తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్
కాబూల్: భారతదేశానికి తాలిబన్ల నుంచి ఎలాంటి ముప్పు ఉండబోదని తాలిబన్ల అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ సోమవారం స్పష్టం చేశారు. ‘ఇండియా టుడే’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో జబీహుల్లా పలు అంశాలను ప్రస్తావించారు. ‘ఆసియా ప్రాంతంలో భారత్ కీలకమైన దేశం. గత అఫ్గాన్ ప్రభుత్వం, భారత్ మధ్య మంచి సంబంధాలు కొనసాగాయి. తాలిబన్ల నేతృత్వంలో ఏర్పడే నూతన అఫ్గాన్ ప్రభుత్వం సైతం అదే స్థాయిలో సహృద్భావ సంబంధాలను కోరుకుంటోంది’ అని జబీహుల్లా వ్యాఖ్యానించారు.
పాకిస్తాన్‌తో కలసి భారత వ్యతిరేక కార్యకాలాపాలకు తాలిబన్లు పాల్పడబోతున్నారనే వార్తలపై జబీహుల్లా స్పందించారు. అవన్నీ నిరాధార ఆరోపణలని కొట్టిపారేశారు. తాలిబన్లు భారత్‌కు ఎటువంటి హానీ తలపెట్టబోరన్నారు. తాలిబన్లు పాక్‌నూ తమ సొంత దేశంగా భావిస్తారని జబీహుల్లా ఇటీవల పేర్కొన్నారు. ఆ అంశంపై వివరణ ఇచ్చారు. ‘పాక్‌తో అఫ్గాన్‌కు సరిహద్దు బంధముంది. అఫ్గానీయులు తరచూ సరిహద్దు దాటి బంధువులు, వాణిజ్యం కోసం పాక్ ప్రజలతో మమేకమవుతారు. అలాంటి బంధాన్నే మేం కోరుకుంటున్నాం’ అని ఆయన వివరించారు. ‘అన్ని దేశాలతో మంచి దౌత్య సంబంధాలనే మేం ఆశిస్తున్నాం’ అని అన్నారు. ‘అన్ని దేశాలతో మంచి దౌత్య సంబంధాలనే మేం ఆశిస్తున్నాం. ముఖ్య దేశాలన్నీ ఎంబసీలను కొనసాగించాలి’ అని అన్నారు. పంజాబ్ ప్రావిన్స్‌పైనా మాట్లాడారు. ‘ఒక ఉమ్మడి నిర్ణయం కోసం రెండు వైపుల నుంచీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. యుద్ధమే ఏకైక మార్గమని మేం భావించట్లేదు’ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment