ఇజ్రాయెల్-గాజా సంక్షోభం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అన్నీ దేశాల దృష్టి ప్రస్తుతం ఈ యుద్ధంపైనే ఉంది. నాలుగు రోజుల కిందట పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ ఇజ్రాయెల్‌పై ఆకస్మిక దాడికి దిగిన విషయం తెలిసిందే. గాజా స్ట్రిప్ ద్వారా దక్షిణ ఇజ్రాయెల్‌లోకి చొరబడ్డ హమాజ్ ఉగ్రవాదులు వేల రాకెట్లతో దాడులకు తెగబడ్డారు. ఇజ్రాయెల్ సైతం హమాస్ ఉగ్రవాదులపై దాడులను మరింత తీవ్రతరం చేసింది. హమాస్ దాడులు, ఇజ్రాయెల్ ప్రతిదాడులతో ఇరు వర్గాలకు చెందిన 1600 మంది ప్రాణాలు కోల్పోయారు.. వేలాది మంది తీవ్రంగా గాయపడ్డారు.
తాజాగా ఇజ్రాయెల్- పాలస్తీనా యుద్ధంపై ఇజ్రాయెల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ మాజీ అధినేత మేజర్ జనరల్ యాడ్లిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. భూ, జల, వాయు మార్గాల ద్వారా చేపట్టిన హమాస్ దాడిని ఊహించలేనిదన్నారు. దాడికి సంబంధించి ఎలాంటి ముందస్తు హెచ్చరిక, సిగ్నల్ అందుకోలేకపోయినట్లు తెలిపారు. ఇది ఆశ్చర్యకరమైన దాడి అని పేర్కొన్నారు. హమాస్ చర్యను సెప్టెంబర్ 11, పెరల్ హార్బర్, యోమ్ కిప్పూర్ యుద్ధంతో పోల్చుతూ.. ఈ సంక్షోభం ముగిసిన వెంటనే దీనిపై దర్యాప్తు చేయాలని పేర్కొన్నారు.
హమాస్ దాడిలో భారీగా ఇజ్రాయెల్ పౌరులు మరణించడానికి ఇంటెలిజెన్స్ వైఫల్యంతోపాటు వ్యూహత్మక వైఫల్యాల కారణమేనని మేజర్ జనరల్ యాడ్లిన్ వ్యాఖ్యానించారు. హమాస్ దాడిని ముందుగానే పసిగట్టడంలో శక్తివంతమైన ఇజ్రాయెల్ నిఘా సంస్థలు విఫలమైనట్లు తెలిపారు. దీనికితోడు ఉగ్రవాదులను చర్యపై వేగంగా స్పందించి ప్రతిదాడులు చేయడంలోనూ ఇజ్రాయెల్ సైన్యం వైఫల్యం కనిపిస్తోందన్నారు.
చదవండి: హమాస్ దాడులపై ఇరాన్ సుప్రీం స్పందన
ఉద్రిక్త పరిస్థితులు ఉండే ఇజ్రాయెల్, గాజా సరిహద్దు కంచె వెంట కెమెరాలు, గ్రౌండ్ మోషన్ సెన్సార్లు, సాధారణ సైన్యం పెట్రోలింగ్ కూడా ఉంటుందని అయితే శత్రువుల రాకను గుర్తించి సైనిక దళాలకు సమాచారం ఇవ్వడంలో ఇవన్నీ విఫలమయ్యాయని విమర్శించారు. ముందస్తు హెచ్చరికలు అందకపోయినా సరిహద్దు వెంబడి ఉన్న సెన్సార్లు కూడా ఈ పనిచేయలేకపోయాయని అన్నారు.
ఇజ్రాయెల్ అంతర్గత నిఘా వ్యవస్థ షిన్ బెట్, గూఢచార సంస్థ మొసాద్, ఇజ్రాయెల్ రక్షణ దళాలు ఈ దాడులను అంచనా వేయలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. ఒకవేళ వాళ్లకి ముందే తెలిసి ఉన్నట్టయితే, ఈ దాడులను తిప్పికొట్టడంలో వారు నిర్లక్ష్యం వహించారని ఆరోపిస్తూ.. వీటన్నింటిపై తప్పక విచారణ చేయాలన్నారు.
కాగా మేజర్ జనరల్ అమోస్ యాడ్లిన్.. ఇజ్రాయెల్ రక్షణ దళాల్లో 40 సంవత్సరాల అనుభవం ఉంది. ఫైటర్ జెట్ పైలట్‌గా 33 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్‌కు డిప్యూటీ కమాండర్‌గా బాధ్యతలు స్వీకరించారు. తరువాత ఐడీఎఫ్ మిలిటరీ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్‌కు పనిచేశారు. 2011 నుంచి ఇజ్రాయెల్ వ్యూహాత్మక విభాగం ఇన్‌స్టిట్యూట్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ స్టడీస్‌కు డైరెక్టర్‌గా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment