చాలా మంది ఆహ్లాదకరమైన ప్రాంతాలకు వెకేషన్‌కు వెళ్తుంటారు. కొండ ప్రాంతాలు, సముద్రతీరాల్లాంటి మనసుకు ప్రశాంతతనిచ్చే ప్రాంతాలకైతే మరీ మరీ ఇష్టపడి వెళ్తారు. ఇలాంటి వాళ్లను మరింత ఆశ్చర్యపరిచేందుకు ఓ అద్భుతమైన ఫ్లోటింగ్ ప్యాలెస్ రెడీ కాబోతోంది. అది కూడా సముద్రంలో. అలా ఇలా కాదు.. నీటిపై తేలేలా 156 రూములతో నిర్మితమవుతోంది. ప్యాలెస్ ఒక్కటే కాదండోయ్.. దాని చుట్టూ విల్లాలు కూడా సిద్ధం కాబోతున్నాయి. అవి కూడా నీటిపై తేలేవే.
అలా సముద్రాన్ని చుట్టొద్దామనుకుంటే ఆ విల్లాలే ప్యాలెస్ నుంచి విడిపోయి బోట్లలా మారిపోతాయి. అలా తిరిగొచ్చాక షిప్‌లు కదా ‘డాక్’ అయినట్టు ఆ పెద్ద ప్యాలెస్‌కు అతుక్కుపోతాయి. వినడానికి భలేగా ఉన్నా, వెంటనే చూడాలనేలా ఊరిసున్నా ఈ ప్యాలెస్ హోటల్ దుబాయ్‌లో జుమెయ్‌రా బీచ్‌కు దగ్గర్లో నిర్మితమవుతోంది. 2023లో అందుబాటులోకి రానుంది.
16 బోట్లు పార్క్ చేసేలా పార్కింగ్ డెక్
బోట్లు, హెలికాప్టర్ల ద్వారా ప్యాలెస్‌ను చేరుకోవచ్చు. 16 బోట్లు పార్క్ చేసేలా పార్కింగ్ డెక్ ఏర్పాటు చేశారు. తేలాడే హెలిప్యాడ్‌ను కూడా నిర్మించబోతున్నారు. ప్రధాన ప్యాలెస్ 4 భాగాలుగా ఉంటుంది. వాటిని మధ్యలో ఉండే గ్లాస్ పిరమిడ్ కలుపుతుంది. ప్యాలెస్‌లో రెస్టారెంట్, బార్, స్పా, పూల్స్, బొటీక్స్ లాంటి సౌకర్యాలెన్నో ఉన్నాయి. విల్లాల్లో ఉండే వాళ్లు కూడా ఈ సౌకర్యాలు పొందవచ్చు. ప్యాలెస్‌ను, విల్లాలను నీటిపై తేలేలా ఎలా నిర్మిస్తున్నారో వెల్లడించలేదు. ప్యాలెస్ ఓపెనింగ్ తేదీ.. అందులోని రూమ్‌లు, సర్వీసుల ధరలు కూడా చెప్పలేదు.
చదవండి: పాపికొండల సోయగాలు.. నదీ విహారం
విల్లాల్లో ఏమేముంటాయ్?
తేలియాడే ఆ పెద్ద ప్యాలెస్ చుట్టూ 12 విల్లాలను నిర్మించనున్నారు. ఒక్కోటి రెండంతస్తులు ఉంటుంది. 1, 4 బెడ్రూమ్‌ల గదులతో పాటు పైన టెర్రస్.. స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది. ఇంతేకాదు.. విల్లాలను పర్యావరణ అనుకూలంగా నిర్మిస్తున్నారు. వాటిల్లో సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్యాలెస్‌లో గాని, విల్లాలో గాని ఏ ప్రాపర్టీనైనా కొనుక్కోవచ్చు.
చదవండి: విటమిన్ ‘డి’ లోపిస్తే చాలా డేంజర్.. ఈ లక్షణాలుంటే జాగ్రత్త!
– సాక్షి సెంట్రల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment