
బహుమతుల కోసం ప్రేమ పేరుతో మహిళలను మోసం చేసిన తకాషి మియాగావా
టోక్యో: ఒకేసారి ఇద్దరు అమ్మాయిలను ప్రేమించేవారిని చూశాం. మహా అయితే ఓ ఐదుగురిని అనుకుందాం.. కానీ ఇప్పుడు మీరు చదవబోయే వ్యక్తి వీరందరికన్నా తోపు. ఎలా అంటే ఇతగాడు ఒకేసారి 35 మందిని ప్రేమలో దించాడు. విజయవంతంగా సాగిపోతున్న ఈ రోమియే లవ్‌ట్రాక్‌కి బ్రేక్ వేసింది అతడి కక్కుర్తి బుద్దే. అదేంటో తెలియాలంటే ఇది చదవాల్సిందే.. జపాన్ దక్షిణ ప్రాంతానికి చెందిన తకాషి మియాగావా(39) హైడ్రోజన్ వాటర్ షవర్ హెడ్స్, ఇతర పరికరాలు అమ్మే మార్కెటింగ్ కంపెనీలో పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తున్నాడు.
ఈ క్రమంలో మియాగావాకి తనకి పరిచయం అయిన వారిలో ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకునేవాడు. వారితో ప్రేమగా మాట్లాడుతూ.. ముగ్గులోకి దింపేవాడు. ఆ తర్వాత తాను వారిని ఎంతో సీరియస్‌గా ప్రేమిస్తున్నానని నమ్మబలికేవాడు. ఇలా ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 35 మంది మహిళలను ఏకకాలంలో ప్రేమలో పడేశాడు. ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే వీరిలో కొందరు వయసులో ఇతడి కంటే పెద్దవారు కూడా ఉన్నారు.
ఇక మియాగావా ఒరిజనల్ పుట్టిన రోజు నవంబర్ 14 కాగా.. తన ప్రియురాళ్లకి మాత్రం వేర్వేరు నకిలీ తేదీలు చెప్పి వారి నుంచి గిఫ్ట్స్ పొందేవాడు. ఒకరికి ఫిబ్రవరి.. మరోకరికి జూన్.. ఇంకొకరికి ఏప్రిల్ ఇలా ఫేక్ బర్త్‌డే తేదీలు చెప్పి.. వారి నుంచి లక్ష జపనీస్ యెన్‌ల(69,442 రూపాయలు) విలువ చేసే దుస్తులు, డబ్బు బహుమతులుగా పొందాడు. అంతటితో ఆగక.. తన గర్ల్‌ఫ్రెండ్స్‌లో కొందరి చేత తాను పని చేస్తున్న కంపెనీ ఉత్పత్తులు కొనేలా చేశాడు. అలా దాని మీద కూడా లాభం పొందాడు.
ఇక తన ప్రియురాళ్లలో ఎవరైనా పెళ్లి చేసుకోమని అడిగితే.. తాను సెటిల్ అవ్వాలని.. త్వరలోనే పెళ్లి చేసుకుంటానని తెలిపేవాడు. ఇతగాడి మీద అనుమానం వచ్చిన కొందరు ప్రియురాళ్లు మియాగావా గురించి ఎంక్వైరీ చేయగా అతడి బాగోతం బట్టబయలైంది. కేవలం బహుమతుల పొందడం.. తన ఉద్యోగంలో టార్గెట్ రీచ్ కావడం కోసమే ఇంత మందితో ప్రేమాయణం నడిపినట్లు అంగీకరించాడు మియాగావా. బాధిత మహిళల ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
బాధితుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నారు పోలీసులు. ఈ సంఘటనపై నెటిజనులు భిన్నంగా స్పందిస్తున్నారు. ‘‘నీ మార్కెటింగ్ తెలివికి జోహార్లు నాయనా’’ అంటుండగా.. ‘‘మరికొందరు నెలకి 30 రోజులు.. రోజుకొక గర్ల్‌ఫ్రెండ్ చొప్పున కలిసినా.. మరో ఐదుగురు బ్యాలెన్స్ ఉంటారుగా.. ఎలా మ్యానేజ్ చేశావ్ సామి’’ అంటూ ప్రశ్నిస్తున్నారు.