గాజాపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో తమ ఆధీనంలో ఉన్న బందీలు మరణించినట్లు హమాస్ ప్రకటించింది. గడచిన 24 గంటల్లో గాజా స్ట్రిప్ ఉత్తర భాగంలో ఈ దాడులు జరగ్గా వేర్వేరు ప్రాంతాల్లోని మొత్తం 13 మంది బందీలు ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. వీరిలో ఇజ్రాయెల్ పౌరులతోపాటు విదేశీయులు కూడా ఉన్నట్లు వెల్లడించింది. హమాస్ గత శనివారం ఇజ్రాయెల్‌పై మెరుపు దాడి చేసి సుమారు 150 మందిని బందీలుగా చేసుకున్న విషయం తెలిసిందే. ఈ బందీల్లో సాధారణ పౌరులు, విదేశాలకు చెందిన వారూ ఉన్నారు.
బందీలను హమాస్ చెర నుంచి తప్పించేందుకు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ సైనికులు కృషి చేస్తూనే హమాస్ బలగాలను మట్టుబెట్టేందుకూ తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా గాజా మొత్తంపై బాంబుల వర్షం కురిపిస్తోంది.
గాజా స్ట్రిప్ జనాభా దాదాపు 24 లక్షలు. ఇజ్రాయెల్ బాంబు, క్షిపణి దాడులు విపరీతమైన ఆస్తినష్టాన్ని మిగులుస్తున్నాయి. భవనాలు నేలమట్టం అవుతున్నాయి. జనజీవనం అస్తవ్యస్తం అవుతోంది. ఇజ్రాయెల్ ఇప్పటివరకూ గాజాపై జరిపిన దాడుల్లో 1500 మంది మృతి చెందారు. అందులో 500 మంది చిన్నారులే ఉన్నట్లు హమాస్ మీడియా కార్యాలయం ప్రకటించింది.
మరోవైపు గాజా పౌరులను లక్ష్యంగా చేసుకుని జరిపే దాడులకు.. ప్రతిగా బందీలను హతమారుస్తామంటూ హమాస్ ప్రకటించినప్పటికీ.. ఇజ్రాయెల్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ క్రమంలో.. నీటి, కరెంట్ సరఫరాను నిలిపివేసింది. తాజాగా గాజాను ఖాళీ చేయాలంటూ హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఐక్యరాజ్య సమితి మాత్రం ఇజ్రాయెల్ రక్షణ దళం ఆదేశాలు ఆచరణ సాధ్యం కాదని.. అది కల్లోలానికి దారి తీస్తుందని చెబుతోంది.
Comments
Please login to add a commentAdd a comment