సియోల్: పేదవారిని, ధనికులును తయారు చేసేది సమాజంలోని పరిస్థితులు. నిజాయతీగా కష్టపడేతత్వం, అవకాశాలను అందిపుచ్చుకునే నైజం ఉన్న వారు జీవితంలో గొప్ప స్థాయికి చేరుకుంటారు. కోటీశ్వరులవుతారు. అయితే తాము వచ్చిన దారిని వారు మర్చిపోరు. ఆ బాటలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం తాము సంపాదించిన మొత్తాన్ని ఖర్చు చేయడానికి కూడా వెనకాడని వారు ఉంటారు. ఎందుకంటే వారి దృష్టిలో ఆ సంపద ఈ సమాజానికి చెందినదే తప్ప వారి వారసులది కాదు. అయితే ఇలాంటి మనసున్న మారాజులు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. మన దేశంలో టాటా గ్రూప్, అజీం ప్రేమ్ జీ వంటి వారు ఈ వరుసలో ముందుంటారు. ఇక తాజాగా ఈ కోవలోకి మరో బిలియనీర్ చేరారు. తన సంపదలో సగానికి పైగా అంటూ సుమారు 4 లక్షల కోట్ల రూపాయలు సమాజానికి తిరిగిచ్చేస్తానని ప్రకటించారు. ఇంతకు ఆ వ్యక్తి.. ఎవరు.. ఏంటి తదితర వివరాలు తెలియాలంటే ఇది చదవాల్సిందే.
దక్షిణ కొరియాలో అతిపెద్ద మొబైల్ మెసెంజర్ కకావోటాక్. దీని వ్యవస్థాపకుడు కిమ్ బీమ్ సు. ఆయన సంపద 9.4 బిలియన్ డాలర్లు(6,85,55,61,00,000 రూపాయలు). ఈ మొత్తంలో నుంచి సగానికి పైగా అంటే దాదాపు 4 లక్షల కోట్ల రూపాయలు సమాజానికి ఇస్తానని ఆయన సోమవారం హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కిమ్ బీమ్ సు.. ‘‘నా సందలో సగానికి కంటే ఎక్కువగా సామాజిక సమస్యల పరిష్కారం కోసం వెచ్చిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను’’అంటూ తన కంపెనీ కకావోటాక్ ఉద్యోగులకు మెసేజ్ చేశారు.
కిమ్ బీమ్ సు 2010లో కకావోకో మెసేంజర్‌ని ప్రారంభించారు. అనేక విశేషాలున్న ఈ యాప్‌కు దక్షిణ కొరియాలో ఎంత క్రేజ్ అంటే దేశవ్యాప్తంగా దాదాపు 90 శాతం మొబైల్ ఫోన్లలో దీన్ని ఇన్‌స్టాల్ చేసుకున్నారు. మెసేంజర్, ఆన్‌లైన్ గేమ్స్, ఈ కామర్స్‌కు ఉపయోగపడే ఈ యాప్ వాడకం కరోనా కాలంలో ఇంకా ఎక్కువగా పెరిగింది. దాంతో లాభాలు కూడా ఆకాశాన్ని అంటాయి. ఫోర్బ్స్ ప్రకారం కరోనా వైరస్ కాలంలో కిమ్ దేశంలోనే అత్యధికంగా సంపాదించిన వ్యక్తిగా నిలిచారు.
ప్రపంచ మిలియనీర్లు బిల్ అండ్ మిలిండా గేట్స్, అలాగే వారెన్ బఫెట్‌ల చొరవతో ‘గివింగ్ ప్లెడ్జ్’ని ఏర్పాటు చేశారు. దీని ప్రకారం ఇష్టం ఉన్న బిలియనీర్లు తమ సంపదలో సగానికి పైగా విరాళం ఇవ్వడానికి ముందుకు రావాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు దాదాపు 200 మంది సంపన్నులు ఈ ప్రతిజ్ఞపై సంతకం చేసినట్లు గివింగ్ ప్లెడ్జ్ వెబ్‌సైట్ తెలిపింది. అయితే తూర్పు ఆసియాకు చెందిన వారు చాలా కొద్ది మంది మాత్రమే దీనిలో చేరారు. చైనా, హాంకాంగ్, తైవాన్ నుంచి చాలా కొంతమంది దాతలు మాత్రమే ఈ జాబితాలో చేరగా.. జపాన్, దక్షిణ కొరియా నుంచి ఇంత వరకు ఎవరూ లేరు. కిమ్ బీమ్ సు ప్రకటనతో ఈ జాబితాలో చేరిన తొలి దక్షిణా కొరియా దేశస్తుడిగా నిలిచారు. తన ప్రతిజ్ఞను తప్పక నేరవేరుస్తానని, తన విరాళం వివరాలపై చర్చలు ప్రారంభ దశలో ఉన్నాయని కిమ్ తెలిపారు.
మూడవ త్రైమాసికంలో కకావో 120 బిలియన్ డాలర్ల లాభాలు చవి చూసింది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 103 శాతం పెరగడమే కాక 2020 సంవత్సరానికి రికార్డు స్థాయిలో వార్షిక లాభాలను నమోదు చేసినట్లు కంపెనీ వెల్లడించింది.
చదవండి: విషాదాన్ని మిగిల్చిన కొరియన్ దేవకన్య
ఫోర్బ్స్ జాబితాలో తెలంగాణ ‘కీర్తి’
కోవిడ్-19 వెంటాడినా తరగని కుబేరుల సంపద
Comments
Please login to add a commentAdd a comment