న్యూయార్క్: స్నేహితుడికి స్వాగతం పలికేందుకు విమానాశ్రయానికి వచ్చిన భారతీయ అమెరికన్, తెలుగు వ్యక్తి విశ్వచంద్ కోళ్ల (47) అనుకోని ఎయిర్‌పోర్ట్ బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మార్చి 28న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భారత్ నుంచి వస్తున్న విశ్వచంద్ స్నేహితుడైన ఒక సంగీత కళాకారుడు మసాచుసెట్స్ రాష్ట్ర రాజధాని బోస్టన్ సిటీలోని లోగన్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌లో దిగనున్నారు. ఆయన కోసం విశ్వచంద్ లోగన్ ఎయిర్‌పోర్ట్‌కు మార్చి 28 సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఎస్‌యూవీ వాహనంలో చేరుకుని టర్మినల్–బి వద్ద వేచిచూస్తున్నారు.
విమాన ప్రయాణికులు, లగేజీతో అదే సమయంలో అటుగా వచ్చిన డార్డ్‌మౌత్ ట్రాన్‌పోర్టేషన్ బస్సు విశ్వచంద్‌ను పక్క నుంచి గుద్దుకుంటూ వెళ్లింది. దీంతో రెండు వాహనాల మధ్య ఇరుక్కుని నలిగిపోయి అక్కడే పడిపోయారు. ప్రథమ చికిత్స చేసే ప్రయత్నం చేసినా అప్పటికే ప్రాణాలు కోల్పోయారు. విశ్వచంద్‌ది ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా రేపల్లె అని సమాచారం. అమెరికాలో తకేడా ఫార్మాస్యూటికల్స్ కంపెనీలోని గ్లోబల్ అంకాలజీ విభాగంలో డాటా అనలిస్ట్‌గా పని చేస్తున్నారు. ఆయనకు భార్య సౌజన్య, కుమారులు ధృవ, మాధవ్ ఉన్నారు. విశ్వచంద్ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు బంధువులు గోఫండ్‌మీ ద్వారా ఇప్పటికే 4,06,151 డాలర్లు (దాదాపు రూ.3.3 కోట్లు) విరాళంగా సేకరించారు.
Comments
Please login to add a commentAdd a comment