సియోల్: ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మంగళవారం రష్యాలో అడుగు పెట్టారు. రష్యాకు కిమ్ వెళ్లడం ఇది రెండో సారి. తొలుత 2019లో ఆయన మొదటిసారి రష్యాలో పర్యటించారు. దాదాపు నాలుగేళ్ల తరువాత మరోసారి రష్యాలో పర్యటిస్తున్నారు. మంగళవారం కొందరు మంత్రులతో భేటీ అయ్యారు.
బుధవారం రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో కిమ్ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందనేది ఇంకా తెలియరాలేదు. 2019లో ఇరువురు నేతలు వ్లాదివోస్తోక్‌లోనే సమావేశమయ్యారు. ఈసారి కూడా భేటీ అక్కడే జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై కిమ్ మాట్లాడుతూ.. దేశాల సంబంధాల వ్యూహాత్మక ప్రాముఖ్యత కోసం రష్యాతో భేటీ అవుతున్నట్లు తెలిపారు.
ఇక పటిష్టమైన భద్రత మధ్య విలాసవంతమైన బుల్లెట్ ప్రూఫ్ రైలులో సుదీర్ఘంగా ప్రయాణించి రష్యాకు చేరుకున్నారు. ఆయన ఆదివారం మధ్యాహ్నం ఉత్తర కొరియా రాజధాని పాంగ్‌యాంగ్ నుంచి రైలులో బయలుదేరారు. 740 కి.మీ ప్రయాణించి ఉత్తర కొరియా సరిహద్దుకు సమీపంలో రష్యా భూభాగంలో ఉన్న వ్లాదివోస్తోక్ నగరానికి ఉత్తర దిక్కున 60 కిలోమీటర్ల దూరంలోని ఉసురియ్‌స్క్ అనే ప్రాంతానికి ఈ రైలు చేరుకున్నట్లు దక్షిణ కొరియా వార్తా సంస్థ కేసీఎన్‌ఏ వెల్లడించింది.
ఈ ప్రాంతంలో కొరియన్ల జనాభా చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉంది. అయితే, కిమ్ గమ్యస్థానం ఏమిటన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. కిమ్ రష్యాకు చేరినట్లు క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ నిర్ధారించారు. పశ్చిమ దేశాల ఆంక్షల వల్ల ఒంటరిగా మారిన కిమ్ జోంగ్ ఉన్ రష్యా సహాయాన్ని అర్థిస్తున్నారు.
చదవండి: అమెరికాకు వ్యతిరేకంగా చేతులు కలిపిన రష్యా, ఉత్తర కొరియా
గంటకు 50 కిలోమీటర్ల వేగమే..
ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ ప్రయాణించిన రైలుకు చాలా ప్రత్యేకతలున్నాయి. ఈ రైలు కేవలం గంటకు 50 కిలో మీటర్ల వేగంతోనే ప్రయాణిస్తుంది. దీనికి భారీగా సాయుధ కవచాలు అమర్చి ఉండటంతో భారీ బరువు కారణంగా వేగంగా వెళ్లలేదు. ఈ రైలుపేరు తయాంఘో.. అంటే కొరియా భాషలో సూర్యుడు అని అర్థం. ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు కిమ్ ఇల్ సంగ్‌కు గుర్తుగా ఈ పేరుపెట్టారు. ఆయన కాలం నుంచే ఉ.కొరియా నేతలు సుదూర ప్రయాణాలను రైల్లోనే చేయడం మొదలుపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment