గాజా.. గజ గజ | Israel Hamas war: Israel Again Deadly Attacks On Gaza Strip | Sakshi
Sakshi News home page

గాజా.. గజ గజ

Published Fri, Dec 8 2023 6:46 PM | Last Updated on Sat, Dec 9 2023 7:36 AM

Israel Hamas war: Israel Again Deadly Attacks On Gaza Strip - Sakshi

గాజాలో మళ్లీ పరిస్థితి మొదటికొచ్చింది. బందీల విడుదల సమయంలో యుద్ధానికి చిన్న బ్రేక్ ఇచ్చారు. దీంతో అక్కడి జనాలు ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత మళ్లీ బాంబుల మోత మొదలవ్వడంతో గాజా గజగజ వణుకుతోంది. గాజా ఒక నెత్తుటి నగరంలా మారిపోయింది. దాడులతో దద్దరిల్లుతోంది. ఆసుపత్రుల్లోనూ హాహాకారాలు వినిపిస్తున్నాయి. ఒక యుద్ధం వేలాది మంది అమాయకులను బలి తీసుకుంటోంది.

ఎక్కడ చూసినా రక్తం ఏరులై పారుతోంది. ఎక్కడ విన్నా బాంబుల మోతలే వినిపిస్తున్నాయి. గాజా నగరం ఒక శ్మశానాన్ని తలపిస్తోంది. ప్రాణాలు కాపాడుకునే దారి లేదు. సరిహద్దులు దాటే అవకాశం లేదు. గాజా నగరం పరిస్థితి.. యుద్ధానికి ముందు.. ఆ తర్వాత అన్నట్లుగా మారింది. అసలు ఈ మారణకాండకు ముగింపు పడేది ఎప్పుడు ? గాజా భవిష్యత్తు ఏంటి ? 

యుద్ధం ఏదైనా.. యుద్ధం ఎక్కడైనా.. యుద్ధం ఏ రెండు దేశాల మధ్యనైనా.. ఎక్కువగా బలైపోయేది అమాయకులే..! యుద్ధానికి కారణం ఏదైనా కావొచ్చు.. ఒకరిది యుద్ధ దాహం కావొచ్చు.. మరొకరిది దేశ రక్షణ కోణం కావొచ్చు.. రీజన్ ఏదైనా.. ఆ యుద్ధంలో ఎక్కువగా బలయ్యేది సామాన్యులే..! ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలోనూ అదే జరుగుతోంది.

ఇజ్రాయెల్‌ దాడులతో గాజా దద్దరిల్లుతోంది. హమాస్‌ జరిపిన మెరుపు దాడికి ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయెల్‌ దండయాత్ర చేస్తోంది. ఈ యుద్ధానికి కారణం ఎవరన్నది పక్కన పెడితే.. ఎక్కువగా బలైపోతున్నది మాత్రం అమాయకులే..! గాజా ప్రజలు పడుతున్న కష్టాల గురించి చెప్పేందుకు మానవీయ సంక్షోభం అనే మాటలు కూడా సరిపోవడం లేదు. అంత దారుణాతి దారుణంగా ఉన్నాయి అక్కడి పరిస్థితులు.

యుద్ధం కారణంగా ప్రజలు చెట్టుకొకరు పుట్టకొకరుగా చెల్లాచెదురు అవుతున్నారు. కళ్ల ముందే భవనాలు పేక మేడల్లా కుప్ప కూలుతున్నాయి. శిథిలాల కింద కుప్పలు తెప్పలుగా శవాలు పడి ఉన్నాయి. మొత్తంగా గాజా ఇక శ్మశాన వాటికను తలపిస్తోంది. పశ్చిమ గట్టు ప్రాంతంలో కూడా పాలస్తీనా పౌరుల మీద దాడులు కొనసాగుతున్నాయి.

కేవలం హమాస్‌ను మాత్రమే కాదు మొత్తం గాజాను నాశనం చేయడం లక్ష్యంగా దాడులు చేస్తున్నట్టు కనిపిస్తోంది. యుద్ధం ముగిసిన తరువాత గాజాను మిలిటరీ రహిత ప్రాంతంగా మారుస్తామని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. పోరు ఎంతకాలం సాగినా కొనసాగించేందుకు తాము సన్నద్దంగా ఉన్నట్లు హమాస్‌ బలంగా చెబుతోంది. ఎవరూ వెనక్కి తగ్గకపోవడంతో.. గాజాలో రక్తం ఏరులై పారుతోంది. 

అయితే ఏడు రోజుల కాల్పుల విరామంలో హమాస్‌ వద్ద ఉన్న వారిలో వంద మంది బందీలు, ఇజ్రాయిల్‌ జైళ్లల్లో అక్రమంగా నిర్బంధంలో ఉన్న పాలస్తీనా పౌరుల్లో 240 మంది విడుదల తరువాత పెద్ద ఎత్తున గాజా మీద ఇజ్రాయిల్‌ దాడులకు దిగింది. ఇంకా హమాస్‌ వద్ద 138 మంది బందీలు, వేలాది మంది పాలస్తీనా పౌరులు జైళ్లల్లో ఉన్నారు.

గత రెండు నెలల దాడుల్లో 16,248 మంది పాలస్తీనియన్లు మరణించారన్నది ఓ అంచనా..! అలాగే ఈ దాడుల్లో దాదాపు 50 వేల మందికి పైగా గాయపడ్డారు. దాడులను విరమించే వరకు చర్చల ప్రసక్తే లేదని హమాస్‌, దాడులను కొనసాగించి తీరుతామని ఇజ్రాయిల్‌ ప్రకటించాయి. ఇక హమాస్‌ మిలిటెంట్ల స్థావరాలు, మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ సైన్యం దాడులు తీవ్రతరం చేసింది.

ఖాన్‌ యూనిస్‌లో ఇజ్రాయెల్‌ తాజా దాడుల్లో 43 మంది మరణించారని హమాస్‌ వెల్లడించింది. సాధారణ జనావాసాలపై దాడులు చేయలేదని, హమాస్‌ స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నామని ఇజ్రాయెల్‌ ప్రకటించింది. ఇలాంటి ప్రకటనల సంగతి ఎలా ఉన్నా.. ఇరువైపుల జరుగుతున్న దాడుల్లో సామాన్య ప్రజలు భారీగానే బలవుతున్నారు. గాజాలో ఇప్పుడు సురక్షిత ప్రాంతం అంటూ ఏదీ లేకుండాపోయింది. దీంతో అక్కడి ప్రజలు తమ ప్రాణాలు కాపాడుకునే దారి కనిపించడం లేదు.

అక్కడ పరిస్థితి ప్రతి గంట గంటకూ దారుణంగా దిగజారుతోంది. ఇక గాజాలో హమాస్‌ మిలిటెంట్లు బలమైన సొరంగాల వ్యవస్థను నిర్మించుకున్నారు. అక్కడే వారి ఆయుధ నిల్వలు, కమ్యూనికేషన్‌ పరికరాలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ కలుగుల్లో దాక్కొని ఇజ్రాయెల్‌ సైన్యంపై దాడులకు దిగుతున్నారు. అందుకే ఆ సొరంగాలను ధ్వంసం చేయడానికి , వాటిని సముద్రపు నీటితో నింపేయాలని ఇజ్రాయెల్‌ రంగం సిద్ధం చేసింది. ఇందుకోసం నవంబర్‌లోనే అల్‌–షాతీ శరణార్థి శిబిరానికి మైలు దూరంలో 5 భారీ పంపులను ఏర్పాటు చేసింది. 

దక్షిణ గాజాలో రెండు లక్షల మందికి పైగా జనాభా ఉన్న ఖాన్‌యూనిస్‌ పట్టణాన్ని సర్వనాశనం చేయాలని ఇజ్రాయెల్ చూస్తోంది. పౌరులు పట్టణాన్ని ఖాళీ చేయాలని ఇప్పటికే అలర్ట్ చేశారు.మరింత దక్షిణంగా అంటే ఈజిప్టు సరిహద్దువైపు వెళ్లాలి. అటు తమ భూభాగంలోకి శరణార్ధులు రాకుండా ఈజిప్టు సరిహద్దులను మూసివేసింది.

ఉత్తర గాజాతో పోల్చుకుంటే ఎక్కువ ప్రాణనష్టం జరగకుండా దక్షిణ గాజాలో దాడులు చేస్తున్నామని ఇజ్రాయెల్  చెబుతున్నా..అక్కడ పరిస్థితి మాత్రం వేరేలా ఉంది. అమాయకులైన పౌరులకు ఎక్కడా రక్షిత ప్రాంతమంటూ లేకుండా పోయింది.  ఖాన్‌ యూనిస్‌ పట్టణం చుట్టూ ఆరుకిలోమీటర్ల పరిధిలో 150 ఇజ్రాయిలీ టాంకులు, సాయుధులతో కూడిన అనేక వాహనాలున్నట్లు ఉపగ్రహ చిత్రాలు చూపుతున్నాయి.

ఇక మరోవైపు అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్‌ కూడా పశ్చిమాసియాలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నా రు. ఆయా దేశాలు హమాస్‌ చర్యలను ఖండిస్తున్న నేపథ్యంలో పాలస్తీనా అథారిటీని పునరుద్ధరించి, పరిపాలన బాధ్యతలను వెస్ట్‌బ్యాంక్‌కు అప్పగించేలా చర్చలు జరుగుతున్నాయి. దీనికి అర్థం ఏంటంటే హమాస్ ను పూర్తిగా తుడిచిపెట్టాలనే ఇజ్రాయెల్‌ శపథాన్ని నెరవేరుస్తూనే గాజా భూభాగంపై ఇజ్రాయెల్‌ ఎలాంటి నియంత్రణ చేపట్టకుండా ఉండేలా జాగ్రత్తపడుతున్నాయి. అయితే ఒకవేళ వెస్ట్‌బ్యాంక్‌ను పాలస్తీనా అథారిటీగా గుర్తిస్తే.. ఇంతకాలం వ్యతిరేకిస్తూ వస్తున్న పాలస్తీనా అంశాన్ని ప్రపంచం అధికారికంగా గుర్తించే ప్రమాదం ఉంది.

ఇది ఇజ్రాయెల్ కు ఏమాత్రం మింగుడు పడని అంశం.  ఈ అంతర్జాతీయ రాజకీయాలు గురించి కాసేపు పక్కన పెడితే.. గాజాలో అమాయకుల పరిస్థితే దారుణంగా మారింది. పూర్తి స్థాయిలో గాజా ఇప్పట్లో కోలుకోవడం కష్టమే..! ఇంకా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఆకాశం నుంచి మృత్యువు ఎప్పుడు వచ్చి పడుతుందో చెప్పలేని పరిస్థితి. ఈ క్షణ బతికుండా చాలు అనుకుని ప్రాణాలను అరచేతిలో పట్టుకుని గాజా ప్రజలు బతుకీడిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement