ఇస్లామాబాద్: అగ్రరాజ్యం అమెరికాపై పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ నిప్పులు చెరిగారు. వ్యూహాత్మక లక్ష్యాలు సాధించుకొనేందుకు పాకిస్తాన్‌ను ఉపయోగించుకోవడం, అవసరం తీరాక పక్కన పెట్టేయడం, పైగా ఆంక్షలు విధించడం అమెరికాకు అలవాటుగా మారిపోయిందని దుయ్యబట్టారు. ‘మిత్ర’ దేశం చైనా తమకు అండగా నిలుస్తోందని హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుత పరీక్షా సమయంలో చైనా తమను ఆదుకుంటోందని అన్నారు. చైనా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫుడాన్ యూనివర్సిటీ సలహా కమిటీ డైరెక్టర్ ఎరిస్ లీకి ఇమ్రాన్ ఖాన్ ఇటీవల ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఈ వివరాలను న్యూస్ ఇంటర్నేషన్ పత్రిక శుక్రవారం బహిర్గతం చేసింది. ఇంటర్వ్యూలో ఓ ప్రశ్నకు ఇమ్రాన్ ఖాన్ బదులిస్తూ.. గతంలో అమెరికాతో పాకిస్తాన్‌కు సన్నిహిత సంబంధాలు ఉండేవని చెప్పారు. ఇప్పుడు పాక్ అవసరం లేదని అమెరికా భావిస్తోందని, అందుకే దూరం పెడుతోందని పేర్కొన్నారు. అవసరం ఉన్నప్పుడల్లా మళ్లీ తమ దేశానికి దగ్గర కావడం అగ్రరాజ్యం విధానమని అన్నారు. అవసరం తీరాక తమవైపు కన్నెత్తి కూడా చూడదని ఆక్షేపించారు. 1980వ దశకంలో పాక్–యూఎస్ సంబంధాలను ఇమ్రాన్ ఖాన్ ప్రస్తావించారు.
అప్పట్లో సోవియన్ యూనియన్ సైనిక దళాలు అఫ్గానిస్తాన్‌లో అడుగుపెట్టాక అమెరికా తమ దేశంతో చేతులు కలిపిందన్నారు. సోవియట్ యూనియన్‌ను అడ్డుకోవడానికి పాకిస్తాన్‌ను వాడుకుందని తెలిపారు. అఫ్గాన్ నుంచి సోవియట్ యూనియన్ సైన్యం వెనక్కి వెళ్లిపోయాక పాక్‌పై అమెరికా ఆంక్షలు విధించిందని మండిపడ్డారు. సెప్టెంబర్ 11(9/11) దాడుల అనంతరం పాక్–అమెరికా మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయని గుర్తుచేశారు. గత ఏడాది చోటుచేసుకున్న అఫ్గానిస్తాన్ పరిణామాల తర్వాత తమ దేశాన్ని ఆమెరికా నిందిస్తోందని తప్పుపట్టారు. చైనా–పాకిస్తాన్ గత 70 ఏళ్లుగా పరస్పరం చక్కగా సహకరించుకుంటున్నాయని ఇమ్రాన్ ఖాన్ ఉద్ఘాటించారు.
Comments
Please login to add a commentAdd a comment