చరిత్రలో అత్యంత భీకర సునామీ ఏదో తెలుసా? | Japan Tsunami 2024: The 10 most destructive tsunamis in history | Sakshi
Sakshi News home page

జపాన్‌లో సునామీ అలజడి: చరిత్రలో అత్యంత భీకర సునామీ ఏదో తెలుసా?

Published Mon, Jan 1 2024 8:03 PM | Last Updated on Mon, Jan 1 2024 8:27 PM

Japan Tsunami 2024: The 10 most destructive tsunamis in history - Sakshi

అనూహ్యంగా విజృంభించే ప్రకృతి ప్రళయాల నుంచి తప్పించుకోవడం మానవాళికి అసాధ్యం!.  హిందూ మహాసముద్ర తీర ప్రాంతంలో 2004 డిసెంబర్‌ 26వ తేదీన  సునామీ విధ్వంసం సృష్టించే వరకు సునామీ అనే ఓ విపత్తు గురించి సామాన్య ప్రజలకు పెద్దగా తెలియదు. తాజాగా జపాన్‌లో.. అదీ కొత్త సంవత్సరం నాడే  సునామీ అలజడి రేగింది. ఈ నేపథ్యంలో చరిత్రలో ఇప్పటిదాకా నమోదు అయిన అత్యంత భీకర సునామీలను.. అవి కలగజేసిన నష్టాల్ని ఓసారి తిరగేద్దాం. 

🌊ఎన్షునాడా సముద్రం, జపాన్, 1498
రిక్టర్‌ స్కేల్‌పై 8.3 తీవ్రతతో కూడిన భూకంపం దెబ్బకు సంభవించిన ఈ సునామీ జపాన్‌లోని పలు తీర ప్రాంతాల్ని ముంచెత్తింది. సుమారు 31 వేల మందిని బలితీసుకుంది.

🌊ఐస్‌ బే జపాన్, 1586
రిక్టర్‌ స్కేల్‌పై 8.2 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం వల్ల ఏర్పడిన ఈ సునామీలో సముద్ర అలలు 6 మీటర్ల ఎత్తుమేర ఎగిసిపడి పలు పట్టణాల్ని ధ్వంసం చేశాయి. బివా అనే సముద్రం ఐస్‌ బే పట్టణం ఆనవాళ్లు కనిపించనంత స్థాయిలో ముంచెత్తింది. ఇందులో 8 వేల మంది మరణించారు. 

🌊నాంకైడో, జపాన్, 1707
8.4 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల ఏర్పడిన సునామీ దెబ్బకు సముద్ర అలలు 25 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడ్డాయి. ఇందులో సుమారు 30 వేల మంది చనిపోగా, భారత్‌లోని కొచ్చిలో బలమైన సముద్ర అలలు తీరాన్ని దాటుకుని చొచ్చుకొచ్చాయి.

🌊లిస్బన్, పోర్చుగల్, 1755
8.5 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి పోర్చుగల్‌ పశ్చిమ తీరం, స్పెయిన్‌ దక్షిణ తీరాల్లో సునామీ వచ్చింది. కొన్నిచోట్ల సముద్ర అలలు 30 మీటర్ల ఎత్తుకు లేచాయి. పోర్చుగల్, మొరాకో, స్పెయిల్‌ దేశాల్లో సుమారు 60 వేల మంది చనిపోయారు.

🌊రైకూ దీవులు, జపాన్, 1771
7.4 తీవ్రతతో సంభవించిన భూకంపంతో ఏర్పడిన సునామీ వల్ల ఈ ప్రాంతంలోని పలు దీవులు      దెబ్బతిన్నాయి. ఇషిగాకి దీవిలో 85.4 ఎత్తు మేర అలలు ఎగిసిపడ్డాయి. ఇందులో సుమారు 3 వేల ఇళ్లు ధ్వంసం కాగా, 12 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

సునామీ అనేది జపనీస్‌ భాషకు చెందింది. దానికి అర్థం హార్బర్‌ కెరటం. సునామీలు ఏర్పడినప్పుడు రాకాసి అలలు 100 అడుగుల ఎత్తు వరకు వెళతాయి.సునామీ అలలు గంటకి 805 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఒక జెట్‌ విమానం స్పీడ్‌తో ఇది సమానం.ప్రపంచంలో జపాన్‌ తర్వాత అమెరికాలోని హవాయి, అలస్కా, వాషింగ్టన్, ఒరెగాన్, కాలిఫోర్నియాకు సునామీ ముప్పు ఎక్కువ. అందులో హవాయి దీవులకి ఉన్న ముప్పుమరెక్కడా లేదు. ప్రతీ ఏడాది అక్కడ సునామీ సంభవిస్తుంది. ప్రతీ ఏడేళ్లకి తీవ్రమైన సునామీ ముంచేస్తుంది. పసిఫిక్‌ మహాసముద్రంలో రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌ కారణంగానే 80 శాతానికి పైగా సునామీలు సంభవిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నవంబర్‌ 5వ తేదీన సునామీ అవగాహన దినోత్సవం నిర్వహిస్తున్నారు. 

🌊ఉత్తర చిలీ, 1868
8.5 తీవ్రతతో సంభవించిన రెండు వేర్వేరు భూకంపాల వల్ల ఈ సునామీ ఏర్పడింది. 21 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడిన అలల మూడు రోజుల పాటు విధ్వంసం సృష్టించాయి. ఇందులో సుమారు పాతిక వేల మంది చనిపోగా, 300 మిలియన్ల మేర ఆర్థిక నష్టం వాటిల్లింది.

🌊క్రకటోవా, ఇండోనేసియా, 1883
క్రకటోవా అగ్నిపర్వతం బద్దలవడం వల్ల ఈ సునామీ సంభవించింది. 37 మీటర్ల ఎత్తులో ఎగిసిపడిన అలలు అంజీర్, మెరాక్‌ పట్టణాల్లో విధ్వంసం సృష్టించాయి. బాంబేలో తీరం నుంచి సముద్రం వెనక్కిపోయినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ సునామీలో సుమారు 36 వేల మంది చనిపోయారు.

🌊సాంక్రికు, జపాన్, 1896
జపాన్‌లోని సాంక్రికు తీరంలో సంభవించిన భూకంపం దెబ్బకు ఏర్పడిన సునామీ వల్ల 38.2 మీటర్ల ఎత్తు మేర సముద్ర అలలు ఎగిసిపడ్డాయి. ఇందులో 11 వేల ఇళ్లు నేలమట్టం కాగా, సుమారు 22 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో చైనాలో సంభవించిన సునామీలో 4 వేల మంది చనిపోయారు.

🌊సుమత్రా, ఇండోనేసియా, 2004
9.1 తీవ్రతతో కూడిన భూకంపం కారణంగా సంభవించిన ఈ సునామీ ఇండోనేసియాతో పాటు శ్రీలంక, భారత్‌ తీర ప్రాంతాల్లో పెను ప్రళయం సృష్టించింది. 50 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడిన సముద్ర అలలు తీర ప్రాంతం నుంచి 5 కి.మీ దూరం వరకు చొచ్చుకొచ్చాయి. సుమారు 2 లక్షల మంది మృత్యువాత పడగా, 10 బిలియన్‌ డాలర్ల మేర ఆర్థిక నష్టం వాటిల్లింది. ఇప్పటి వరకు తెలిసిన అత్యంత భీకర సునామీ ఇదేనని భావిస్తున్నారు. దీని ప్రభావంతో అమెరికా, యూకే, అంటార్కిటికా తదితర ప్రాంతాల్లో కూడా అలలు ఎగిసిపడ్డాయి. ఈ భూకంపం 23 వేల ఆటంబాంబుల పేలుళ్లతో సమానం.

🌊ఉత్తర పసిఫిక్‌ తీరం, జపాన్, 2011
పది మీటర్లకు పైగా ఎగిసిపడిన రాకాసి అలలు 18 వేల మందిని బలిగొన్నాయి. అంతకుముందు, 24.4 తీవ్రతతో సంభవించిన భూకంపం ఇప్పటి వరకు వచ్చిన నాలుగో అతి పెద్దదని భావిస్తున్నారు. ఈ దెబ్బకు సుమారు 4.50 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. భూ ప్రకంపనలకు ఫుకుషిమా దైచీ అణు విద్యుత్‌ కేంద్రం నుంచి రేడియోధార్మిక వాయువులు లీకు కావడంతో భారీగా నష్టం వాటిల్లింది. ఈ నష్టాన్ని అధిగమించడానికి జపాన్‌కు ఐదేళ్లు పట్టింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement