గాజా: ఇన్నాళ్లూ పరస్పరం వైమానిక దాడులకు, రాకెట్ దాడులకే పరిమితమైన ఇజ్రాయెల్ సైనికులు, హామస్ మిలిటెంట్లు తొలిసారిగా ప్రత్యక్షంగా తలపడ్డారు. గాజా భూభాగంలో ఇరుపక్షాల మధ్య ముఖాముఖి పోరు సాగిందని హమాస్ సైనిక విభాగం అల్–ఖసమ్ బ్రిగేడ్స్ ఆదివారం వెల్లడించింది. ఈ నెల 7న యుద్ధం మొదలైన తర్వాత భూభాగంపైన ఇజ్రాయెల్, హమాస్ మధ్య ప్రత్యక్షంగా ఘర్షణ జరగడం ఇదే మొదటిసారి.
తమ భూభాగంలోకి దూసుకొచి్చన ఇజ్రాయెల్ మిలటరీకి చెందిన రెండు బుల్డోజర్లను, ఒక యుద్ధ ట్యాంక్‌ను ధ్వంసం చేశామని హమాస్ మిలిటెంట్లు ప్రకటించారు. తమ ఎదురుదాడిని తట్టుకోలేక ఇజ్రాయెల్ సైన్యం వాహనాలు వదిలేసి కాలినడకన వారి సరిహద్దు వైపు పలాయనం చిత్తగించిందని స్పష్టం చేసింది. ఈ మేరకు అల్–ఖసమ్ బ్రిగేడ్స్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఖాన్ యూనిస్ సిటీలో ఇజ్రాయెల్ సైన్యాన్ని ధీటుగా ఎదుర్కొన్నామని తెలియజేసింది.
అల్–ఖసమ్ బ్రిగేడ్స్ ప్రకటనపై ఇజ్రాయెల్ సైన్యం ప్రతిస్పందించింది. దక్షిణ గాజాలో సెక్యూరిటీ ఫెన్స్ వద్ద విధి నిర్వహణలో ఉన్న తమ బలగాలపై స్వల్పంగా కాల్పులు జరిగాయని స్పష్టంచేసింది. కాల్పులు జరిపిన మిలిటెంట్లపై తమ యుద్ధ ట్యాంకు నుంచి ప్రతిదాడి చేశామని పేర్కొంది. దాంతో వారంతా చెల్లాచెదురు అయ్యారని వెల్లడించింది. గాజా భూభాగంలో తమ సేనలు మకాం వేసిన మాట వాస్తవమేనని ఇజ్రాయెల్ మరోసారి అంగీకరించింది. ఈ నెల 13న కూడా ఇదే మాట చెప్పింది. కానీ, హమాస్‌తో ముఖాముఖి ఘర్షణ జరిగినట్లు వెల్లడించడం మాత్రం ఇదే ప్రథమం. ఇదిలా ఉండగా, ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హమాస్ ప్రముఖ నేత ముహమ్మద్ కటామాష్ హతమయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment