న అరబ్బు దేశాలు కూడా సైనిక చర్యలకు దిగాయి. ఫలితంగా లక్షలాది మంది పాలస్తీనీయులు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని పారిపోయారు. అప్పట్నుంచి ఇరు ప్రాంతాల మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతూనే ఉంది.
హమాస్ ఏర్పాటుతో సంక్షోభం
1987లో ఇస్లామిక్ రెసిస్టెన్స్ మూవ్‌మెంట్ హమాస్ సంస్థ ఆవిర్భావం తర్వాత సంక్షోభం మరింత ముదిరింది. పాలస్తీనాకు చెందిన మతాధికారి షేక్ అహ్మద్ యాసిన్ స్థాపించిన హమాస్ తొలుత రాజకీయ పార్టీగా ఉంది. ఆ తర్వాత ఇజ్రాయెల్‌పై దాడులే లక్ష్యంగా ముందుకు సాగింది. దీంతో చాలా దేశాలు దీనిని ఒక ఉగ్రవాద సంస్థగా ముద్ర వేశాయి. 2000 సంవత్సరంలో అమెరికాకు అధ్యక్షుడిగా ఉన్న బిల్ క్లింటన్ ఇరు ప్రాంతాల మధ్య ఉద్రిక్తతల నివారణకు క్యాంప్ డేవిడ్ శిఖరాగ్ర సదస్సును ఏర్పాటు చేసినా ఫలితం లేకుండా పోయింది.
2006లో పాలస్తీనాలో జరిగిన ఎన్నికల్లో హమాస్ అత్యధిక స్థానాలు దక్కించుకోవడంతో ఇజ్రాయెల్, అమెరికా పాలస్తీనియన్లకు ఆర్థిక సాయాన్ని నిలిపివేశాయి. ప్రస్తుతం గాజా సిటీ హమాస్ ఆ«దీనంలో ఉంది. వెస్ట్‌బ్యాంక్ ప్రాంతం ఇజ్రాయెల్ అ«దీనంలో ఉండడంతో తరచూ ఉద్రిక్తతలు రాజుకుంటూనే ఉన్నాయి. డొనాల్డ్ ట్రంప్ హయాంలో మరోసారి ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య శాంతి స్థాపనకు ప్రయత్నాలు జరిగినా అవి ఫలవంతంకాలేదు. దీంతో సమస్య అలాగే ఉండిపోయింది.
కొలిక్కి రాని సమస్యలివే..!
ఇజ్రాయెల్ జెరూసలేం మొత్తాన్ని తన రాజధానిగా ప్రకటించుకుంటే, పాలస్తీనియన్లు తూర్పు జెరూసలేంను తమ భవిష్యత్ రాజధానిగా ప్రకటించుకున్నారు.
► 2005లో గాజా నుంచి ఇజ్రాయెల్ సేనలు వైదొలగినప్పటికీ ఐక్యరాజ్యసమితి ఇప్పటికీ ఆ ప్రాంతాన్ని ఆక్రమిత భూభాగంగానే చూస్తోంది.
► వెస్ట్‌బ్యాంక్ ప్రాంతం ఇప్పటికి ఇంకా ఇజ్రాయెల్ ఆ«దీనంలో ఉంది.
► ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య ఉద్రిక్తతలకు కేంద్రంగా తూర్పు జెరూసలేం, గాజా, వెస్ట్ బ్యాంక్ మారాయి.
► వెస్ట్‌బ్యాంక్‌లో ఇజ్రాయెల్ అంతర్జాతీయ నిబంధనల్ని తోసిరాజని ఎన్నో అక్రమ కట్టడాలను నిర్మించింది. వాటిని తొలగించే అంశంలో వివాదం నెలకొంది.
► పాలస్తీనా శరణార్థుల భవిష్యత్‌పై ఆందోళనలతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి.
–సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment