సరిహద్దులు దాటి మెరుపు దాడులతో భయోత్పాతం సృష్టించిన హమాస్ పనిపట్టే లక్ష్యంతో ఇజ్రాయెల్ ఆర్మీ దూకుడుగా ముందుకు సాగుతోంది. ప్రస్తుతానికి గాజాస్ట్రిప్‌పై భారీ వైమానిక దాడులతో వందలాదిగా భవనాలను ఇజ్రాయెల్ ఆర్మీ నేలమట్టం చేస్తూ పోతోంది. సరిహద్దుల్లో యుద్ధ ట్యాంకులను మోహరించింది. దాని దృష్టంతా ఇప్పుడు హమాస్ శ్రేణులపైనే ఉంది. ఇజ్రాయెల్ ఆర్మీ అత్యాధునిక సాంకేతికత, ఆయుధ బలంతో హమాస్ ఏమాత్రం సరితూగదు. అయితే, గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ ఆర్మీ పని అనుకున్నంత సులువు కాదన్నది నిపుణుల మాట.
ఏళ్లపాటు శ్రమించి ఏర్పాటు చేసుకున్న రహస్య భూగర్భ సొరంగాల విస్తారమైన నెట్‌వర్క్ హమాస్‌కు పెట్టని కోటగా మారింది. గత వారం నరమేథం సృష్టించిన హమాస్ మిలిటెంట్లు సరిహద్దులు దాటేందుకు సముద్ర, భూ, ఆకాశ మార్గాలతోపాటు ఈ సొరంగమార్గాలను కూడా వాడుకున్నారనే అనుమానాలున్నాయి. శత్రుదుర్బేధ్యమైన టన్నెల్ నెట్ వర్క్ ఎలా, ఎక్కడుందన్నది ఇజ్రాయెల్ ఆర్మీకి అంతుచిక్కడం లేదు.
ఈ టన్నెళ్లలోనే హమాస్ ఆయుధ సామగ్రి, నెట్‌వర్క్ అంతా ఉన్నట్లు భావిస్తున్నారు. ఇజ్రాయెల్ బందీలను అండర్‌గ్రౌండ్‌లోనే దాచినట్లు ఆర్మీ అంటోంది. ఇజ్రాయెల్ 2014 నుంచి గాజా స్ట్రిప్‌తో ఉన్న 60 కిలోమీటర్ల సరిహద్దుల్లో భూగర్భంలో బారియర్లను ఏర్పాటు చేసింది. ఇందుకోసం రూ.7,500 కోట్లకు పైగా ఖర్చు చేసింది. సరిహద్దులకు ఆవలి వైపు ఏర్పాటయ్యే సొరంగాలను సైతం గుర్తించేందుకు ఎల్బిట్ సిస్టమ్స్, రఫేల్ అడ్వాన్స్‌డ్ డిఫెన్స్ సిస్టమ్స్‌కు బాధ్యతలు అప్పగించింది.
ఈ రెండు సంస్థలే ఇజ్రాయెల్‌కు క్షిపణి దాడులను అడ్డుకునే ఐరన్ డోమ్‌ను సమకూర్చాయి. ఐరన్‌వాల్, ఐరన్ స్పేడ్ పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి, ఇవి సాంకేతికతలను అభివృద్ధి పరిచాయి. అయితే, అవేవీ ఆశించిన ఫలితాలనివ్వలేదు. టన్నెళ్ల మధ్య లింకులను అవి కనిపెట్టలేకపోయాయి. ‘గాజా స్ట్రిప్‌లో రెండు లేయర్లున్నాయి.
ఒకటి పౌరులది కాగా, రెండోది హమాస్‌ది. హమాస్ నిర్మించుకున్న ఆ రెండో లేయర్ ఎక్కడుందో కనిపెట్టేందుకు మేం ప్రయత్నిస్తున్నాం’అని ఇజ్రాయెల్ రక్షణ శాఖ ప్రతినిధి జొనాథన్ కొన్రికస్ చెప్పారు. అండర్‌గ్రౌండ్ నెట్‌వర్క్‌ను ఛేదించడం అంత సులువు కాదు. గతంలోనూ ఇజ్రాయెల్ అనేక మార్లు ప్రయత్నించి భంగపడింది. 2021లో గాజాపై భారీ చేపట్టిన బాంబు దాడులతో 100 కిలోమీటర్ల పరిధిలోని టన్నెళ్లను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే, తమకు 500 కిలోమీటర్ల అండర్‌గ్రౌండ్ నెట్‌వర్క్ ఉన్నట్లు హమాస్ ఆ తర్వాత ప్రకటించుకోవడం గమనార్హం.
భూగర్భ మార్గాలు ప్రమాదకరమా?
సాంకేతికత ఎంతగా వృద్ధి చెందినప్పటికీ భూతల పోరాటంలో ఆధిపత్యం సాధించిన వారిని అక్షరాలా అణగదొక్కేందుకు టన్నెలింగ్ అత్యంత ప్రభావ వంతమైన మార్గంగా మారిపోయిందని స్కాట్ సవిట్జ్ అనే మిలటరీ నిపుణుడు అంటున్నారు. సొరంగాలు ఉన్నా యా, ఉంటే ఎన్ని ఉన్నాయి? అవి ఎక్కడ ఉ న్నాయి? అనేది వాటిని నిర్మించిన వారికే తప్ప ప్రత్యర్థికి తెలిసే అవకా శాలు చాలా తక్కువని ఆయన చెబుతు న్నారు.
సైనిక పరమైన నష్టాన్ని తగ్గించేందుకు రోబోట్‌లను పంపి సంక్లిష్టమైన సొరంగాలను కనిపెట్టొచ్చు. అయితే, లోపల జాగా తక్కువగా ఉండటం, బూబీ ట్రాప్‌లు, ఇతర ఆత్మరక్షణ ఏర్పాట్లను మిలిటెంట్లు ఏర్పాట్లు చేసుకొని ఉండే ఉంటారు. భూగర్భ టన్నెళ్ల వాతావరణం వారికే తప్ప ఇతరులకు తెలిసే అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో ఇజ్రాయెల్ బలగాలు అందులోకి ప్రవేశించి తీవ్ర ప్రతికూలతను ఎదుర్కోవాల్సి రావచ్చు’అని సవిట్జ్ హెచ్చరించారు.
ఎన్నో ఏళ్లుగా టన్నెళ్లను ఉపయోగించుకుంటున్న హమాస్
‘అత్యంత జనసాంద్రత కలిగిన గాజాలో హమాస్ ఎన్నో ఏళ్లుగా టన్నెళ్లను ఉపయోగించుకుంటోంది. ఆయుధాలు, కమాండ్ వ్యవస్థలు, ఫైటర్లను వాటిలోనే దాచిపెడుతోంది. వాటిలోకి వెంటిలేషన్ మార్గాలు, విద్యుత్ తదితర సౌకర్యాలను సైతం సమకూర్చుకుంది. కొన్ని టన్నెళ్లయితే 35 మీటర్ల లోతులో కూడా ఉన్నాయి. రైల్ రోడ్ మార్గాలు, కమ్యూనికేషన్ గదులూ ఉన్నాయి.
వాటి ప్రవేశ మార్గాలు ఎక్కువగా నివాస భవనాలు, కార్యాలయాల్లోనే ఉన్నాయి’అని నిపుణులు అంటున్నారు. మొదట్లో ఈ సొరంగాలను ఈజిప్టు నుంచి దొంగచాటుగా ఆయుధాలు, సరుకులను తరలించేందుకు వాడారు. సరిహద్దుల అవతల దాడులు జరిపేందుకు సైతం వీటిని ఉపయోగించుకున్నారు. 2006లో గిలాడ్ షలిట్ అనే ఇజ్రాయెల్ జవానును మిలిటెంట్లు సొరంగం ద్వారా దాడి చేసి, ఎత్తుకుపోయారు. అయిదేళ్ల తర్వాత వెయ్యి మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేశాక అతడిని వదిలిపెట్టారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment