100 మందికి పైగా దుర్మరణం
డెయిర్–అల్–బలాహ్: గాజా నగరంపై ఇజ్రాయెల్ ఆర్మీ మరోసారి విరుచుకుపడింది. పాలస్తీనా శరణార్థులు తలదాచుకుంటున్న అల్–తబీన్ స్కూల్‌పై శనివారం ఉదయం జరిగిన క్షిపణి దాడిలో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా డజన్ల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. హమాస్‌తో 10 నెలలుగా ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధంలో జరిగిన అత్యంత భీకర దాడుల్లో ఇదొకటని గాజా ఆరోగ్య శాఖ పేర్కొంది.
స్కూల్లోని హమాస్ కమాండ్ సెంటర్ లక్ష్యంగానే దాడి జరిపినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. ఈ ప్రకటనను హమాస్ ఖండించింది. దాడి తీవ్రతకు విశాలమైన ఆ పాఠశాల భవనం శిథిలాల దిబ్బగా మారి, గ్రౌండ్ ఫ్లోర్‌లో మొండిగోడలు మాత్రమే మిగిలున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. 100కు మృతదేహాలను స్థానికులు తమ ఆస్పత్రికి తీసుకువచ్చారని అల్–అహ్లి ఆస్పత్రి డైరెక్టర్ ఫదెల్ నయీమ్ చెప్పారు.
స్కూలు భవనంలోని మసీదులో ప్రార్థనలు చేస్తుండగా హెచ్చరికల్లేకుండా ఈ దాడి జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సుమారు 6 వేల మంది తలదాచుకుంటున్న ఈ భవనంపై 3 క్షిపణులు పడ్డాయని అధికారులు చెప్పారు. చాలా మృతదేహాలు గుర్తు పట్టేందుకు కూడా వీలులేనంతా ఛిద్రమయ్యాయన్నారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నందున, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment