కరాచీ: పొరుగు దేశం పాకిస్తాన్‌లో వడగాడ్పులు బీభత్సం సృష్టిస్తున్నాయి. దేశంలోని అతిపెద్ద నగరంగా పేరొందిన కరాచీలో వడగాడ్పులకు 450 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య అధికంగా ఉండటంతో మృతదేహాలను భద్రపరిచేందుకు మార్చురీల్లో స్థలం దొరకని పరిస్థితి నెలకొంది.
పాక్‌లోని పలు స్వచ్ఛంద సంస్థలు దేశంలో విలయతాండవం చేస్తున్న ఎండల గురించి, వడగాడ్పుల కారణంగా మృతి చెందినవారి గురించి చెబుతున్నప్పటికీ పాక్ ప్రభుత్వం ఇంకా దీనిపై స్పందించలేదు. పాక్‌లోని ఓడరేవు నగరమైన కరాచీలో మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌ను దాటుతున్నాయి. తాజాగా ఈధి ఫౌండేషన్ కరాచీలో నాలుగు రోజుల్లో 427 మృతదేహాలు లభ్యమయ్యాయని, సింధ్ ప్రభుత్వం మంగళవారం 23 మృతదేహాలను మూడు ప్రభుత్వ ఆసుపత్రులకు పంపిందని తెలియజేసింది.
ఫౌండేషన్ చీఫ్ ఫైసల్ ఈధి మాట్లాడుతూ కరాచీలో నాలుగు మార్చురీలు ఉన్నాయని, మృతదేహాలను ఉంచేందుకు ఈ మార్చురీలలో స్థలం సరిపోవడం లేదని అన్నారు. వీధులలో ఈ మృతదేహాలు లభ్యమయ్యాయని ఈధి తెలిపారు. వడగాడ్పుల కారణంగానే వీరంతా మరణించి ఉంటారన్నారు. మంగళవారం135 మృతదేహాలు, సోమవారం 128 మృతదేహాలు తమకు లభ్యమయ్యాయని అన్నారు. ఈధి ట్రస్ట్ పాకిస్తాన్‌లో పేదలు, నిరాశ్రయులు, అనాథ వీధి పిల్లలు, బాధిత మహిళలకు సేవలను అందిస్తుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment