HAITI: హైతీ ప్రధాని రాజీనామా | Haitis Prime Minister Henry Resigned | Sakshi
Sakshi News home page

దేశంలో తిరుగుబాటు.. హైతీ ప్రధాని రాజీనామా

Published Tue, Mar 12 2024 11:26 AM | Last Updated on Tue, Mar 12 2024 1:10 PM

Haitis Prime Minister Henry Resigned - Sakshi

పోర్ట్‌ ఆవ్‌ ప్రిన్స్‌: హైతీ ప్రధాని ఏరియెల్‌ హెన్రీ తన పదవికి రాజీనామా చేశారు. హెన్రీ రాజీనామాను ఆమోదించినట్లు చైర్‌ ఆఫ్‌ ద కరేబియన్‌ కమ్యూనిటీ ఇర్ఫాన్‌ అలీ ప్రకటించారు. హెన్రీ హైతీకి చేసిన సేవలకుగాను ఈ సందర్భంగా అలీ ధన్యవాదాలు తెలిపారు.

దేశంలో తిరుగుబాటు చేసిన సాయుధ గ్యాంగులతో పోరాటంలో సహకరించాల్సిందిగా ఐక్యరాజ్యసమితి(యూఎన్‌) ఇంటర్నేషనల్‌ సెక్యూరిటీ మిషన్‌ను కోరేందుకు గత నెల హెన్రీ కెన్యా వెళ్లారు. సరిగ్గా ఈ సమయంలో రాజధాని పోర్ట్‌ ఆవ్‌ ప్రిన్స్‌లో ఒక్కసారిగా పెద్ద ఎత్తున హింస చెలరేగింది. దీంతో హెన్రీ దేశం బయటే అమెరికాకు చెందిన పూర్టో రికో ప్రాంతంలో ఉండిపోవాల్సి వచ్చింది.

సాయుధ గ్యాంగులు హెన్రీ దిగిపోవాల్సిందే అని డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో  హైతీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సోమవారం జమైకాలో ప్రాంతీయ నేతల సమావేశం జరిగింది. ఇంతలోనే హెన్రీ తన రాజీనామా సమర్పించారు. 2021లో  అప్పటి దేశాధ్యక్షుడు మొయిస్‌ హత్య తర్వాత హెన్రీ హైతీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.  హైతీలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలు వేగవంతం చేయాలని అమెరికా కూడా ఇప్పటికే కోరింది.

హెన్రీ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయారని, ఎన్నికలు జరగకుండా వాయిదా వేస్తున్నారని దేశంలో ఆయనపై తీవ్ర వ్యతిరేకత పెరిగింది. హైతీలో తొలుత శాంతి భద్రతలు పునరుద్ధరించాలని, స్వేచ్ఛాయుత ఎన్నికలు జరిగేందుకు కావాల్సిన వాతావరణాన్ని కల్పించాలని అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి ఆంటోని బ్లింకెన్‌ కోరారు. 2016 నుంచి హైతీలో ఎన్నికలు జరగలేదు. 

ఇదీ చదవండి.. అమెరికాలో టిక్‌టాక్‌ పాలిటిక్స్‌.. ట్విస్ట్‌ ఇచ్చిన ట్రంప్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement